డాలర్‌ బలహీనతే బలంగా బంగారం | COT Gold, Silver and US Dollar Index | Sakshi
Sakshi News home page

డాలర్‌ బలహీనతే బలంగా బంగారం

Published Mon, Jun 5 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

డాలర్‌ బలహీనతే  బలంగా బంగారం

వారంలో 96.61కి దిగిన డాలర్‌ ఇండెక్స్‌
13 డాలర్లు ఎగసిన పసిడి
3 వారాల్లో 60 డాలర్ల పెరుగుదల


అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి తోడు డాలర్‌ బలహీనత బంగారానికి బలిమిగా మారుతోంది. జూన్‌ 2వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) మరో 13 డాలర్లు లాభపడి 1,279 డాలర్లకు చేరింది. వరుసగా మూడు వారాల్లో పసిడి దాదాపు 60 డాలర్లకు పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా కీలక పరిణామాల నేపథ్యంలో... పసిడి పరుగు మున్ముందూ కొనసాగుతుందన్న అంచనాలున్నాయి.  తక్షణం అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు (ప్రస్తుతం 0.75–1 శాతం) పెంచదన్న అంచనా ఇందులో  ఒకటి.

కొనసాగుతున్న డాలర్‌ పతనం!: అమెరికాలో ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే అమెరికా అధ్యక్షుని డాలర్‌ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే డాలర్‌ పతనం కొనసాగుతుండడం గమనార్హం.  మే 26వ తేదీ ముగిసిన వారంలో 97.33 వద్ద ముగిసిన  డాలర్‌ ఇండెక్స్,  జూన్‌ 2తో ముగిసిన వారంలో 96.61కు చేరింది.  100.51, 99.75, 99.04, 98.42 ఇలా... నాలుగు వారాలుగా తగ్గుతూ వచ్చిన డాలర్‌ ఇండెక్స్‌ మే 13వ తేదీతో ముగిసిన వారంలో మాత్రం స్వల్పంగా కోలుకుని 99.05 వద్ద ముగిసింది.  అయితే మళ్లీ వారం తిరిగే సరికి అంటే మే 19వ తేదీతో ముగిసిన వారంలో  భారీగా 2.05 డాలర్లు పతనమై 97.00 వద్ద ముగియడం గమనార్హం. మే 26వ తేదీతో ముగిసిన వారంలో కొంత కోలుకున్నా, మళ్లీ పడిపోవడం గమనార్హం.

భారత్‌లో ‘రూపాయి’ అడ్డు
అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినప్పటికీ ఆ ప్రభావం దేశంలో గడచిన వారంలో అంతగా కనబడలేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ పటిష్టత దీనికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు జూన్‌ 2వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా రూ.16 తగ్గి రూ.28,871కు పడింది. అంతక్రితం రెండు వారాల్లో ఇక్కడ ధర దాదాపు రూ.900 లాభపడింది.  ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.65 తగ్గి రూ.28,920కి చేరింది.

Advertisement
Advertisement
Advertisement