విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌!! | Sakshi
Sakshi News home page

విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌!!

Published Fri, Jun 7 2019 5:39 AM

azim premji retirement on 30 july 2019 - Sakshi

న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్‌ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్‌ ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు. ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్, బోర్డు సభ్యుడు అయిన రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలు చేపడతారు.

రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది. ‘దేశ టెక్నాలజీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అయిన అజీం ప్రేమ్‌జీ దాదాపు 53 ఏళ్లు కంపెనీకి సారథ్యం వహించిన తర్వాత జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కంపెనీ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు’ అని స్టాక్‌ ఎక్సే్చంజీలకు విప్రో తెలియజేసింది.

మరోవైపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆబిదాలి జెడ్‌ నీముచ్‌వాలాను మరో విడత అయిదేళ్ల పాటు సీఈవో, ఎండీ హోదాల్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విప్రో ఎంటర్‌ప్రైజెస్, విప్రో–జీఈ హెల్త్‌కేర్‌ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ కొనసాగుతారు. షేర్‌హోల్డర్ల అనుమతుల మేరకు జూలై 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని విప్రో వివరించింది. ‘ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అని రిషద్‌ పేర్కొన్నారు.  

ఇకపై పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు..
వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ టెక్‌ దిగ్గజంగా అజీం తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్‌ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్‌ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు.

‘ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరం. భవిష్యత్‌లో మా ఫౌండేషన్‌ సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్థ్యాలు రిషద్‌కు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు.  తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు  రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement