
న్యూఢిల్లీ: సుమారు 2 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తాజాగా టెన్సెంట్ హోల్డింగ్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,150 కోట్లు) సమీకరించింది. మరో బిలియన్ డాలర్ల కోసం కొనసాగుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు ఓలా మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ వెల్లడించింది. అయితే, ఎంత వేల్యుయేషన్స్‌పై నిధులు సమీకరించినదీ వెల్లడించలేదు.
ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు అమెరికాకు చెందిన మరికొందరు ఇన్వెస్టర్లు తాజా రౌండ్లో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. గడిచిన 4–6 నెలల్లో విడతలవారీగా 1.1 బిలియన్ డాలర్లు ఓలా అందుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరి కొన్ని వారాల్లో మిగతా 1 బిలియన్ డాలర్ల ఫండింగ్ చర్చలు కూడా పూర్తి కావొచ్చని వివరించాయి.