అశోక్‌ లేలాండ్‌ బీఎస్‌–6 వాహనాలు

ashok leyland  launch bs6 truck - Sakshi

చెన్నై నుంచి సాక్షి బిజినెస్‌ ప్రతినిధి: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌లేలాండ్‌.. భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)–6 ప్రమాణాలకు అనుగుణంగా తన భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్‌ వంటి వాటిని మార్చుకుని కొనుగోలు చేసే సౌకర్యాన్ని వీటిలో అందుబాటులో ఉంచింది. మాడ్యులర్‌ బిజినెస్‌ ప్రోగ్రామ్‌గా పిలిచే ఈ విధానం టైలర్‌మేడ్‌ తరహాలో ఉంటుందని వివరించింది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్దమవుతాయని ప్రకటించింది. ప్రస్తుత ధరల శ్రేణి రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఉండగా, నూతన మోడళ్ల విడుదల సమయంలో ధరలను వెల్లడిస్తామని సంస్థ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా అన్నారు.

ఈ కామర్స్, పార్సిల్స్‌కు తగిన ట్రక్కుల నుంచి సిమెంట్‌ను తరలించే వాహనాలతోపాటు, డిఫెన్స్, టూరిస్ట్‌ బస్సులను ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల వాహనాల విక్రయాలు నమోదు కాగా, త్వరలోనే అమ్మకాలను 4 లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ప్రపంచంలోనే టాప్‌–10 స్థానంలోకి చేరనున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విడుదల చేయడం ద్వారా మార్కెట్‌ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రైవర్లకు స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు ఇంజన్‌లో ఎటువంటి లోపం తలెత్తినా వెంటనే డ్రైవర్‌కు సమాచారం వస్తుందని వెల్లడించారు.  

నూజివీడు ప్లాంట్‌కు మందగమనం సెగ
ఎలక్ట్రిక్‌ బస్సులను ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ప్లాంట్‌ ఏర్పాటు చేయగా, ఆ నాటి నుంచి ఆటో పరిశ్రమలో మందగమనం నెలకొనడంతో విస్తరణ పణులను చేపట్టలేకపోతున్నామని ధీరజ్‌ హిందుజా అన్నారు. తెలంగాణలో ఆర్‌టీసీ పాక్షిక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రైవేటు ప్యాసింజర్‌ సంస్థలకు అవసరమైన బస్సులను ప్రస్తుతానికి తాము ఉత్పత్తి చేయడం లేదన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top