వైఎస్సార్‌సీపీ ప్రజా మేనిఫెస్టోకు శ్రీకారం 

YSRCP Started Prepare Public Manifesto - Sakshi

అన్ని కులాలు, వర్గాల ఆకాంక్షలకు ప్రాతినిథ్యం

వైఎస్సార్‌సీపీ జిల్లా నేతల కసరత్తు

వివిధ అంశాలపై సవివరమైన చర్చ

సాక్షి, శ్రీకాకుళం రూరల్‌: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కులాలు, వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించనున్నామని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపకల్ప నకు జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా రాం మాట్లాడుతూ జిల్లాలో వివిధ కులాలు ఉన్నాయని.. వారి సమస్యలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.

ఈనెల 5వ తేదీలోగా ప్రణాళిక తయారుచేసి మేనిఫెస్టో కమిటీకి అందిస్తామన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ మేనిఫెస్టోలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 70 శాతం మంది వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతులను ఆదుకోవాలని ఆయన ప్రతిపాదిం చారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఏడు వేల కుటుంబాలు వంశధార నిర్వాసితులుగా మిగిలిపోయిన విషయం గుర్తించి, పార్టీ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. 2013 ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని.. వారికి మంచినీటి సమస్య, రహదారి సమస్య తీవ్రంగా ఉన్నాయని చెప్పారు.

పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీకూర్మం, శ్రీముఖలింగం పురాతన దేవాలయాలు అయినప్పటికీ అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉన్నాయని, అక్కడ ప్రగతి పనుల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. వంశధార కుడి కాలువ, ఎడమ కాలువ అభివృద్ది చెందినప్పటికీ నేరేడి బ్రిడ్జి సమస్య తీవ్రంగా ఉందని, ఇది అంతర రాష్ట్ర సమస్యగా తీవ్రరూపం దాల్చిందని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను నెలకొల్పాలని ఆయన కోరారు. ఉద్దానం పరిసర ప్రాంతాల్లో వారు పండించే పంటలు జీడిమామిడి, కొబ్బరి, ములక్కాడలు కాకుండా కొత్త పంటలు పండించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జీడి పరిశ్రమకు ప్రత్యేకమైన బోర్డును రూపొందించాలని ఆయన మేనిఫెస్టోలో ప్రతిపాదించారు.

టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్‌ మాట్లాడుతూ గ్రామస, నియోజకవర్గ, జిల్లాస్థాయి మేనిఫెస్టోలు రూపొందించాక రాష్ట్రస్థాయిలో మేనిఫెస్టోలు ఇచ్చే ప్రక్రియను దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని, ఆ విధంగానే రిమ్స్, అంబేద్కర్‌ యూనివర్సిటీలు వచ్చాయని గుర్తుచేసారు. పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదరి అప్పలరాజు మాట్లాడుతూ నవరత్నాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించాలన్నారు. 
గార, శ్రీకాకుళం మండల పార్టీ నాయకులు పీస శ్రీహరి, మూకళ్ళ తాతబాబు, బీసీ సెల్‌ అధ్యక్షుడు సురంగి మోహన్‌రావు, లీగల్‌ సెల్‌ నాయకుడు రఘుపాత్రుని, మాజీ ఎంపీపీ మంజుల, ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు పొన్నాడ రుసి, పార్టీ నాయకులు జేజే మోహన్‌రావు, పి.శ్రీనివాసరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు క్రిష్ణమూర్తి, యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, గిరిజన నాయకుడు ఎండయ్య తదితరులు తమ సూచనలు అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top