ఎయిర్‌టెల్‌పై మండిపడుతున్న నెటిజన్లు

Airtel Was Trolled For Bigotry - Sakshi

న్యూఢిల్లీ : ఓ మహిళా వినియోగదారురాలు ‘హిందూ కస్టమర్‌ సర్వీస్‌ పర్సన్నే పంపించండం’టూ చేసిన వివాదాస్పద అభ్యర్ధనను అంగీకరించడంతో ట్విటర్‌లో తెగ ట్రోల్ అవుతుంది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌. వివరాల ప్రకారం...పూజా సింగ్‌ అనే మహిళా కస్టమర్‌ తన ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ కనెక్షన్‌లో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించమని ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసింది. కొద్ది సేపటి తరువాత కంపెనీ, కస్టమర్‌ పూజ చేసిన కంప్లైంట్‌ను పరిష్కరించడానికి షోయబ్‌ అనే సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపించింది.

అందుకు పూజా కోపంతో ‘తాను ఇండియన్‌ హిందువునని..తనకు ముస్లింల సర్వీస్‌ మీద నమ్మకం లేదని..వెంటనే షొయబ్‌ స్థానంలో మరో హిందూ సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపిచాలని’ కంపెనీకి ట్విటర్‌లో పోస్టు చేసింది. అందుకు స్పందించిన ఎయిర్‌టెల్‌ కంపెనీ వెంటనే షోయాబ్‌ స్థానంలో మరో హిందూ కస్టమర్‌ సర్వీస్‌ ఇంజనీర్‌ను పంపించింది. కంపెనీకి తనకు మధ్య జరిగిన మెసేజ్‌ చాట్‌ను ట్విటర్‌లో పోస్టు చేసింది పూజ.

ఈ మెసేజ్‌లను చూసిన నెటిజన్లు ఎయిర్‌టెల్‌ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘మీ కంపెనీ ఉద్యోగికి మద్దతు తెలపకుండా మత దురభిమానం ఉన్న వారిని ప్రోత్సాహిస్తున్నారంటూ’ ఎయిర్‌టెల్‌ను తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి గరం...
ఎయిర్‌టెల్‌ చేసిన పనిని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విషయం గురించి ‘ఎయిర్‌టెల్‌ కంపెనీ తన ఉద్యోగులను మతం పేరుతో వేరు చేసి చూస్తుంది.  మత దురభిమానాన్ని ప్రచారం చేసే ఇలాంటి కంపెనీ‍కి కస్టమర్‌గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఇక మీదట నా సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఎయిర్‌టెల్‌ సేవల కోసం ఖర్చు చేయను. తక్షణమే నా నంబర్‌ను వేరే సర్వీస్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. అంతేకాక నా ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్ కనేక్షన్‌లను కూడా తొలగించాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేసారు.

ఇందుకు ఎయిర్‌టెల్‌ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ ‘జరిగిన విషయానికి మేము చింతిస్తున్నాము. కంపెనీ ఎప్పుడు కూడా తన వినియోగదారులను, ఉద్యోగులను, భాగస్వాములను కుల, మత ప్రాతిపదికన వేరు చేసి చూడదం’టూ రీట్వీట్‌ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top