ఒక పెట్టుబడి.. రెండు ప్రయోజనాలు

benefits of investing mutual funds - Sakshi

పన్ను ఆదా కోసం... పది మార్గాలు

పన్ను ఆదా కోసం చివరి నెలల్లో యోచన తగదు

ముందస్తు ప్రణాళికతో రెండింతలా లాభం

పన్ను, ఆదాయాల పరంగా ప్రయోజనం

ఈక్విటీ అనుసంధాన పథకాలతోపాటు

అందుబాటులో పలు సాధనాలు

దీర్ఘకాలిక వ్యూహంతోనే ఆర్థిక లక్ష్యాల సాధన

శివరామ్‌ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వరకు చెల్లిస్తున్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం కష్టంగా మారింది. శ్రీరామమూర్తి ఏడాది క్రితం ఎన్‌పీఎస్‌లో చేరాడు. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనంలో భాగంగా ఎన్‌పీఎస్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాడు.  దీనికి అదనంగా ఇన్వెస్ట్‌  చేయాలని ఉంది. కానీ, పన్ను మినహాయింపు ఉంటుందా? అన్నది సందేహం.

పన్ను ఆదా సాధనాల విషయంలో వేతన జీవులకు పక్కా ప్రణాళిక ఉండాలి. శివరామ్‌ పన్ను ఆదా కోసం ఎండోమెంట్‌ పాలసీ తీసుకుని పొరపాటు చేశానని అనుకుంటున్నాడు. ఎందుకంటే కవరేజీ తక్కువ, రాబడులు కూడా స్వల్పమే. పైగా ప్రీమియం ఎక్కువ. దీనివల్ల ఇతర పెట్టుబడుల ప్రణాళిక దెబ్బతింటుంది.  ఏటా మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి పన్ను పడకుండా ఉండేందుకు ఎక్కువ మంది చివరి మూడు నెలల్లోనే పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటారు. ఆ తరహా వారికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా సాధనాలు, వాటి∙ప్రయోజనాలు వివరించేదే ఈ కథనం.

 ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌
ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాలు పన్ను ఆదా విభాగంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆదాయ పన్ను ఆదా కోసం దీన్ని మెరుగైన సాధనంగానే చూడొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఒక ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాల పన్ను రూ.లక్ష మించినప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018లో స్టాక్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండగా... ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులే ఉండొచ్చు. అయితే, దీర్ఘకాలం కోసం క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేసే వారు వీటి గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అయితే, మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే అంతా ఒకేసారి ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకుండా జనవరి నుంచి మార్చి వరకు మూడు సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని ఇన్వెస్ట్రోగ్రఫీ సీఈవో శ్వేతా జైన్‌ సూచించారు.  

ఫండ్స్‌ పేరు                           3 ఏళ్ల రాబడులు
మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌        19.06
ఇన్వెస్కో ట్యాక్స్‌ ప్లాన్‌             12.67
ఆదిత్య బిర్లా ట్యాక్స్‌ రిలీఫ్‌96    12.48
ప్రిన్సిపల్‌ ట్యాక్స్‌ సేవింగ్‌          12.59
యాక్సిల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ    12.38
డీఎస్‌పీ ట్యాక్స్‌సేవర్‌              12.13

ఎన్‌పీఎస్‌
జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో గత ఐదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడులు 10.84 శాతంగా ఉన్నాయి. రిటైర్మెంట్‌ సమయంలో వెనక్కి తీసుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఈక్విటీల్లో యాక్టివ్‌ చాయిస్‌ కింద 75 శాతం వరకూ ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ పీఎఫ్‌ఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయాలతో ఎన్‌పీఎస్‌ ఆకర్షణీయంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్‌పీఎస్‌లో 60 ఏళ్ల సమయంలో ఉపసంహరించుకునే 60 శాతంలో 20 శాతం పైన పన్ను చెల్లించాలన్న నిబంధన ఉంది. దీన్ని తొలగించడం పెద్ద ముందడుగుగా క్లియర్‌ ట్యాక్స్‌ సీఈవో అర్చిత్‌గుప్తా పేర్కొన్నారు. 70 ఏళ్ల వరకు ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశాన్ని కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ కల్పించింది. వీటిల్లో ఫండ్స్‌ పనితీరును గమనిస్తే...
 
