‘రుణ మాఫీ’ ఎంత? ఎప్పటికి?

‘రుణ మాఫీ’ ఎంత? ఎప్పటికి? - Sakshi


* స్పష్టత కోసం ప్రతిపక్షం పట్టు.. అధికార పక్షం ఎదురుదాడి... దద్దరిల్లిన అసెంబ్లీ

* లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దానిని రూ. 37 వేల కోట్లకు కుదించారు

* డిసెంబర్ 31వ తేదీ లోగా తీసుకున్న రుణాలకే వర్తిస్తాయని షరతులు పెట్టారు

* మరి పాత అప్పులు చెల్లించి కొత్త రుణం తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందా?

* మాఫీపై ఆశలతో అప్పు చెల్లించని రైతులపై భారీగా వడ్డీ భారం పడుతోంది

* లక్షకు ఏడాదికి రూ. 12 వేలు చొప్పున రెండేళ్లకు రూ. 24 వేలు వడ్డీ అవుతోంది

* దీనిని ఎవరు చెల్లిస్తారు? రైతులపైనే భారం వేస్తారా? సర్కారు ఆదుకుంటుందా?

* శాసనసభలో సర్కారుపై ప్రశ్నల వర్షం సంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు

* రుణాల మొత్తం ఎంతో బ్యాంకుల నుంచి సమాచారం రాలేదు : మంత్రి జవాబు

* జనవరి నుంచి మార్చి 31 వరకు రుణాలు చెల్లించిన వారికీ మాఫీ వర్తింపచేస్తాం

* రుణ మాఫీ - రీషెడ్యూల్ అంటూ రైతులను గందరగోళపరచవద్దన్న విపక్షం

* విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన స్పీకర్

* ప్రశ్నలకు ప్రభుత్వం సూటిగా జవాబు చెప్పట్లేదంటూ విపక్షం నిరసన, వాకౌట్


 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ అంశంపై బుధవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంధించిన ప్రశ్నలకు పాలకపక్షం జవాబులు చెప్పలేక ఎదురు దాడికి దిగింది. అడిగిన ప్రశ్నలతో సంబంధం లేకుండా సమాధానాలు చెప్పి చేతులు దులుపుకునేందుకు యత్నించింది. రుణ మాఫీ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలన్న ప్రశ్నకు పాలకపక్షం నుంచి జవాబు లేకపోవడంతో విపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. వైఎస్సార్ సీపీ సభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నపై సభలో ఈ దుమారం చెలరేగింది.

 

 రుణ మాఫీపై షరతులేమిటీ?


 రాష్ట్రంలో 2013 డిసెంబర్ 31కి ముందు రుణా లు పొందిన వారికి మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందంటూ ప్రభుత్వం విడుదల చేసిన 174వ జీవో రైతుల్ని తీవ్రంగా నిరాశపరిచిందని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ‘‘మరి పాత అప్పులు చెల్లించి కొత్తగా 2014 జనవరి నుంచి మార్చి 31లోపు రుణాలు తీసుకున్న వారికి రుణ మాఫీ వర్తిస్తుందా? లేదా? సహకార సంఘాల నుంచి పంట రుణాల తీసుకున్న వారి సంగతేమిటి?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులందరికీ రుణ మాఫీ అని ఎన్నికలకు ముందు ప్రకటించి.. ఇప్పుడు షరతులు పెట్టడం సమంజసం కాదని తప్పుపట్టారు. ‘‘లక్ష కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తామని ఆనాడు ప్రకటించి ఇప్పుడు రూ. 37,000 కోట్లకు కుదించారు.. నిజాయితీగా రుణాలు తిరిగి చెల్లించిన రైతుల్ని ఆదుకుంటారో లేదో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘సొసైటీల నుంచి తీసుకున్న రుణాలకు ఈ ఏడాది మార్చి 31లోపు చెల్లించిన వారికే వడ్డీ రాయితీ వస్తుంది. ప్రభుత్వం మీద ఆశతో రైతులు రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు వాటిపై వడ్డీ, అపరాధ వడ్డీ పడుతోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం కడుతుందో? లేదో? స్పష్టత ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు.

 

 ఎప్పటిలోగా చెల్లిస్తారు?

 ‘‘రుణ పరిమాణం ఎంత? ఎన్ని వేల కోట్లు కా వాలి? ఎప్పటిలోగా చెల్లిస్తారు?’’ అని ఆది మూలపు సురేష్ కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల నివేదిక ప్రకారం రాష్ట్రంలో పంట రుణాలు రూ. 87,612 కోట్లు ఉన్నాయని, కోటయ్య నివేదిక ప్రకారం 572 మండలాలకు రుణాల రీషెడ్యూల్ ప్రతిపాదనలున్నాయన్నారు. రుణాల రీషెడ్యూల్‌ను, రుణ మాఫీని కలిపి రైతుల్ని గందరగోళానికి గురిచేయవద్దన్నారు. ప్రకటించిన మేరకైనా రుణ మాఫీకి నిధులు ఎలా సమీకరిస్తారో చెప్పాలని నిలదీశారు. ఈ దశలో స్పీకర్ ఆయన మైకు ను కట్ చేసి టీడీపీ సభ్యుడు బోండా మహేశ్వరరావును మాట్లాడాల్సిందిగా కోరారు. విపక్షంపై బోండా ఆరోపణలు చేయడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. తాము మాట్లాడుతుండగా మైక్ కట్ చేసి పాలకపక్షానికి ఎలా ఇస్తారంటూ సభాపతిని ప్రశ్నించారు. ఈ దశలో పాలక, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ‘‘వ్యవసాయ మంత్రి చెప్పాల్సిన సమాధానాలను బోండా చెప్తారా?’’ అని విపక్ష సభ్యులు నిలదీశారు.

