ఈ తప్పులకు తప్పదు... మూల్యం!

CA Govind M Chandak Speaks About Financial Risks - Sakshi

బీమా పెట్టుబడుల కోసం కాదు

క్రెడిట్‌ కార్డు వినియోగం తెలియాలి

కాంపౌండింగ్‌ మహిమ తెలియకపోతే కష్టం

టిప్స్‌ చూసి స్టాక్స్‌ కొనొద్దు

వైద్య బీమా లేకపోతే బడ్జెట్‌ తలకిందులు

మనలో చాలా మందికి ఆర్థిక విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన తక్కువేనని అంగీకరించాల్సిందే..! ఎందుకంటే అవసరాలకు ఖర్చు చేయడం మినహా, ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళిక చాలా మందిలో కనిపించదు. ఈ కారణంగానే ఎంతో మంది ఆర్థిక అంశాల విషయంలో తమకు తెలియకుండానే ఎన్నో తప్పులకు చోటు ఇస్తుంటారు. కానీ, వీటి కారణంగా ఎంతో నష్టపోవాల్సి రావచ్చు. వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్, జేఎస్‌జీ అండ్‌ కంపెనీకి చెందిన సీఏ గోవింగ్‌ ఎం.చందక్‌. భారతీయులు సాధారణంగా చేసే ఇటువంటి తప్పులు, వాటి కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాల గురించి ఆయన ఒక నివేదిక రూపంలో తెలియజేశారు. 

భవిష్యత్తు లక్ష్యాల దృష్ట్యా రాబడుల కోసం బీమా పాలసీల్లో మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? ప్రతీ 100 మందిలో 95 మంది ఇదే తప్పు చేస్తున్నారు. ఎటువంటి రాబడులు ఇవ్వని, చౌక ప్రీమియంకు అధిక బీమా రక్షణనిచ్చే టర్మ్‌ పాలసీకి.. ‘ప్రీమియం ఎక్కువ, బీమా కవరేజీ తక్కువ’ ధోరణితో కూడిన ఎండోమెంట్‌ పాలసీకి మధ్య తేడా తెలిసిన వారు తక్కువ మందే ఉన్నారు.   

క్రెడిట్‌ కార్డు మిస్టరీ 
క్రెడిట్‌ కార్డుపై పరిమితిని వాడేసుకుని, కనీస మొత్తమే చెల్లిస్తున్నారా..? అయితే, మీరు క్రెడిట్‌కార్డు మాయ(రుణ ఊబి)లో చిక్కుకున్నట్టే. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు బిల్లు రూ.40,000 వినియోగించుకుని.. గడువు నాటికి ఈ మొత్తాన్ని చెల్లించకపోతే ఆలస్యపు ఫీజు కింద రూ.100–1,000 మధ్య చెల్లించాలి. ఈ ఫీజు తప్పించుకునేందుకు కనీస బకాయి కింద బిల్లులో 5 శాతం చెల్లించడం ద్వారా కార్డును యాక్టివ్‌గానూ ఉంచుకోవచ్చు. కానీ, ఇలా కొద్ది మొత్తమే చెల్లించడం వల్ల మిగిలి ఉన్న బకాయిపై భారీ వడ్డీ బాదుడు ఉంటుంది. 

కాంపౌండింగ్‌ మహిమ 
రాబడి/వడ్డీ వచ్చి అసలుకు చేరడాన్ని కాం పౌండింగ్‌గా చేప్పుకోవచ్చు. ఇలా రాబడి నిర్ణీత కాలానికోసారి అసలుకు కలుస్తుంటే, కొంత కాలా నికి సంపద గణనీయంగా వృద్ధి చెందుతుంది. పెట్టుబడులకు ఎంత సుదీర్ఘకాలం ఉంటే, కాంపౌడింగ్‌ మహిమతో రాబడి అంత అధికంగా ఉంటుంది. కాంపౌండింగ్‌ మహిమను ప్రపంచంలో ఎనిమి దో అద్భుతంగా ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అభివర్ణించారు.

టిప్స్‌ సాయంతో స్టాక్స్‌ కొనుగోలు 
స్వీయ అధ్యయనం లేకుండా, కంపెనీల ఫండమెంటల్స్‌ గురించి పూర్తి అవగాహనకు రాకుండా.. టిప్స్‌ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఎదురవుతాయి.

జీవన ద్రవ్యోల్బణం 
వేతనం పెరిగిందని అప్పటి వరకు 2బీహెచ్‌కే ఇంట్లో ఉన్న వారు 3బీహెచ్‌కే ఇంటికి మారిపోవడం.. మంచి బోనస్‌ వచ్చిందని కారును మార్చేయడం అన్నవి జీవన ద్రవ్యోల్బణానికి మంచి ఉదాహరణలు. అవసరం ఉంటే తప్ప వేతనం పెరిగిందని ఇలా చేస్తే ఆర్థికంగా తప్పటడుగే. 

తక్కువ ధరలకు వస్తున్నాయని 
డిస్కౌంట్‌ చూసి అవసరం లేకపోయినా కొనే వారు చాలా మందే ఉన్నారు. అంటే అవసరం లేని దాని కోసం వృధా చేయడమే అవుతుంది.  

వారాంతపు పార్టీలు 
వారంలో ఐదు రోజులు పని. రెండు రోజులు వినోదం. నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తున్న సంస్కృతి ఇది. వారాంతాల్లో పబ్‌లు, పార్టీల పేరుతో భారీగా ఖర్చు చేసేస్తే.. నెలాఖరుకు బ్యాలన్స్‌ సున్నాకు చేరుతుంది. 

