లారీల ఎఫెక్ట్‌ : అమెజాన్‌ డెలివరీలు ఆలస్యం

Amazon Deliveries In India Affected By Truckers Strike - Sakshi

న్యూఢిల్లీ : రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లారీలు దేశవ్యాప్తంగా బంద్‌ చేపడుతున్నాయి. జూలై 20 నుంచి ప్రారంభమైన ఈ బంద్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.  డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి 3 నెలలకోసారి ధరలను సవరించాలన్న డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు ఈ బంద్‌ చేపడుతున్నాయి. ఈ బంద్‌తో దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీలు అమెజాన్‌, స్నాప్‌డీల్‌కు భారీగా దెబ్బకొడుతోంది. కొన్ని నగరాల్లో సరుకుల డెలివరీ చేయడం కష్టతరంగా మారింది. దీంతో అమెజాన్‌, స్నాప్‌డీల్‌ డెలివరీలు కస్టమర్లకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. లారీలు బంద్‌ చేపట్టినప్పటి రోజే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ తమ తమ వార్షిక విక్రయాలను ముగించాయి. ఈ విక్రయాల్లో ఆర్డర్లు ఇచ్చిన వారికి డెలివరీ ఆలస్యమవుతుందని అమెజాన్‌ అధికార ప్రతినిధి చెప్పారు.  

ఎలాగైనా కస్టమర్లకు ఉత్పత్తులు చేరుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు.  దేశీయ అతిపెద్ద రవాణా వ్యవస్థ స్తంభించడంతో, ఉత్తర, పశ్చిమ భారత్‌లో డెలివరీలపై ప్రభావం చూపుతుందని స్నాప్‌డీల్‌ కూడా తెలిపింది. ఈ విషయాలపై ఇప్పటికే కొనుగోలుదారులకు, విక్రయదారులకు సమాచారం అందించామని చెప్పింది.  దేశీయ కమోడిటీ ట్రేడ్‌ కూడా దెబ్బతిన్నది. పత్తి సరుకు రవాణా ఆగిపోయింది. ముడి పదార్థం లేనందున పత్తి గైనింగ్ కర్మాగారాలు మూసివేత అంచున ఉన్నాయని భారతదేశ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ గణట్రా చెప్పారు. పత్తి రవాణా ఆగిపోవడంతో, ఎగుమతిదారులు తమ తమ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని, దీంతో షిప్‌మెంట్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, పాకిస్తాన్‌లు దేశీయ పత్తి కొనుగోలు చేయడంలో ప్రధానదారులు. ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు వంటి కూరగాయలను పెద్ద పెద్ద నగరాలకు సరఫరా చేయడం కూడా పడిపోయింది. కొన్ని చోట్ల బంగాళదుంపలు ఖరీదైనవిగా మారాయి. ఈ వారంలోనే బంగాళదుంపల ధరలు 29 శాతం మేర పైకి ఎగిశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top