అగ్ని ఆర్పేదెలా..!

fire stations no minimum facilities in bhadradri - Sakshi

మంటలు చల్లార్చేందుకు నీరు కరువు 

కబురందినా కదలని వాహనాలు 

పలుచోట్ల మరమ్మతులకు గురైన మోటార్లు

ఫైర్‌ స్టేషన్‌లలో సమస్యల తిష్ట

అన్ని కేంద్రాల్లోనూ అరకొర సిబ్బందే.. 

భద్రాచలం :  వేసవి రానే వచ్చింది. గిరిజన గూడేలు ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఏటా అగ్ని ప్రమాదాల తీవ్రత అధికంగానే ఉంటుంది. దీనికి తోడు పారిశ్రామిక జిల్లా కావటంతో అగ్నిమాపక శాఖకు వేసవికాలమంతా చేతి నిండా పని ఉంటుంది. ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తరుణమిది. కానీ జిల్లాలోని అగ్నిమాపక శాఖకు సుస్తి చేసింది. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, దాదాపు అన్ని చోట్లా  సమస్యలు తాండవిస్తున్నాయి. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో స్టేషన్‌ నిర్వహణ అధికారి పోస్టు ఖాళీగాఉంది. జిల్లాలోని ఏ స్టేషన్‌లోనూ పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో ఉన్న వారిపైనే   పనిభారం పడుతోంది. వాహనాలు సైతం మరమ్మతులకు గురి కావటంతో ప్రమాద ప్రదేశానికి సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 
 
పరాయి పంచన పడిగాపులు... 
అగ్నిమాపక కేంద్రాలకు కొన్ని చోట్ల సరైన వసతి లేదు. భద్రాచలంలో భవన సౌకర్యం లేక బాలికల సదనంలో తాత్కాలికంగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరైనా, పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త భవన నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూల్చివేయటంతో అగ్నిమాపక శకటంతో పాటు, సిబ్బంది సమీపంలోని బాలికల సదనంలోకి వెళ్లారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
 
మణుగూరులో మళ్లీ అగ్రిమెంట్‌ చేస్తేనే... 
మణుగూరులో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నప్పటకీ, ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదు. అద్దె ప్రాతిపదికన స్టేషన్‌కు తీసుకున్న వాహనం అగ్రిమెంట్‌ మార్చితో పూర్తి కావస్తోంది. మళ్లీ గడువు పెంచటమో, లేకుంటే మరో వాహనం సమకూర్చటమో చేయాలి. కానీ దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో మార్చి తర్వాత ఏం చేయాలోనని అక్కడి అధికారులు ఆయోమయంలో పడ్డారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇప్పుడున్న వాహనం కూడా తరచూ మరమ్మతులకు గురవుతోంది. రిపేర్‌ కోసం ఎలాంటి నిధులు రావడం లేదు. దీంతో ఎక్కడైనా ప్రమాదం జరిగితే సకాలంలో గమ్యం చేరుకోవటం లేదు. మార్గమధ్యలోనే వాహనం మొరాయిస్తుండటంతో సకాలంలో మంటలార్పేందుకు రావటం లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

సిబ్బంది లేక ఉన్నవారిపైనే ఒత్తిడి... 
ఒక్కో ఫైర్‌ స్టేషన్‌కు అగ్నిమాపక అధికారితో పాటు 15 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఒక్క ఇల్లెందులో మినహా మరెక్కడా పూర్తి స్థాయిలో లేరు. భద్రాచలం అగ్నిమాపక శాఖ  అధికారిగా పనిచేసిన సరేష్‌కుమార్‌ పదోన్నతిపై బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఇక్కడ  పోస్టు ఖాళీగానే ఉంది. కొత్తగూడెం స్టేషన్‌ అధికారికే భద్రాచలం స్టేషన్‌ నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు. భద్రాచలంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ పోస్టులు ఇద్దరికి గాను ఒకరిని మణుగూరుకు డిప్యూటేషన్‌పై పంపించారు. డ్రైవర్‌ ఆపరేటర్‌లు ముగ్గురు ఉండాలి. కానీ ఇందులో ఒకరిని అశ్వారావుపేటకు పంపించారు. దీంతో ముగ్గురు హోంగార్డులను, ఆర్టీసీ డ్రైవర్‌ ఒకరిని ఇక్కడికి డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అశ్వారావుపేటలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ 1, ఫైర్‌మెన్‌ 5, డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. మణుగూరు స్టేషన్‌లో వివిధ చోట్ల నుంచి డిప్యూటేషనలపై వచ్చిన సిబ్బందితోనే కాలం వెళ్లదీస్తున్నారు. వాస్తవంగా ఒక్కో స్టేషన్‌లో రోజుకు రెండు షిప్టులు, ఒక్కో షిఫ్టుకు ఎనిమిది మంది చొప్పున పనిచేయాలి. కానీ ఎక్కడా ఇలా జరగటం లేదని, ఖాళీల వల్ల ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోంది సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
నీళ్ల కోసం పరుగులు తీయాల్సిందే... 
అగ్నిప్రమాదాల సమయంలో సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు నీరే ప్రధానం. స్టేషన్‌లో ఎప్పుడూ నీటి ట్యాంకర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు స్టేషన్‌లకు నీటి సౌకర్యం లేదు. భద్రాచలంలో గోదావరి నీరు పుష్కలంగా వస్తున్నందున వాటితోనే ట్యాంకర్‌ను నింపుతున్నారు. మణుగూరులో మోటార్‌ లేదు. అశ్వారావుపేటలో ఉన్న మోటార్‌ మరమ్మతుకు గురైంది. దీంతో ఈ రెండు చోట్ల ట్యాంకర్‌ను నీటితో నింపేందుకు వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల వద్ద నింపుకుంటున్నారు. మోటార్‌ మరమ్మతులకు గురై ఏడు నెలలు కావస్తున్నా, నిధుల లేమితో వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సమస్యలపై సత్వరమే దృష్టి సారించి, అత్యవసర విభాగమైన అగ్నిమాపక శాఖను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 
 
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం 
సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. భద్రాచలంలో భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.  
– రామకృష్ణ,  అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి అధికారి, భద్రాచలం 

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top