కేంబ్రిడ్జ్‌ స్కాండల్‌ : ఫేస్‌బుక్‌ యూజర్లకు నోటీసులు

Facebook To Send Data Use Notices To Cambridge Analytica Affected Users - Sakshi

న్యూఢిల్లీ : కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌లో మీ ఫేస్‌బుక్‌ డేటా చోరికి గురైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. నేటి నుంచే కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌లో ప్రభావితమైన 8.7 కోట్ల మంది యూజర్లలో ఎవరెవరో ఉన్నారో ఫేస్‌బుక్‌ తెలియజేస్తుందట. యూజర్ల న్యూస్‌ ఫీడ్స్‌లో ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ తెలియజేస్తుందని తెలిసింది. ఈ స్కాండల్‌లో ప్రభావితమైన యూజర్లలో ఎక్కువ మంది(7 కోట్ల మంది) అమెరికన్లే ఉన్నట్టు ఫేస్‌బుక్‌ ఒప్పుకుంది. మిగతా యూజర్లు ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా, యూకే యూజర్లున్నారని కూడా తెలిపింది. అంతేకాకుండా 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా భారత్‌లో ఎన్నికల సమయంలో, కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు చెందిన సంస్థకు షేర్‌ చేశామని ఫేస్‌బుక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం ప్రభావితమైన యూజర్లకు ఫేస్‌బుక్‌ నోటీసులు పంపబోతోంది. దీంతో పాటు మిగతా 2.2 బిలియన్‌ యూజర్లకు కూడా ‘‍ప్రొటెక్టింగ్‌ యువర్‌ ఇన్‌ఫర్మేషన్‌’ పేరుతో మరో నోటీసులు జారీచేయనుంది. దీంతో పాటు ఓ లింక్‌ను కూడా పంపిస్తుంది. ఆ లింక్‌లో కొన్ని యాప్‌ల వివరాలు వాటికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి.. ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అనే వివరాలు ఉంటాయని తెలుస్తోంది.

కేంబ్రిడ్జ్‌ స్కాండల్‌తో చరిత్రలోనే అతిపెద్ద గోప్యత సంక్షోభంలో ఫేస్‌బుక్‌ కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు చెందిన ఈ డేటా మైనింగ్‌ సంస్థతో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను పంచుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫేస్‌బుక్‌ డేటాను భారీ మొత్తంలో ఈ సంస్థ వాడుకుంది. దీంతో ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎలా ఫేస్‌బుక్‌ డేటాను యూజర్ల అనుమతి లేకుండా షేర్‌ చేశారని యూజర్లు, టెక్‌ వర్గాలు మండిపడుతున్నాయి. తాము అతిపెద్ద తప్పు చేశామని కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు, భవిష్యత్తులో యూజర్ల గోప్యత విషయంలో వాగ్దానాలు చేసేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు కూడా రాబోతున్నారు. ఈ సమయంలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారని తెలిసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top