‘ఆవెర’ సోలార్‌ చార్జింగ్‌ స్టేషన్లు

'Avera' solar charging stations - Sakshi

మార్చికల్లా ఏపీ, తెలంగాణలో 100 కేంద్రాలు

‘సాక్షి’తో ఆవెర ఫౌండర్‌ వెంకట రమణ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల తయారీలో ఉన్న ఆవెర న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ మోటో కార్ప్‌ టెక్‌... సోలార్‌ ఆధారిత చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. సోలార్‌తో పనిచేసే చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. తొలి దశలో వైజాగ్, అమరావతి, తిరుపతిలో ఆగస్టు నాటికి 25 కేంద్రాలు రానున్నాయి.

రెండవ దశలో 2019 మార్చికల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 75 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్క హైదరాబాద్‌లోనే 50 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ‘ఆవెర’ ఫౌండర్‌ ఆకుల వెంకట రమణ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ.10 లక్షల వరకు కంపెనీ వెచ్చిస్తోందన్నారు. సీఎంఆర్, ఎంవీఆర్, చందన షోరూంల వద్ద కూడా చార్జింగ్‌ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు.

కొద్దిపాటి స్థలంలో..
చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు 250 చదరపు అడుగుల విస్తీర్ణం సరిపోతుంది. ఆధునిక లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ బ్యాటరీలను వాడుతున్నారు. స్టేషన్‌లో 7 కిలోవాట్‌ వరకు విద్యుత్‌ స్టోర్‌ చేసుకోవచ్చు. ఒక గంటలో వాహనం చార్జింగ్‌ పూర్తవుతుంది. కంపెనీ సొంత స్టేషన్లలో ఆవెర వాహనాలకు ఉచితంగా చార్జింగ్‌ సౌకర్యం ఉంది.

ఫ్రాంచైజీ విధానంలోనూ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఔత్సాహిక యువతకు కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ అందించి వీటిని నెలకొల్పాలన్నది ఆలోచన. స్టేషన్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను నెట్‌ మీటరింగ్‌ విధానంలో గ్రిడ్‌కు అనుసంధానించి అదనపు ఆదాయం పొందవచ్చు.

త్రీ–వీలర్ల తయారీలోకి..
ఆవెర ప్రస్తుతం అయిదు రకాల ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. సబ్సిడీ పోను వాహనం ధర రూ.70–90 వేలు ఉంది. మోడల్‌ను బట్టి ఒక్కొక్కటి ఒకసారి చార్జింగ్‌ చేస్తే 140 నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ 10 ఏళ్లకు పైగా పనిచేస్తుంది. 1–2 కిలోవాట్ల విద్యుత్‌ ఈ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది.

వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లింగ్‌ ప్లాంటులో వాహనాలను తయారు చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని నున్న వద్ద 63 ఎకరాల్లో రూ.50 కోట్ల ప్రారంభ వ్యయంతో శాశ్వత ప్లాంటు నిర్మిస్తున్నట్టు వెంకట రమణ చెప్పారు. త్రీ–వీలర్ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించారు. నమూనా వాహనం రెడీ చేశామన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top