పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం భారీ ప్రకటన

Fuel Prices Cut By Rs 2.50 With Immediate Effect - Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాతపెడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయంగా వాహనదారులకు జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కేవలం క్రూడాయిల్‌ ధరలే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల వల్లే ఈ మేర పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాకపుట్టిస్తున్నాయని విపక్షాలు, వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ధరలు పెరుగుతుండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

అటు విపక్షాలు, ఇటు వాహనదారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్లతో, దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంతేకాక ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కూడా లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరను రూపాయి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో మొత్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.2.50 తగ్గాయి. తగ్గించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో, రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను రూ.2.50 తగ్గించాలని అరుణ్‌జైట్లీ ఆదేశించారు. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 86 డాలర్లను దాటిందని మంత్రి అన్నారు. దీంతో కరెన్సీ మార్కెట్‌తో పాటు స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం పడిందని జైట్లీ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుందని, కానీ అంతర్జాతీయ అంశాలు భారత మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయన్నారు. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో రూ.21,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని జైట్లీ తెలిపారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలను డీరెగ్యులేషన్‌ చేయాలని తాము భావించడం లేదని జైట్లీ చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌ పెరగడం, దేశీయంగా రూపాయిని కూడా భారీగా కుప్పకూల్చుతుంది. రూపాయి ఎఫెక్ట్‌, చమురు ధరల సెగ స్టాక్‌ మార్కెట్లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించడంతో, వెంటనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top