ఎయిర్‌పోర్ట్‌లకు కరోనా కాటు

Adani group seeks more time to take over 3 airports - Sakshi

3 విమానాశ్రయాల అభివృద్ధికి మరింత గడువు కావాలి

ఏఏఐకు అదానీ గ్రూప్‌ వినతి

ఏవియేషన్‌లో అనిశ్చితితోనే....

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నేపథ్యంలో విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర సంస్థలతో తీవ్రంగా పోటీపడి మరీ గతేడాది దక్కించుకున్న మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి పనులను ఇప్పుడప్పుడే చేపట్టలేమంటూ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ)కు అదానీ గ్రూప్‌ తెలియజేయడం ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఏవియేషన్‌ రంగంలో అనిశ్చితి నెలకొనడంతో ఈ విమానాశ్రయాలను టేకోవర్‌ చేయడానికి కనీసం 6 నెలల వ్యవధి ఇవ్వాలని కోరింది. ఏఏఐకు కంపెనీ ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఒప్పందం ఇలా..
అదానీ గ్రూప్‌ గతేడాది ఫిబ్రవరిలో ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కాంట్రాక్టులను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం వీటిని 50 ఏళ్ల పాటు అదానీ గ్రూప్‌ ఆపరేట్‌ చేయొచ్చు. వీటిలో జైపూర్, త్రివేండ్రం, మరో విమానాశ్రయ ప్రాజెక్టు వివాదంలో ఉండటంతో ఏఏఐతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. లక్నో, మంగళూరు, అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కోసం ఫిబ్రవరి 15న ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ముందుగా రూ.1,500 కోట్లు ఏఏఐకి చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి 180 రోజుల్లోగా అసెట్స్‌ను తన స్వాధీనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ వ్యాపారం కోసం గ్రూప్‌ ప్రత్యేకంగా అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ పేరిట మరో సంస్థను కూడా ఏర్పాటు చేసింది.  

అంచనాలు తల్లకిందులు ..
లాండింగ్, పార్కింగ్‌ చార్జీల్లాంటి ప్రధాన వ్యాపారం కన్నా ఇతరత్రా భారీ ఆదాయాలు ఆర్జించవచ్చనే వ్యూహాలతో అదానీ గ్రూప్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నిర్వహణ కోసం దూకుడుగా బిడ్డింగ్‌ చేసింది. ఏరోట్రోపోలిస్, మాల్స్, హోటళ్లు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాలు రాగలవని భావించింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఏవియేషన్‌ రంగం వ్యాపార అవకాశాలు గణనీయంగా దెబ్బతినడంతో పునరాలోచనలో పడింది. విమాన ట్రాఫిక్‌ మళ్లీ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని అంచనా వేస్తోంది. దీంతో వేసుకున్న ప్రణాళికలన్నీ తల్లకిందులయ్యాయి.

ఒకవేళ అదానీ గ్రూప్‌ ఇప్పుడు తప్పుకున్న పక్షంలో ఒక్కో ఎయిర్‌పోర్టుకు రూ. 100 కోట్లు చొప్పున కట్టిన గ్యారంటీని వదులుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారంలో ఇరుక్కోవడం కన్నా కాస్తంత ఖర్చయినా తప్పుకోవడమే శ్రేయస్కరం కాగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఫోర్స్‌ మెజర్‌ నిబంధనను ఉపయోగించవచ్చని (తమ చేతుల్లో లేని కారణాల వల్ల కాంట్రాక్టును రద్దు చేసుకోవడం) పేర్కొన్నాయి. అయితే, ఫోర్స్‌ మెజర్‌ నిబంధనను ఏకపక్షంగా ఉపయోగించే వీలు ఉండకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. 

దీనికి రెండు పక్షాలు అంగీకరించాల్సి ఉంటుందని వివరించాయి. ఒకవేళ ఎయిర్‌పోర్టుల టేకోవర్‌కు మరింత గడువివ్వాలన్న అదానీ గ్రూప్‌ ప్రతిపాదనకు ఏఏఐ అంగీకరించని పక్షంలో బిడ్లను రద్దు చేసి, విక్రయ ప్రక్రియను పునఃప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఏదైతేనేం.. ఈ పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం భారీగా తలపెట్టిన ప్రైవేటీకరణ ప్రక్రియకు విఘాతం కలిగించేవేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరో ఆరు విమానాశ్రయాల విక్రయ ప్రక్రియను ఏఏఐ త్వరలో ప్రారంభిస్తుందంటూ కేంద్రం ఇటీవలే ప్రకటించింది. వారణాసి, అమృత్‌సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయపూర్, తిరుచ్చి విమానాశ్రయాలు జాబితాలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top