సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్‌

Asia Pacific Prime Office Rental Index - Q3 2019 - Sakshi

క్యూ3లో ఆఫీసు అద్దెల్లో 23 శాతం వృద్ధి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయి. జులై – సెప్టెంబర్‌ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో ఈ మూడు నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఆసియా పసిఫిక్‌ క్యూ3–2019 ఆఫీస్‌ రెంటల్‌ ఇండెక్స్‌ నివేదిక తెలిపింది

బెంగళూరు తర్వాతే మెల్‌బోర్న్, బ్యాంకాక్‌..
2019 క్యూ3లో ఆఫీస్‌ రెంట్స్‌ వృద్ధిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మెల్‌బోర్న్, మూడో స్థానంలో బ్యాంకాక్‌ నగరాలు నిలిచాయి. గతేడాదితో పోలిస్తే బెంగళూరులో అద్దెలు 17.6 శాతం వృద్ధి చెందగా.. మెల్‌బోర్న్‌లో 15.5 శాతం, బ్యాంకాక్‌లో 9.4 శాతం వృద్ధి నమోదైంది. నెల వారీ అద్దెలు చూస్తే.. ఖరీదైన అద్దెలున్న నగరాల్లో హాంగ్‌కాంగ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నెల అద్దె చ.మీ.కు రూ.206.6 డాలర్లు. టోక్యోలో 11.9 డాలర్లు, సింగపూర్‌లో 80.5 డాలర్లుగా ఉంది. మన దేశంలో ఖరీదైన ఆఫీస్‌ అద్దె నగరాల్లో ప్రథమ స్థానంలో ఎన్‌సీఆర్‌ (ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో 5వ స్థానం), ముంబై (7వ స్థానం) నిలిచాయి. ఎన్‌సీఆర్‌లో నెలకు రూ.51.8 డాలర్లు, ముంబైలో 46.2 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 20.5 డాలర్లుగా ఉంది.

2020లో 50 మిలియన్‌ చ.అ.
ఈ ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 46.5 మిలియన్‌ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు వాటా 70 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల వాటా 42 శాతంగా ఉంది. 2020లో 50 మిలియన్‌ చ.అ.ల ఆఫీసు స్థల లావాదేవీలు జరుగుతాయని నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది మన దేశంలో ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు అత్యధికంగా జరిగిన నగరం బెంగళూరే. ఇక్కడ 2019లో 15 మిలియన్‌ చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి. ఐటీ, ఐటీఈఎస్‌ రంగాల వాటా 39 శాతంగా ఉంది. ఇంజనీరింగ్, తయారీ రంగాల వాటా 16 శాతంగా ఉంది. 2019లో కొత్తగా 10.9 మిలియన్‌ చ.అ. స్పేస్‌ జత అయింది.

హైదరాబాద్‌లో 10.5 మిలియన్‌ చ.అ.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌ కమర్షియల్‌ స్పేస్‌ లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీల వంటి కారణాలతో పాటూ అందుబాటులో స్థలాలు, తక్కువ అద్దెలు, నైపుణ్యమున్న ఉద్యోగులు తదితర కారణాలతో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఆఫీస్‌ అద్దెలు వృద్ధి చెందుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నగరంలో 10.5 మిలియన్‌ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో టెక్నాలజీ కంపెనీల వాటా 51 శాతం ఉంది. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌ వాటా నాలుగింతలు వృద్ధి చెంది 32 శాతం వద్ధ స్థిరపడింది. 2020లో హైదరాబాద్‌లో 13 మిలియన్‌ చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top