జూన్‌లో ఏఐఎం నుంచి కొత్త స్కీమ్‌

Atal Innovation Mission to come up with initiative for small biz - Sakshi

ఎస్‌ఎంఈల ప్రోత్సాహం కోసం అటల్‌ ఇన్నోవేషన్‌ స్కీమ్‌

నీతి ఆయోగ్‌ అడిషనల్‌ సెక్రటరీ ఆర్‌ రామనన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎం) వచ్చే జూన్‌ నుంచి మరొక సరికొత్త పథకంతో రానుంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ), స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు లఘు వ్యాపార ఆవిష్కరణలు (స్మాల్‌ బిజినెస్‌ ఇన్నోవేషన్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీతి ఆయోగ్‌ అడిషనల్‌ సెక్రటరీ, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ రామనన్‌ రామనాథన్‌ తెలిపారు. ‘ది థింగ్స్‌ కాన్ఫరెన్స్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సదస్సు అనంతరం ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని  ముఖ్యాంశాలు చూస్తే...

∙లఘు వ్యాపార పరిశ్రమల పథకం కింద స్థానిక సమస్యలను పరిష్కరించే నూతన ఆవిష్కరణలు చేసే ఎంఎస్‌ఎంఈ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాంకేతికత, మౌలిక సదుపాయాలతో పాటూ నిధుల సహాయం కూడా అందిస్తాం. 

∙ప్రస్తుతం ఏఎంఐలో థింకరింగ్‌ ల్యాబ్స్, ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌ పేరిట ఇన్నోవేషన్‌ ప్రోగ్సామ్‌ ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు థింకరింగ్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 

∙ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 ఇంక్యుబేషన్‌ సెంటర్లు మంజూరు కాగా.. 30 సెంటర్లు నిర్వహణలో ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి 100 ఇంక్యుబేషన్‌ సెంటర్లలో 5 వేల స్టార్టప్స్‌ ఉండాలన్నది ఏఐఎం లక్ష్యం. 

∙తెలుగు రాష్ట్రాల్లో 13 ఇంక్యుబేషన్‌ సెంటర్లున్నాయి. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, టీ–హబ్‌. విశాఖపట్నంలల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగ వృద్ధి, తీర ప్రాంతాల ఆదాయ వనరుల వృద్ధికి ఆయా స్టార్టప్స్‌ పనిచేస్తున్నాయి. ఇంక్యుబేషన్‌ ఏర్పాటుకు యూనివర్సిటీ విస్తీర్ణం కనీసం 10 వేల చ.అ. ఉండాలి.

ది థింగ్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభం..
సైబర్‌ ఐ, ఐబీ హబ్స్‌ ఆధ్వర్యంలో లోరావన్, ఐఓటీ టెక్నాలజీ అవకాశాలు, స్మార్ట్‌ సిటీల అభివృద్ధి, నిర్వహణ వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై చర్చించే ‘ది థింగ్స్‌ కాన్ఫరెన్స్‌’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యూరప్‌ వెలువల ఆసియాలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు హైదరాబాద్‌  వేదిక అయ్యింది. రెండు రోజలు ఈ సదస్సులో టెక్నాలజీ నిపుణులు, కంపెనీ సీఈవోలు, స్పీకర్లు తదితరులు పాల్గొన్నారు. ‘‘చైనా, యూరప్‌ దేశాలు లోరావాన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని.. దీంతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని సైబర్‌ ఐ సీఈఓ రామ్‌ గణేష్‌ తెలిపారు. తెలంగాణలోనూ లోరావాన్‌ టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని.. ప్రస్తుతం టెక్నాలజీ టెస్టింగ్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ జరుగుతుందని.. త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, ది థింగ్స్‌ ఇండస్ట్రీస్‌ సీఈఓ అండ్‌ కో–ఫౌండర్‌ వింకీ గిజీమాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top