సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం గురువారంతో ముగిసింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం గురువారంతో ముగిసింది. 48 గంటల నిరసనలో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల కన్వీనర్లు, నాయకులు రహదారులను దిగ్బంధించి రాకపోకలను స్తంభింపజేశారు. ఆర్టీసీ యాజమాన్యం ముందస్తుగా 130 బస్సులను డిపోలకే పరిమితం చేయగా.. 200 పైగా బస్సులు ఆలస్యంగా నడిచాయి. రెండు రోజుల్లో సంస్థకు రూ.45 లక్షల నష్టం వాటిల్లింది. బుధ, గురువారాల్లో చేపట్టిన నిరసనల్లో భాగంగా 150 మంది పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం బెదిరింపులకు పూనుకుంది. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలుకు పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించింది. ప్రభుత్వ బెదిరింపులకు బెదరక జిల్లా వ్యాప్తంగా 7, 18 జాతీయ రహదారులతో పాటు గ్రామాల వైపు వెళ్లే దారులపైనా బైఠాయించి నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలియజేశారు. జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత ఆధ్వర్యంలో కల్లూరు సమీపంలోని జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా వంటావార్పు చేసి రోడ్డుపైనే సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి, మైనార్టీ సెల్ నాయకుడు హఫీజ్‌ఖాన్, జిల్లా కమిటీ సభ్యుడు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆదేశాలతో 9 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా 25 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల నుంచి ఒంగోలుకు వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో వివాహాలకు వెళ్లే వారికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొందరు ప్రయాణికులు నిరసనలో పాల్పంచుకొని ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలతో హోరెత్తించారు.
బాలస్వామి అనే వికలాంగుడు పార్టీ జెండాతో నిరసనలో పాల్గొని స్ఫూర్తి నింపారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆదేశాలతో బి.వి.రామిరెడ్డి జాతీయ రహదారిపై రాకపోకలను స్తంభింపజేశారు. పత్తికొండలో సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు, బైపాస్ క్రాస్ రోడ్డు కూడలిలో వాహన రాకపోకలను నిలిపేశారు. ఆత్మకూరులో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి, నంద్యాల చెక్‌పోస్టు వద్ద శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో దిగ్బంధించారు. దీంతో విజయవాడ, గుంటూరు, చీరాల, ఒంగోలు, శ్రీశైలం, కర్నూలు, మంత్రాలయం, రాయిచూర్, సింధనూర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బండిఆత్మకూరు పరిధిలోని సంతజూటూరు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు ఉంచి నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అరెస్టు
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోనెగండ్ల సర్కిల్‌లో రహదారిని దిగ్బంధించడంతో కర్నూలు-బళ్లారి, మంత్రాలయం, గూడూరు వైపు వెళ్లాల్సిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్యలను అరెస్టు చేసి జీపులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నందికొట్కూరులో మాండ్ర శివానందరెడ్డి, బండి జయరాజ్ స్థానిక కేజీ రోడ్డులోని మార్కెట్ యార్డు, జమ్మిచెట్టు వద్ద రోడ్లను దిగ్బంధించి రాకపోకలను స్తంభింపజేశారు. ఈ కారణంగా జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం అరగంట పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
కోవెలకుంట్ల, కొలిమిగుండ్లలో ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు, అంకాలమ్మ చౌరస్తాలో నంద్యాల, జమ్మలమడుగు, ఆళ్లగడ్డ వైపు జాతీయ రహదారులను కలిపే రోడ్డును, నెల్లూరు-ముంబై 57వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆలూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించి రాకపోకలను అడ్డుకున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసనలతో ప్రయాణికులు ఇక్కట్లకు లోనయ్యారు. ఉపాధ్యాయులు కొందరు ఆలస్యంగా పాఠశాలలకు వెళితే.. మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇబ్బందులకు కారుకులైన కాంగ్రెస్ పార్టీ నేతలపై దుమ్మెత్తిపోయటం గమనార్హం. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు శాపనార్ధాలు పెట్టడం కనిపించింది.