బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌

BSNL Announces New Rs 491 Broadband Plan - Sakshi

టెలికాం మార్కెట్‌లో నెలకొన్న టారిఫ్‌ వార్‌, ఇక బ్రాడ్‌బ్యాండ్‌కు విస్తరించింది. రిలయన్స్‌ జియో తన బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ప్రకటించడానికి కాస్త ముందుగా.. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. 491 రూపాయలతో తన సరికొత్త ల్యాండ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు పేర్కొంది. దీన్ని ‘మోస్ట్‌ ఎకనామిక్‌ బ్రాడ్‌బ్యాండ​ ఫ్లాన్‌’గా అభివర్ణించింది.  నెల రోజుల వ్యాలిడిటీతో వుండే ఈ ప్లాన్ లో ప్రతి రోజూ 20 జీబీ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. 20ఎంబీపీఎస్‌ స్పీడులో ఈ డేటా లభ్యమవుతుంది. అలాగే, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పించింది.  ఈ ప్లాన్ గురించి బీఎస్ఎన్ఎల్ బోర్డు మెంబర్ ఎన్ కే మెహతా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఇది వ్యక్తులకు, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అత్యధిక సామర్థ్యంతో, అత్యంత సరసమైన ధరలో, డేటా సర్వీసులను ఆఫర్‌ చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కట్టుబడి ఉందని మెహతా పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు, ఫ్రాంచైజీలు, రిటైలర్ల దగ్గర నుంచి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు బ్రాడ్ బ్యాండ్ సేవలతో జియో తీవ్ర స్థాయిలో పోటీనిచ్చేందుకు వచ్చేసింది. జియో సేవల ప్రకటనకు కాస్త ముందుగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకురావడం గమనార్హం. జియో ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ప్రకటించడంతో, దీని ధరలను మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ లీడర్లుగా ఉన్నాయి. టెలికాం రంగంలో మాదిరిగా, ఇక బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనూ తీవ్ర టారిఫ్‌ వార్‌ కనిపించబోతుంది. నాన్‌-ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను కంపెనీ 20ఎంబీపీఎస్‌ స్పీడులో 99 రూపాయలకే అందిస్తోంది. కొత్త ల్యాప్‌టాప్‌ లేదా కొత్త పీసీ కొనుగోలు చేసిన వారికి రెండు నెలల పాటు ఈ ప్లాన్లను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది కూడా. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top