సంక్షేమ పాలనకు స్వాగతం పలుకుదాం

YSRCP Leaders Speech in Public Meeting - Sakshi

ప్రజాసంకల్పయాత్ర బృందం :రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, మాఫియాలు, మోసాలతో సాగుతున్న పాలనకు చరమగీతం పాడి జననేత జగన్‌మోహన్‌ రెడ్డి అందించే సంక్షేమ పాలనకు స్వాగతం పలుకుదామని వైఎస్సార్‌ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలుద్దామని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుకుందామన్నారు. ‘నవరత్నాలతో’ జీవితాలు బాగుచేసుకోవాలంటూ ప్రజలకు సూచించారు. కురుపాంలో మంగళవారం జరిగిన ప్రజాసంకల్పయాత్ర సభ జనంతో పులకించిపోయింది. దారి పొడవునా గిరిజనులు తమ సమస్యలు ఏకరువుపెట్టారు. నాలుగున్నరేళ్లుగా పడుతున్న ఇబ్బందులను వినిపించారు. త్వరలోనే సంక్షేమ పాలన వస్తుందని, సమస్యలన్నీ పరిష్కారమవుతాయంటూ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు పార్టీ నాయకులు భరోసా ఇచ్చారు.

ఎవరితోనైనా పోటీకి రెడీ
వైఎస్సార్‌ సీపీ అధినేత రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పులి వెందుల నుంచి మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కురుపాం వరకూ వేలకిలోమీటర్లు పాదయాత్రగా వచ్చారు. మేం కూడా ఏజెన్సీ ప్రజల కోసం, వైఎస్సార్‌సీపీ పార్టీ కోసం ఎవరినైనా ఎదిరిస్తాం. ఎవరితోనైనా పోటీకి దిగుతాం. టీడీపీ నిరంకుశ పాలనను కూకటి వేళ్లతో పెకిలించడానికి సిద్ధమవుతున్న జగనన్నతో కలసి ఆ పార్టీ నాయకుల అహంకారాన్ని కూల్చేస్తాం.    – శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

టూరిజం ప్రాజెక్టును పక్కన పెట్టేశారు..  
కురుపాం ప్రాంతంలో గిరిజన  గ్రామాల మధ్య అక్కడి వనరులతో మెడికో టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన చేసి దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆదేశించారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం దీనికి పూర్తిగా మంగళం పాడింది. గిరిజన సంక్షేమం కోసం పోడు వ్యవసాయం చేసుకునే వేలాది కుటుంబాలకు పట్టాలు అందజేసిన ఘనత స్వర్గీయ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిదే. చంద్రబాబు నాయుడిది అంతా సొంత కుటుంబ పాలన. ఏ తప్పులూ చేయకపోతే సీబీఐ వద్దని ఎందుకు జీఓలు విడుదల చేశారు?   – బొత్స ఝాన్సీ లక్ష్మి,మాజీ ఎంపీ, విజయనగరం  

అన్ని బహిరంగ సభలకూ జనాదరణ
జిల్లాలో జననేత జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించిన అన్ని బహిరంగ సభలకూ జనం పోటెత్తారు. జిల్లాలో చివరి బహిరంగ సభకు కూడా అత్యంత జనాదరణ చూపిన ప్రజలు మేమంతా జగనన్న వెంట ఉన్నామని నిరూపించారు. జిల్లాలో జగన్‌ పర్యటనకు జననీరాజనాలు పలుకుతున్నారు. జగనన్నపై హత్యాయత్నం చేస్తే జనమంతా మా ఊపిరి ఉన్నంత వరకూ మేమున్నామంటూ వెన్నంటి నిలుస్తున్నారు.
అలజంగి జోగారావు,పార్వతీపురం సమన్వయకర్త

ట్రైకార్‌ రుణాలన్నీ టీడీపీ కార్యకర్తలకే...
ఐటీడీఏ అధికారులు, పాలక వర్గం గిరిజన ఎమ్మెల్యేల సలహాలు తీసుకుని గిరిజనులకు సంక్షేమాన్ని అందించేవి. ఇప్పుడు ఐటీడీఏ నిధులన్నీ కైంకర్యం చేస్తున్నారు. ట్రైకార్‌ రుణాలన్నీ టీడీపీ కార్యకర్తలకే ఇస్తున్నారు. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. జీసీసీని నిర్వీర్యం చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో ఏటా లక్ష క్వింటాళ్ల చింతపండు కొనుగోలు చేయొచ్చు. కానీ దళారులతో కుమ్మక్కవుతున్నారు. చంద్రబాబు  మద్దతుతో ఆర్‌పీ భంజ్‌దేవ్‌ వంటి వారు గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితేనే గిరిజనసంక్షేమం పట్టాలెక్కుతుంది.– పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు

పెద్దల సాయం లేకున్నా...
మాకు పెద్దల సాయం లేకపోయినా గిరిజనుల అభిమానం ఉంది. కార్యకర్తల ప్రేమానురాగాలున్నాయి. జిల్లా నాయకుల మద్దతు ఉంది. అన్నింటికీ మించి జననేత జగనన్న ఆశీస్సులున్నాయి. ఎంతో మంది ప్రలోభపెట్టినా కట్టెకాలేవరకూ వైఎస్సారే సీపీయే మా పార్టీ. జగనన్నే మా నాయకుడు. ఈ కురుపాం గడ్డ వైఎస్సార్‌ కుటుంబానికి అడ్డా. ఏ గిరిజన గూడెంలో అయినా మా అందరి గుండెల్లో అయినా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కొలువుతీరి ఉన్నాడు. ఆయన హయాంలో ఎంతో సంక్షేమం పొందిన ఈ ప్రాంతం జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉంది. – పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే, కురుపాం

జననేత పాలనలో సమస్యల పరిష్కారం  
గిరిజనులకు వైద్యం, విద్య, సాగు, తాగునీరు సమృద్ధిగా అందాలంటే వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కావాలి. ఆయన సీఎం కావాలంటే మనమంతా సైనికుల్లా పనిచేయాలి. అప్పుడే అందరి కష్టాలు తీరుతాయి. అందరి సమస్యలూ పరిష్కారమై రాజన్నరాజ్యం మళ్లీ వస్తుంది. గిరిజన సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్షేమ పాలన అందుతుంది. ఆనందమయ జీవితం లభిస్తుంది.
– జి.మాధవి,అరకు పార్లమెంటరీ సమన్వయకర్త

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top