
'చంద్రబాబు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు'
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ వైఎస్‌ఆర్ పుణ్యమే అని జోగి రమేష్ అన్నారు.
విజయవాడ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. పోలవరం కాల్వలు కూడా వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని జోగి రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. కమీషన్ల వ్యవహారంలో చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి దేవినేని ఉమ బ్రోకర్‌గా పని చేస్తున్నారని జోగి రమేష్ విమర్శించారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్‌ను తానే పూర్తి చేశానని చంద్రబాబు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు.