కొలువులకు పండుగ కళ | after festival season hopes on Job opportunities | Sakshi
Sakshi News home page

కొలువులకు పండుగ కళ

Oct 22 2014 12:36 AM | Updated on Sep 2 2017 3:13 PM

కొలువులకు పండుగ కళ

కొలువులకు పండుగ కళ

పండుగల సీజన్ నేపథ్యంలో జాబ్ మార్కెట్ కళకళ్లాడనుంది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు 3-4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో జాబ్ మార్కెట్ కళకళ్లాడనుంది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు 3-4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ-కామర్స్, ఆతిథ్య, రిటైల్ తదితర రంగాల్లో హైరింగ్‌కు భారీ డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార సెంటిమెంట్లు, పరిస్థితులు మెరుగవుతుండటంతో కొన్ని నెలలుగా నియామకాలూ పెరుగుతున్నాయి. తాజాగా పండుగ సీజన్ ఇందుకు మరింత ఊతం ఇవ్వనుంది. 5-15 శాతం మేర హైరింగ్ పెరగగలదని అంచనా వేస్తున్నట్లు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచిత దత్తా తెలిపారు.

క్యాష్‌కరోడాట్‌కామ్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  డిస్కౌంటు ఆఫర్లు, షాపర్లు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తుండటం వంటి కారణాలతో ఈ ఏడాది పండుగల సీజన్‌లో మిగతా కాలంతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 300 శాతం పెరిగినట్లు వివరించారు. దీనికి అనుగుణంగా కంపెనీలు సిబ్బందిని కూడా పెంచుకోవాల్సి ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ సేన్ తెలిపారు. మెట్రో, కాస్మోపాలిటన్ సిటీల్లోని ఆర్గనైజ్డ్ రిటైల్ రంగంలోనే కనీసం 25,000 పైచిలుఉక ఉద్యోగాల కల్పన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
 
భారత్‌లో ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ ఉన్నా.. చివరి నెలల్లో దసరాతో మొదలు పెట్టి న్యూ ఇయర్ దాకా భారీగా షాపింగ్ జరుగుతుందని లేబర్‌నెట్ సర్వీసెస్ సీఈవో గాయత్రి వాసుదేవన్ చెప్పారు. ఈ నె లల్లో వివిధ ఉత్పత్తులు, సేవల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని..తదనుగుణంగా కంపెనీలకు అదనంగా మానవ వనరులూ అవసరమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ సేవల కోసం పార్ట్ టైమ్ సిబ్బందిని తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్‌ను, రిటైల్ సంస్థలు సేల్స్ అసోసియేట్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటున్నట్లు గాయత్రి తెలిపారు.
 
బోనస్‌లు..
ఎకానమీ కోలుకుంటున్న సంకేతాల కారణంగా ఉద్యోగాలు పండుగ బోనస్‌లు, ప్రోత్సాహకాలు మొదలైన వాటిని ఆశించవచ్చని సుదీప్ సేన్ చెప్పారు. అయితే, రంగాల వారీగా చూస్తే ఇది మిశ్రమంగా ఉంటుందన్నారు. ఐటీ రంగంలో బోనస్‌లు ఇవ్వడం కొనసాగుతుందని అయితే ఇది కచ్చితంగా నగదు రూపంలోనే కాకుండా ట్రావెల్ టికెట్లు, గిఫ్టులు, బీమా పాలసీలు (తొలి ఏడాది ఉచిత ప్రీమియంతో) మొదలైన వాటి రూపంలో ఉండొచ్చని సేన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement