వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేశాం

YSRCP leaders phones have been tapped by State Govt - Sakshi

హైకోర్టు ముందు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ జూన్‌ 6కి వాయిదా

ఆ ఐదు సందర్భాల్లోనే ట్యాప్‌ చేయవచ్చుంటున్న సెక్షన్‌ 5(2)

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమేనని హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. టెలిగ్రాఫ్‌ చట్టం 1885లోని సెక్షన్‌ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈ వివరాలను కౌంటర్‌ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తనతో పాటు తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను అధికార పార్టీ కోసం పోలీసులు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారో జాబితాను సమర్పించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్‌ కార్యదర్శి, వోడాఫోన్‌ ఏపీ, తెలంగాణ నోడల్‌ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అలాగే డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ డీజీలను టెలిగ్రాఫ్‌ చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్‌ చేయవచ్చో సెక్షన్‌ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, సెక్షన్‌ 5(2)ను అనుసరించే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని చెప్పారు. తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. అయితే ఈ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఎస్‌పీ ఇంటెలిజెన్స్, విజయవాడ పేరు మీద గత వారం తమకు ఇచ్చిన సీల్డ్‌ కవర్‌ను వెనక్కి ఇచ్చేస్తున్నామని ధర్మాసనం ఏజీకి చెప్పింది. ఆ సీల్డ్‌ కవర్‌ను కోర్టు వద్ద ఉంచుకున్నా తమకు అభ్యంతరం లేదని ఏజీ చెప్పగా, ప్రస్తుతం ఆ వివరాలతో తమకు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది.

సెక్షన్‌ 5(2) చెబుతోంది ఇదే..
1.దేశ సమగ్రత, సార్వభౌమత్వం 2. దేశ భద్రత 3.విదేశాలతో స్నేహ సంబంధాలు 4. పబ్లిక్‌ ఆర్డర్‌ 5.నేర ప్రేరేపణను నిరోధించడం. ఈ ఐదు సందర్భాల్లో మాత్రమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయవచ్చునని టెలిగ్రాఫ్‌ చట్టం చెబుతోంది. ఈ సందర్భాలు మినహా మిగిలిన ఏ సందర్భాల్లోనూ ఫోన్‌ ట్యాప్‌ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పీయూసీఎల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఐదు సందర్భాలను అనుసరించే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్లు చెబుతోంది. కాని వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌ నెంబర్‌తో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్‌ నెంబర్లను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ట్యాప్‌ చేయాలని వోడాఫోన్‌ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top