ఇక అదానీ ఎయిర్‌పోర్టులు..!

Adani group wins bids to operate five airports - Sakshi

నిర్వహణకు 5 విమానాశ్రయాలు..50 ఏళ్ల పాటు  ఒప్పందం..

జాబితాలో అహ్మదాబాద్, తిరువనంతపురం,  లక్నో, మంగళూరు, జైపూర్‌

అత్యధికంగా కోట్‌ చేసిన అదానీ గ్రూప్‌ 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 50 ఏళ్ల పాటు వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సంబంధించి వచ్చిన బిడ్స్‌లో అయిదింటికి అదానీ అత్యధికంగా కోట్‌ చేసినట్లు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సీనియర్‌ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్‌ విమానాశ్రయాలు వీటిలో ఉన్నట్లు వివరించారు. ఆరోదైన గౌహతి ఎయిర్‌పోర్ట్‌ బిడ్‌ను మంగళవారం తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో ప్రయాణికుడిపై చెల్లించే ఫీజు ప్రాతిపదికన బిడ్డింగ్‌ సంస్థను ఎంపిక చేసినట్లు అధికారి చెప్పారు. మిగతా సంస్థలతో పోలిస్తే అదానీ గ్రూప్‌ అత్యధిక ఫీజు కోట్‌ చేయడంతో అయిదు ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టు దానికి దక్కినట్లు పేర్కొన్నారు. ఏఏఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అదానీ గ్రూప్‌ ప్యాసింజర్‌ ఫీజు కింద అత్యధికంగా రూ. 177 ఆఫర్‌ చేసింది. అలాగే జైపూర్‌కు రూ. 174, లక్నో ఎయిర్‌పోర్టుకు రూ. 171, తిరువనంతపురం విమానాశ్రయానికి రూ. 168, మంగళూరు ఎయిర్‌పోర్టుకు రూ. 115 మేర ప్యాసింజర్‌ ఫీజు కింద ఏఏఐకి అదానీ గ్రూప్‌ చెల్లించనుంది. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సంస్థ ఇవే విమానాశ్రయాలకు వరుసగా రూ. 85, రూ. 69, రూ. 63, రూ. 63, రూ. 18 ఆఫర్‌ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాతిపదికన ఏఏఐ అధీనంలోని ఆరు విమానాశ్రయాలను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్రం గతేడాది నవంబర్‌లో ఆమోదముద్ర వేసింది. ఆయా విమానాశ్రయాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, ప్రయాణికులకు మరింత మెరుగైన సర్వీసులు అందించగలగడం ఈ ప్రతిపాదన ప్రధాన లక్ష్యం.  

10 కంపెనీలు .. 32 బిడ్లు.. 
ప్రస్తుతం ఏఏఐ నిర్వహణలో ఉన్న ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణకు 10 కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్లు వచ్చాయి. వీటిలో ఆటోస్ట్రేడ్‌ ఇండియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, ఐ–ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలైన సంస్థలు ఉన్నాయి. అహ్మదాబాద్, జైపూర్‌ విమానాశ్రయాలకు నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌), జ్యూరిక్‌ ఎయిర్‌పోర్ట్‌ ఇంటర్నేషనల్‌ రెండో అతి పెద్ద బిడ్డర్స్‌గా నిల్చాయి. అటు లక్నో ఎయిర్‌పోర్టు విషయంలో ఏఎంపీ క్యాపిటల్, తిరువనంతపురం విమానాశ్రయానికి సంబంధించి కేరళ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (కేఎస్‌ఐడీసీ), మంగళూరు ఎయిర్‌పోర్టు విషయంలో కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సంస్థలు రెండో స్థానంలో నిలిచాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top