ఖర్చులను కనిపెట్టడం 
దేనికోసం, ఎంత, ఎందుకు ఖర్చు చేస్తున్నామన్నది పట్టించుకునే వారు తక్కువే. ఇది దీర్ఘకాలంలో ఎంతో నష్టానికి దారితీస్తుంది.  

అత్యవసర నిధి లేకపోవడం 
అత్యవసర సందర్భాల్లో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఫండ్‌ అంటూ లేకపోతే.. క్రెడిట్‌ కార్డును గీకడం లేదా పర్సనల్‌ లోన్‌ లేదా గోల్డ్‌ లోన్‌ లేదా తెలిసిన వారి దగ్గర చేయి చాచాల్సి వస్తుంది. ఇలా చేస్తే మీ జీవన లక్ష్యాలకు మిగిలేది ఏముంటుంది?  

ఆర్థిక ప్రణాళిక 
చాలా మందికి ఆర్థిక లక్ష్యాలనేవి ఉండడం లేదు. దాంతో డబ్బును దాచుకోవాలన్న ఆలోచన కూడా వారికి ఉండడం లేదు.

ఆరోగ్య బీమా అవసరం 
వైద్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలైతే.. చెల్లించాల్సిన బిల్లు అప్పటి వరకు చేసుకున్న పొదుపులన్నింటినీ కరిగించేస్తుంది. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకుండా వాటిని భరించడం సామాన్య, మధ్యతరగతి వారివల్ల అయ్యే పని కాదు.

వైవిధ్యానికి దూరం కావడం 
పొదుపు మొత్తాన్ని తీసుకెళ్లి రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో లేక బంగారంపైన లేక పూర్తిగా స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసే వారు.. అలాగే బ్యాంకు లాకర్లలో పెట్టేవారూ ఉన్నారు. ఇలా ఒకటి రెండింటికే పరిమితం కాకుండా, తమ రిస్క్‌ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు కొద్ది మందే ఉంటారు.

వాయిదా వేయడం 
‘రేపటి నుంచి ఇన్వెస్ట్‌ చేయాలి’.. ‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి’.. ఇలా అనుకోవడమే కానీ, ఆచరణలో పెట్టే వారు తక్కువే. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం లేదా జాప్యం చేయడం వల్ల నష్టమే ఎక్కువ. 

ఓపిక లేమి 
డబ్బులు పిల్లలు పెట్టాలంటే అందుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. కొందరికి స్వల్ప కాలంలోనే పెట్టుబడి రెట్టింపు కావాలని ఉంటుంది. అందుకే స్టాక్‌ మార్కెట్‌ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఇలా ఓపిక లేమి, పెట్టుబడి సాధనాల గురించి, రిస్క్, రాబడులను అర్థం చేసుకోకపోవడం వల్ల నష్టపోయేవారు చాలా మందే ఉన్నారు.

ఇతరుల నిర్ణయాలపై ఆధారపడడం 
పెట్టుబడుల గురించి తెలియక ఇతరులపై ఆధారపడే వారూ ఉన్నారు. తమ కష్టార్జితాన్ని వృద్ధి చేయాలంటూ ఇతరుల చేతుల్లో పెడితే గాల్లో దీపం వంటిదే. రాబడులు రావచ్చు లేకపోతే మొత్తం కోల్పోవచ్చు.  

సమయాన్ని వృధా చేసుకోవడం 
కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి బదులు ఎక్కువ మంది సోషల్‌ మీడియాలో, యూట్యూబులలో గడిపేస్తుంటారు.  

ఆస్తులు–అప్పులు
భవిష్యత్తు ఆదాయాలపై భరోసా లేనివారు కారువంటి విలాసాలు అప్పుపై కొనడం అంత మంచిదికాదు.

వీటిపైనా దృష్టి పెట్టాలి...
లాకర్లలో బంగారం: రూ.లక్షలతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకుని, రక్షణ కోసం తీసుకెళ్లి బ్యాంకు లాకర్లలో పెట్టేస్తుంటారు. లక్షలాది రూపాయలు ఆభరణాల రూపంలో బ్లాక్‌ అయినట్టే. వీటిపై రాబడి ఉండదు. దీర్ఘకాలంలో బంగారం ధర పెరిగినా ఆభరణాలను అమ్ముకునేందుకు మనస్కరించదు.

కష్టార్జితమంతా పెళ్లిళ్లకే: కొందరు తమ కష్టార్జితమంతా తమ పిల్లల పెళ్లిళ్ల కోసమే ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల తదనంతర కాలంలో వారి జీవితం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. 

క్రమశిక్షణ లేమి: ఆదాయం వచ్చిన వెంటనే ప్రణాళిక మేర ఇన్వెస్ట్‌ చేసి, మిగిలినది ఖర్చు చేయాలి. కానీ, ఎక్కువ మంది దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు.

ఆడంబరాలు: కొందరు తాము గొప్పగా కనిపించాలనుకుంటారు. అందుకోసం కారు, ఖరీదైన ఇల్లు, ఖరీదైన వాచ్, ట్రిప్‌ ఇలా ఏవేవో ప్లాన్‌ చేస్తుంటారు. విలువను తెచ్చిపెట్టే వాటిపై ఇన్వెస్ట్‌ చేయడాన్ని పక్కకు నెట్టేస్తుంటారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top