ఏడాదిలో తెలంగాణ ప్లాంట్!

ఎలక్ట్రిక్ బస్సుతో వినోద్ దాసరి, తదితరులు - Sakshi


పెట్టుబడులతో సిద్ధం.. స్థల కేటాయింపే ఆలస్యం

ముందు బస్సుల బాడీ బిల్డింగ్ చేపడతాం

తరవాత ట్రక్కులు, భారీ వాహనాల తయారీ కూడా..

‘సాక్షి’తో అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె దాసరి

దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ

సీటింగ్, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర రూ.2-4 కోట్లు

చెన్నై నుంచి సాక్షి, బిజినెస్ బ్యూరో ప్రతినిధి


భారీ వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్... తెలంగాణలో ప్రతిపాదిత ప్లాంట్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలియజేసింది. తొలి దశలో రూ.500 కోట్లతో బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే పనులు మొదలుపెడతామని కంపెనీ ఎండీ వినోద్ కె దాసరి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. తొలి దశలో 50-60 ఎకరాల స్థలం అవసరమని..


స్థల సమీకరణ పూర్తయితే 12-16 నెలల్లోనే ప్లాంట్‌ను ప్రారంభిస్తామని తెలియజేశారు. డిమాండ్‌ను బట్టి దశలవారీగా ట్రక్కులు, భారీ వాణిజ్య వాహనాలనూ ఈ ప్లాంట్‌లో అభివృద్ధి చేసే అవకాశాలున్నట్లు దాసరి తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సును మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో సోమవారమిక్కడ ఆయన మాట్లాడారు. డిమాండ్, స్థల కేటాయింపు, బిల్డింగ్ సామర్థ్యాలను బట్టి భవిష్యత్తులో పెట్టుబడుల మొత్తాన్ని పెంచుతామని పేర్కొన్నారు.


ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 120 కి.మీ. ప్రయాణం

సర్క్యూట్ సీరిస్‌లో భాగంగా దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్సును చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ వినోద్ కె దాసరితో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీ వెంకటరామన్, తమిళనాడు పరిశ్రమల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అంబుజ్ శర్మ పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సు ప్రాజెక్ట్ కోసం రూ.200 కోట్ల వరకు ఖర్చయింది. చెన్నైలోని టెక్ సెంటర్‌లో దీన్ని రూపకల్పన చేశాం.


బస్సు పూర్తి తయారీకి రెండేళ్ల సమయం పట్టింది. సర్క్యూట్ సీరిస్‌లో మెట్రో, పట్టణ, గ్రామీణ అవసరాలకు అనుగుణంగా బస్సులను తయారు చేస్తాం. వీటిని ఆర్డరుపై మాత్రమే తయారు చేస్తాం. డెలివరీకి మూడు వారాల నుంచి మూడు నెలలు పడుతుంది. ఈ బస్సులో లిథియం ఇయాన్ అనే బ్యాటరీలను వినియోగించాం. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. బస్సు మొత్తం ధరలో బ్యాటరీ వ్యయమే 60 శాతం వరకుంటుంది.


ఎలక్ట్రిక్ బస్సులోని ప్రధాన ఫీచర్లివే...

ధర రూ.2-4 కోట్లు

సీట్ల సామర్థ్యం 31 నుంచి 80

3 గంటల్లోపే పూర్తి చార్జింగ్

ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కి.మీ. ప్రయాణం

గరిష్ఠ వేగం 75 కి.మీ.

ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్ ట్రాకింగ్, కెమెరాలు

బ్యాటరీ జీవిత కాలం 5-7 ఏళ్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top