10 వేలు = 6.3 కోట్లు!! | Sakshi
Sakshi News home page

10 వేలు = 6.3 కోట్లు!!

Published Fri, Jun 15 2018 12:18 AM

100 Infosys-shares, bought in 1993, would've made you a crorepati - Sakshi

ఎప్పటికీ మీ దగ్గరే అట్టిపెట్టుకోవాలనుకునే షేర్లనే కొనుగోలు చేయాలని ఇన్వెస్టింగ్‌ దిగ్గజం వారెన్‌ బఫెట్‌ తరచూ చెబుతుంటారు. ఆయన మాటలను తాజాగా ఇన్ఫోసిస్‌ షేర్‌ నిజం చేసింది. ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయి గురువారం నాటికి సరిగ్గా పాతికేళ్లు నిండాయి.

ఈ 25 ఏళ్లలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిన బ్లూ చిప్‌ కంపెనీగా ఇన్ఫోసిస్‌ నిలిచింది. కంపెనీ ఇచ్చిన డివిడెండ్‌లు, బోనస్, షేర్ల విభజన మొత్తం కలుపుకుంటే ఈ పాతికేళ్లలో అనూహ్యమైన భారీ రాబడులనిచ్చింది. 40 శాతానికి పైగా చక్రగతిన వృద్ధి చెందిన స్థాయి లాభాలను పంచింది.

ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ.6.34 కోట్లకు పెరిగి ఉండేదనేది గణాంకాలు చెబుతున్న మాట. ఈ ఏడాది మార్చి నాటికి ఇన్ఫోసిస్, ఇతర అనుబంధ కంపెనీల్లో కలిపి మొత్తం 2.04,107 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎలాంటి రుణ భారం లేని ఈ కంపెనీకి ప్రస్తుతం రూ.19,818 కోట్ల విలువైన నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్‌ 24 శాతం ఎగసింది.

పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ కాని ఐపీఓ
1981లో పుణేలో ఒక చిన్న భవంతిలో 250 డాలర్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా ఇన్ఫోసిస్‌ ప్రస్థానం ప్రారంభమైంది. 1992లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌గా పేరు మార్చుకుంది. 2011లో ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌గా మారింది. ఈ కంపెనీ 1993లో రూ.95 ధరతో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చింది. ఈ ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ కాలేదు. 13 శాతం వాటాను మోర్గాన్‌ స్టాన్లీ కొనుగోలు చేసింది.

1993, జూన్‌ 14న స్టాక్‌ మార్కెట్లో రూ.145 ధర వద్ద లిస్టయింది. ఆ తర్వాత ఈ షేర్‌ పెరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లకు లాభాలు పంచుతూనే ఉంది. ఈ పాతికేళ్లలో కంపెనీ మొత్తం 11 సార్లు బోనస్‌లు ఇచ్చింది. దీంట్లో 10 సార్లు ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇచ్చింది. 2004లో మాత్రం ఒక షేర్‌కు మూడు షేర్లను బోనస్‌గా (3:1) ఇచ్చింది. 1999లో రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.5 ముఖ విలువ గల రెండు షేర్లుగా విభజించింది.

1993లో వంద ఇన్ఫోసిస్‌ షేర్లు ఉంటే (ఐపీఓలో రూ.10,000 పెబ్టుబడి) ఈ బోనస్‌లు, షేర్ల విభజనను కూడా కలుపుకుంటే ప్రస్తుతం షేర్ల సంఖ్య  51,200కు పెరుగుతుంది. గురువారం నాటి ముగింపు ధరను (రూ.1,239) పరిగణనలోకి తీసుకుంటే ఈ షేర్ల విలువ రూ.6.34 కోట్లుగా ఉంటుంది. ఇక 2,000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా డివిడెండ్‌లు చెల్లిస్తూనే ఉంది. ఆ డివిడెండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వాటాదారులకు మరింత విలువ సమకూరినట్లే.


ఏడీఆర్‌లు జారీ చేసిన తొలి భారత కంపెనీ...
1999లో ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఈసాప్స్‌ను (ఎంప్లాయి స్టాక్‌ ఆప్షన్స్‌) ఇచ్చింది. వీటితోనే ఎందరో ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. అదే ఏడాది ఏడీఆర్‌లను (అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌) కూడా జారీ చేసింది. ఏడీఆర్‌లు జారీ చేసిన తొలి భారత కంపెనీ కూడా ఇదే.

భవిష్యత్తులో కూడా ఇన్ఫోసిస్‌ మంచి లాభాలనే ఇస్తుందన్నది మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. భారీగా వృద్ధికి అవకాశాలున్న డిజిటల్‌ రంగంలో ఈ కంపెనీ పెట్టుబడుల జోరును పెంచుతోందని, మంచి వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని వారంటున్నారు. ఏడాది కాలంలో ఈ షేర్‌ రూ.1,420కు చేరగలదన్న అంచనాలతో షేర్‌ఖాన్‌ బ్రోకరేజ్‌ ఈ షేర్‌ను ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement