
న్యూఢిల్లీ: బ్యాంకులు ప్రస్తుత, కొత్త ఖాతాదారుల సౌలభ్యం కోసం తమ శాఖల్లోనే ఆధార్ నమోదు చేసుకోవాలని, దీనికి వీలుగా వేలిముద్రలు, ఐరిస్ స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. ఆధార్ లింకింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని, సత్వరమే బ్యాంకులు 10 శాతం శాఖల్లో ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని, దాంతో ఖాతాదారులకు ఆధార్ నమోదు ఇబ్బందులు తొలగుతాయని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు.
ఆధార్ లేని వారు బ్యాంకులోనే ఆధార్‌కు నమోదు చేసుకుని, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 2018 మార్చి 31లోపు ఖాతాతో అనుసంధానించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు బ్యాంకు శాఖల్లో 3,000 ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటయ్యయాని, మొత్తం మీద 14,000 శాఖల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పాండే తెలిపారు.