మరింత మందికి వైఎస్సార్‌ చేయూత | YSR Cheyutha Scheme Expansion to Many women groups | Sakshi
Sakshi News home page

మరింత మందికి వైఎస్సార్‌ చేయూత

Jul 16 2020 3:40 AM | Updated on Jul 16 2020 8:36 AM

YSR Cheyutha Scheme Expansion to Many women groups - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలకు ఉపాధి మార్గాలను విస్తృత పరిచి, తద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వైఎస్సార్‌ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం.. ఇప్పటికే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు వైఎస్సార్‌ చేయూత కింద నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని నిశ్చయించారు. ఈ కీలక నిర్ణయానికి బుధవారం జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మానవీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 8.21 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. తాజా నిర్ణయం కారణంగా పెన్షన్‌ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ వైఎస్సార్‌ చేయూత ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూర్చనున్నారు.

► మహిళలకు జీవనోపాధి మార్గాలను కల్పించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా ఆదుకుంటామని గత ఎన్నికల ప్రణాళికలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
► బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఈ పథకం కింద అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు వారి చేతిలో పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ హామీకి కట్టుబడి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. లబ్ధిదారులు జూన్‌ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు.  
► 60 ఏళ్లలోపు ఉన్న వివిధ వర్గాల మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోంది. వీరిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత కార్మికులు, మత్స్యకార మహిళలూ ఉన్నారు. వీరు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నేపథ్యంలో మానవతా దృక్పథంతో సీఎం జగన్‌ వీరికి కూడా ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా లబ్ధి కలిగించాలని నిర్ణయించారు.
► ఇలాంటి వర్గాలకు చెందిన మహిళలకు మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు. ఆర్థికంగా భారమైనప్పటికీ వారికి కూడా వైఎస్సార్‌ చేయూత కింద ప్రయోజనాలను అందించాలని, ఆమేరకు వారినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశాన్ని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టారు. 
► దీంతో వైఎస్సార్‌ చేయూత విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం వల్ల దాదాపుగా 8.21 లక్షల మంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత కారణంగా ప్రయోజనం చేకూరనుంది. ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement