నిత్యస్ఫూర్తి.. చెదరని కీర్తి | Sakshi
Sakshi News home page

నిత్యస్ఫూర్తి.. చెదరని కీర్తి

Published Sat, Jul 7 2018 7:10 AM

YS Rajashekar Reddy Jayanti Special Story - Sakshi

ఆయన మట్టిని ప్రేమించారు. మట్టిని నమ్ముకున్న మనుషుల్ని ప్రేమించారు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న శ్రమజీవులపై కరుణ కురిపించారు. రాజ్యాంగం సాక్షిగా చేసిన ప్రమాణాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించారు. వారి కష్టాల్లో తోడై నిలిచారు. దిక్కు లేనివారికి ఆసరా ఇచ్చారు. ఎటువంటి వివక్షా చూపకుండా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు పంచడానికి
అనుక్షణం పరితపించారు. అందుకే ఆయన అందరికీ నిత్యస్ఫూర్తి అయ్యారు. చెదరని కీర్తితో జనం గుండెల్లో మహానేతగా నిలిచారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాను బహుముఖంగా అభివృద్ధి చేసిన ఘనత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. వ్యవసాయాధారితమైన జిల్లాలో ఆ రంగాన్నే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు ఎంతో చేయూతనిచ్చారు. సాగునీటి వసతుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వివిధ సంక్షేమ పథకాలతో జిల్లావాసులగుండెల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.

సాగునీటి రంగ అభివృద్ధికి..
జిల్లాలో సాగునీటి రంగ అభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. డెల్టాలో ఆయకట్టు స్థిరీకరణకు, వర్షాధారానికే పరిమితమైన ఏజెన్సీలో రెండు పంటలకు సాగునీరందించేందుకు ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆయన అంకురార్పణ చేశారు. రాష్ట్ర విభజనతో జాతీయ ప్రాజెక్టుగా మారిన పోలవరానికి ఎంతో సాహసం చేసి శ్రీకారం చుట్టింది ఆయనే.

డెల్టా ఆధునికీకరణకు..
డెల్టా ఆధునికీకరణకు వైఎస్సార్‌ రూ.1,710 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,190 కోట్లు పంట కాలు వలకు, రూ.550 కోట్లు మురుగునీటి కాలువల ఆధునికీకరణకు కేటాయించారు. జిల్లాలో 4.80 లక్షల ఎకరాలకు డెల్టా వ్యవస్థ ద్వారా సాగునీరు అందుతోంది. వైఎస్‌ హయాంలో రూ.650 కోట్లు మంజూరు చేయగా, తర్వాత రూ.150 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి. వైఎస్‌ హయాంలో శరవేగంగా సాగిన ