గిరిపుత్రుల గుండెల్లో  వైఎస్‌

Ysr Implemented Good Schemes To St - Sakshi

సాక్షి, బుట్టాయగూడెం: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్‌ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్‌ కనెక్షన్‌లు ఏర్పాటు చేసి, ఉచిత కరెంట్‌ ఇచ్చారు. దీంతో కూలీలు రైతులుగా మారారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం ద్వారా బోర్లు వేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించి ఇచ్చారు. దీంతో బీడు భూములు సైతం సాగుకు యోగ్యంగా మారి పచ్చని పంటలతో కళకళలాడుతూ సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. 

ఏజెన్సీలో 15 వేల ఎకరాల పంపిణీ
గిరిజన ప్రాంతంలో తరతరాలుగా భూములు లేక కూలీలుగానే జీవిస్తున్న వారికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోలవరం నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల వరకు భూములు పంచి వాటికి పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో పంటలు పండించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న గిరిజన చిన్న, సన్నకారు రైతులు వైఎస్సార్‌ను దేవుడుగా కొలుస్తున్నారు.

సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు
రాజన్న అకాల మరణం తరవాత పేదోడికి సెంటు భూమి పంచి ఇచ్చే నాథుడే లేరంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మందికి పైగా అటవీ హక్కుల చట్టంలో భూముల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జానెడు భూమి పంచలేదని గిరిపుత్రులు విమర్శిస్తున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే రాజన్న బిడ్డ జగన్‌మోహన్‌ రెడ్డి రావాలని, ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రకాశరావుపాలెం సమీపంలో గిరిజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులకు అండగా ఉంటానని గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మరింత మారతాయని ఆదివాసీలు ఆశిస్తున్నారు.

వైఎస్‌ చలవతోనే భూమి 
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నాకు 5 ఎకరాల భూమిని పంచి ఇవ్వడంతో పాటు ఆ భూముల్లో బోర్లు వేసి ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించడం వల్ల ఆ భూముల్లో ప్రత్తి, మొక్కజొన్న, బెండ, కంది వంటి పంటలు పండిస్తున్నాను. వ్యవసాయ కూలీగా ఉన్న నేను రైతుగా మారతానని కలలో కూడా అనుకోలేదు. వైఎస్‌ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.                                         
– ముచ్చిక బేబి, గిరిజన మహిళా రైతు, మర్లగూడెం

ఇందిర ప్రభలో నీటి సదుపాయం
రాజశేఖరరెడ్డి పాలనలో మాకు వ్యవసాయ పోడు భూములకు రెండెకరాలకు పట్టా ఇచ్చి హక్కు కల్పించారు. అదేవిధంగా సాగునీటి ఇబ్బందులు రాకుండా ఇందిర ప్రభ పథకంలో నీటి సదుపాయం కూడా కల్పించారు. ఆ భూముల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలు వేసుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నాం. భూమికి హక్కు పత్రం ఇవ్వడం వల్ల వ్యవసాయ రుణం పొందేందుకు కూడా అవకాశం కలిగింది.
– మడకం రాజు, గిరిజన రైతు, లంకాలపల్లి, బుట్టాయగూడెం మండలం

ఐదేళ్లుగా పట్టాలు రాలేదు
మా గ్రామంలోని భూమిలేని 24 మంది గిరిజనులకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వైఎస్‌ రాజశేఖరరెడ్డి భూములిచ్చారు. ఆ సమయంలో 12 మంది దరఖాస్తులు చేసుకోగా పట్టాలు వచ్చాయి. వైఎస్సార్‌ మరణం తర్వాత మిగిలిన 12 మంది దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకూ పట్టాలు రాలేదు. వైఎస్సార్‌ ఉంటే ఎప్పుడో పట్టాలొచ్చేవి. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే పోడు భూములకు పట్టాలొస్తాయని నమ్ముతున్నాం.
– పెనువెల్లి సోమరాజు, రైతు, బండార్లగూడెం, బుట్టాయగూడెం మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top