ఈక్విటీలో 50 శాతం ఇన్వెస్ట్‌ చేసే విభాగం

ఫండ్‌ మేనేజర్‌                    ఏడాది రాబడి              మూడేళ్లు రాబడి     ఐదేళ్లు రాబడి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పెన్షన్‌      3.37                         9.56                  11.31
ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్‌                  4.12                         9.98                  11.45
యూటీఐ రిటైర్మెంట్‌ సొల్యూషన్స్‌   3.19                        9.85                  11.41
కోటక్‌ పెన్షన్‌ ఫండ్‌                      1.37                        9.58                  11.22
హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ ఫండ్‌             3.71                        10.22    –

 పెన్షన్‌ ప్లాన్లు
పెన్షన్‌ ప్లాన్లు కూడా సెక్షన్‌ 80సీ కింద పెట్టుబడి ప్రయోజనం అందించేవే. అయితే, ఎన్‌పీఎస్, యులిప్‌లతో పోలిస్తే ఇవి అంత ఆకర్షణీయం కావు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలకు అదనంగా రూ.50,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు పన్ను మినహాయింపు ఉంది. పని చేస్తున్న కంపెనీ ఉద్యోగి పెన్షన్‌ కోటా కింద జమ చేస్తే అదనపు పన్ను మినహాయింపు కూడా ఉంది. కానీ బీమా కంపెనీలు అందించే పెన్షన్‌ ప్లాన్లకు ఈ ప్రయోజనాలు లేవు. కొత్త యులిప్‌ పాలసీల్లో చార్జీలు చాలా వరకు దిగొచ్చాయి. బీమా కంపెనీల పెన్షన్‌ ప్లాన్లలో మాత్రం చార్జీలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. యులిప్‌ల మాదిరే బీమా పెన్షన్‌ ప్లాన్లలోనూ చార్జీల విషయమై పారదర్శకత తక్కువ.  
 
నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌
జాతీయ పొదుపు పత్రా ల్లో  పెట్టుబడులకూ సెక్షన్‌ 80సీ పన్ను మినహాయింపు ఉంది. దీనిలో ప్రస్తుత వడ్డీ రేటు 8%. ఈక్విటీల గురించి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేని వారు, పెట్టుబడి పెట్టి నిశ్చితంగా ఉండాలనుకునే వారు దీన్ని పరిశీలించొచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగైనది. దీనిలో వచ్చే వడ్డీ ఆదాయం తదుపరి ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపునకు వీలుంటుంది. ఉదాహరణకు 2019 జనవరిలో ఎన్‌ఎస్‌సీలో రూ.50,000 ఇన్వెస్ట్‌ చేశారనుకుంటే, 2020 జనవరి నాటికి రూ.4,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో దీనిపై మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికీ ఇది అనువైనదే. బ్యాంకుల్లో వీటిని పొందొచ్చు.

  బ్యాంకు ఎఫ్‌డీలు
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) వడ్డీ 7.5–8.25% మధ్య ఉంది. సెక్షన్‌ 80 సీ పన్ను ఆదా కోసమయితే, ఐదేళ్ల ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు తిరిగి ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకోవడానికి ఉండదు. నెట్‌ బ్యాంకింగ్‌ ఉన్న వారు ఆన్‌లైన్‌లోనే కొన్ని క్లిక్‌లతో ఈ డిపాజిట్‌ చేసుకోవచ్చు. డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు.  

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ
ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీ          వడ్డీ రేటు
ఐడీఎఫ్‌సీ బ్యాంకు                8.25
ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌           8.00
లక్ష్మీ విలాస్‌ బ్యాంకు            7.75
డీసీబీ బ్యాంకు                    7.75
ఆర్‌బీఎల్‌ బ్యాంకు                7.60

  బీమా పాలసీలు
ఆర్జించే వ్యక్తికి మరణ ప్రమాదం ఎదురైతే, అతడు లేదా అతనిపై ఆధారపడిన వారికి ఆర్థిక ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే తమపై ఆధారపడిన వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బీమా పాలసీ తీసుకోవాలి. కానీ, అది టర్మ్‌ ప్లాన్‌ రూపంలో ఉంటే మంచిది. సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలు ఓ వ్యక్తి కుటుంబానికి సరిపడా బీమా రక్షణ అందించలేవు. ఎందుకంటే వార్షికంగా రూ.5 లక్షల ఆదాయం కలిగిన 30 ఏళ్ల వ్యక్తికి వార్షికంగా కనీసం రూ.40–50 లక్షల కవరేజీ అవసరం. ఎండోమెంట్‌ పాలసీ అయితే ఇంత కవరేజీ కోసం రూ.ఏడాదికి రూ.4–5 లక్షల ప్రీమియం చెల్లించాలి. కానీ రూ.5,000లోపు ప్రీమియంతోనే 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.50 లక్షల టర్మ్‌ పాలసీని పొందొచ్చు. టర్మ్‌ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియానికి కూడా సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది.
 
