ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు ప్రచురించి తమపైనా, పార్టీపైనే బురద చెల్లించేందుకు కుట్ర పన్నిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, బొడ్డు భాస్కరరావు ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు ప్రచురించి తమపైనా, పార్టీపైనే బురద చెల్లించేందుకు కుట్ర పన్నిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, బొడ్డు భాస్కరరావు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీలో పలువురు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను పార్టీ మారుతాననంటూ ఆ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమని తోట చంద్రశేఖర్ అన్నారు. వైఎస్ఆర్ సీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ తరపునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతిలో ఇలాంటి కథనాలు రాసేముందు తమను సంప్రదించి ఉంటే బాగుండేదని తోట చంద్రశేఖర్ హితవు పలికారు.
వైఎస్ఆర్ సీపీ నేత బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రేటింగ్ పెంచుకోవడం కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు విమర్శించారు. ఉభయగోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న వైఎస్ఆర్ సీపీ దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు. పొలిటికల్ ఎజెండాతో ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల పత్రికల పట్ల విలువ ఉండదని బొడ్డు భాస్కరరావు పేర్కొన్నారు.