గీతాంజలికి ఐసీఐసీఐ రుణాలపై సీబీఐ దర్యాప్తు | Sakshi
Sakshi News home page

గీతాంజలికి ఐసీఐసీఐ రుణాలపై సీబీఐ దర్యాప్తు

Published Thu, Apr 12 2018 1:08 AM

CBI inquiry on ICICI loan for Geetanjali - Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద ఆభరణాల వ్యాపారవేత్త మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ సారథ్యంలోని కన్సార్షియం ఇచ్చిన రుణాలపై తాజాగా సీబీఐ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసును సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ సారథ్యంలోని 31 బ్యాంకుల కన్సార్షియం.. గీతాంజలి గ్రూప్‌నకు రూ. 5,280 కోట్ల మేర రుణాలిచ్చాయి. దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచర్, యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ శిఖా శర్మలను మార్చి 6న ఎస్‌ఎఫ్‌ఐవో ప్రశ్నించింది.

సీబీఐ ప్రస్తుతం పీఎన్‌బీని వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును దర్యాప్తు చేస్తోంది. పీఎన్‌బీ ఉద్యోగులతో కుమ్మక్కై తీసుకున్న నకిలీ లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎల్‌వోయూ)ల ద్వారా మోదీ తదితరులు ఈ కుంభకోణానికి తెరతీశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బహ్రెయిన్‌లోని కెనరా బ్యాంక్‌ అధికారులు ఇద్దరిని, యాంట్‌వెర్ప్‌ (బెల్జియం)లోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారి ఒకరినికి సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. 

Advertisement
Advertisement