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌...(పీపీఎఫ్‌)

2019 జనవరి–మార్చి నెలకు వడ్డీ 8 శాతంగా ఉంది. వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ... పీపీఎఫ్‌ సాధనం ఇప్పటికీ మంచి సాధనంగా ఆర్థిక సలహాదారుల అభిప్రాయం. రాబడి పూర్తిగా పన్ను రహితం. దీంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనం అవుతుంది. ఎందుకంటే ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుందని తెలిసిందే. అయితే, ఇప్పటికే ప్రావిడెండ్‌ ఫండ్‌కు కొంత కేటాయించే వారు పన్ను ఆదా కోసం మరింతగా అదే బాస్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వివేకం అనిపించుకోదు. దీనికి బదులు ఇక్కడి ప్రత్యామ్నాయ సాధనాల్లో మీకు అనువైనది ఎంచుకోవచ్చు. పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడులు, రాబడులకు హామీదారు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది. ఏ పోస్టాఫీసు శాఖ లేదా బ్యాంకు శాఖలో అయినా పీపీఎఫ్‌ ప్రారంభించుకోవచ్చు. ఆన్‌లైన్‌ సదుపాయం కలిగిన బ్యాంకులో ఎంచుకుంటే సౌలభ్యంగా ఉంటుంది.
 
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌

వడ్డీ రేటు ప్రస్తుతం 8.7 శాతంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వార్షికంగా రూ.50,000 వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తూ గతేడాది నిర్ణయం తీసుకుంది. దీంతో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం మరింత ఆకర్షణీయత సంతరించుకుంది. దీంతో 60 ఏళ్లు దాటిన వారికి వార్షికంగా రూ.3.5 లక్షలకు పన్ను లేనట్టు అవుతుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5.5 లక్షలకు పన్ను ఉండదు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోకీ అధిక వడ్డీ రేటు ఉన్నది ఈ పథకంలోనే. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకోగలరు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరని వారు 58 ఏళ్లకే ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

సుకన్య సమృద్ధి యోజన
కుమార్తెల పేరిట పొదుపు చేసుకుని పన్ను ఆదా పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.5 శాతం. వడ్డీ రేటును ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌తో ముడిపెట్టినందున ప్రతీ క్వార్టర్‌కు మారుతుంటుంది. పీపీఎఫ్‌ పథకంలో కంటే అధిక వడ్డీ రేటు ఇందులో లభిస్తోంది. పీపీఎఫ్‌లో మాదిరే గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షల వరకు ఉంది. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం రూ.250 పెట్టుబడితో పోస్టాఫీసు లేదా ఎంపిక చేసిన బ్యాంకుల్లో దీన్ని ఆరంభించొచ్చు. తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెల పేరిటే పెట్టుబడికి అవకాశం ఉంటుంది.  ఇద్దరు కుమార్తెల పేరిట రెండు ఖాతాలు ప్రారంభించిన వారు రెండింటిలోనూ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వివాహాలు, ఉన్నత విద్య అవసరాలకు ఉపయోగపడే పథకం.

యులిప్‌లు
యూనిట్‌ లింక్డ్‌ బీమా పథకాలను ‘యులిప్‌’లుగా పిలుస్తారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలంలో లాభాలు గడించే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, యులిప్‌లు బీమాతో కూడిన పెట్టుబడి పథకాలు కావడంతో వీటికి మినహాయింపు ఉంది.  యులిప్‌ల్లో కేవలం ఈక్విటీలే కాకుండా డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. యులిప్‌ పాలసీల్లో ఈక్విటీ నుంచి డెట్‌ ఫండ్స్‌కు మారినా పన్ను వర్తించదు. ఫండ్స్‌లో మాదిరిగా కాకుండా, యులిప్‌ పాలసీల్లో డెట్‌ అయినా ఈక్విటీ ఫండ్స్‌లో అయినా ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా ఆర్జించే మొత్తంపైనా పన్ను ఉండదు. కాగా ఐదేళ్ల పాటు లాకిన్‌. గడువు లోపు ముందుగానే తప్పుకుంటే సరెండ్‌ చార్జీల వంటివి ఉంటాయి. యులిప్‌ల్లోనే చైల్డ్‌ ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లల పేరిట  తీసుకుంటే, పాలసీ గడువు లోపు సంరక్షణ చూసే తల్లి లేదా తండ్రి అకాల మరణం చెందితే, పిల్లల పేరిట పెట్టుబడి ఆగకుండా కొనసాగుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top