బ్యాంకుల వరుస సెలవులు, క్లారిటీ

Banks to remain open in first week of September - Sakshi

సాక్షి,ముంబై:  సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు  మూతపడనున్నాయనే పుకారు  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై  ప్రభుత్వం స్పందించింది. బ్యాంకులకు ఆరో రోజులు సెలవు అనే వదంతుల్లో ఏమాత్రం నిజంలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని  వివరణ ఇచ్చింది. అటు జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు స్పందించారు. వాట్సాప్‌, తదితర గ్రూపుల్లో  విపరీతంగా షేర్‌ అవుతున్న మెసేజ్‌లను తోసిపుచ్చారు.  దీనికి  సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు చెప్పారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుందన్న వస్తున్న వార్తల్లోనూ ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వరసగా 3రోజులకు మించి సెలవులు ఉండవని స్పష్టం చేశారు.

ఆదివారం నుంచి బ్యాంకులు ఆరు రోజులపాటు మూతపడనున్నాయనే వార్తల్లో నిజం లేదని సంఘం  ఉపాధ్యక్షుడు అశ్వానీ రాణా వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని  ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సమ్మెమూలంగా బ్యాంకింగ్ వ్యవస్థపై  ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని  పేర్కొన్నారు.  అలాగే జన్మాష్టమి ఐచ్ఛిక సెలవేనని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు మాత్రమే సెప్టెంబర్ 3న సెలవు అని రాణా తెలిపారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయన్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవు ప్రకటించాయి.

కాగా సెప్టెంబర్ 2 ఆదివారం సెలవు, సెప్టెంబర్ 3 జన్మాష్టమి.  ఆ తరువాత 4, 5 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె  చేపట్టనున్నారనీ, దీంతోపాటు 8, 9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం కావడంతో వరస సెలవులంటూ మెసేజ్‌లు విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.  ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు, జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందుతున్న సంగతి  తెలిసిందే.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top