 

 వడ్డీ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు?: జగన్

 మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యల అనంతరం ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించా రు. అడిగిన ప్రశ్నకు - చెప్తున్న జవాబుకీ పొం తన లేదన్నారు. ‘‘ఎన్ని రుణాలు మాఫీ అవుతున్నాయి? వీటిల్లో పంట రుణాలెన్ని? బం గారు రుణాలెన్ని? జిల్లాల వారీ వివరాలేమి టి? అని అడిగితే మంత్రి ఏవేవో చెప్తున్నారు. రూ. 87 వేల కోట్ల మేర వ్యవసాయ రుణాలు, రూ. 14వేల కోట్ల మేర డ్వాక్రా రుణాలు ఉన్నాయని ఎస్‌ఎల్‌బీసీలో చెప్పారు. వాటిని మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. కేటాయింపులేమో తగ్గించి పరిమితులు విధిం చారు. ఎలా తగ్గించాలో ఆలోచిస్తున్నారు. ఎం త లోపు రుణం మాఫీ అవుతుందో చెప్పడం లేదు. లక్షా 11 వేల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ పెట్టారు.

 

 అందులో రుణ మాఫీకి కేవలం రూ.5వేల కోట్లే కేటాయించారు. బ్యాం కులేమో రుణాలు చెల్లించమంటున్నాయి. లే కుంటే డిఫాల్డర్లుగా ప్రకటిస్తున్నాయి. సకాలం లో అసలు చెల్లించని వారికి వడ్డీ మాఫీ కాదు. ఫలితంగా లక్షకు ఏడాదికి 12 వేల రూపాయల వడ్డీ పడుతుంది. ఆ మరుసటి ఏడాదికి (రుణ మాఫీ చెల్లించేలోగా) మరో 12 వేలు వడ్డీ పడుతుంది. ఈ వడ్డీని ఎవరు కడతారో చెప్పమంటే సమాధానం లేదు. సత్యదూరమైన హామీలు ఇచ్చారు. అన్నదాతను ఆశల్లో ఊరిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామంటున్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి మమ్మల్ని నింది స్తారా?’’ అని జగన్ సర్కారు వైఖరిని ఎండగడుతుండగా.. స్పీకర్ ఆయన మైక్‌ను కట్ చేశా రు. నేరుగా ప్రశ్న అడగాలంటూ అప్పటికే స్పీ కర్ రెండుసార్లు మైక్ కట్ చేయడం, జగన్ మాట్లాడేటప్పుడు టీడీపీ సభ్యులు గొడవ చే స్తుండడంతో జగన్ తీవ్ర నిరసన వ్యక్తంచేశా రు. ఈ వ్యవహారమై వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

 

మాఫీ ఎంతో ఇప్పుడే చెప్పలేం: మంత్రి


 వైఎస్సార్ సీపీ సభ్యు ల ప్రశ్నలకు మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం చెప్తూ.. వ్యవసాయ, బంగారు రుణాల మాఫీ కోసం వాస్తవంగా ఎంత నిధులు కావాలన్న సమాచారాన్ని బ్యాంకుల నుంచి రాబడుతున్నామని, వచ్చిన తర్వాతే రుణాల మాఫీకి అవసరమైన మొత్తమెంతో తెలుస్తుందన్నారు. డ్వాక్రా సంఘాలను పటిష్టం చేయడానికి లక్షకు మించకుండా కొత్త మూలధనాన్ని కల్పించాలని మంత్రి మండలి తీర్మానించిందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో విపత్తు ప్రభావితమైనవిగా గుర్తించిన మండలాల్లో లక్ష లోపు స్వల్పకాలిక వ్యవసాయ పంట రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ప్రభుత్వం అనుమ తి ఇచ్చిందన్నారు.

 

గత ఏడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న ఖరీఫ్ రుణాలకు, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకు రుణాలు చెల్లించిన వారికి మాఫీ వర్తిస్తుంద ని మంత్రి తెలిపారు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో కొత్తగా రుణాలు తీసుకున్న వారిలో మంచివాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లకూ రుణ మాఫీని వర్తింపజేస్తామని వ్యాఖ్యానించారు.  42,63,000 మం ది రైతులకు రుణమాఫీ వర్తిసుందని చెప్పా రు. బంగారు రుణాలను మాఫీ చేసిన ఘ నత తమదేనని, రుణాలు చెల్లించినా లక్షన్నర రూపాయల మాఫీ వర్తింపజేస్తామని మంత్రి చెప్తుండగా.. ఎప్పటిలోగా మాఫీ చే స్తారో చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు కోరా రు. దీంతో సభలో దుమారం చెలరేగింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top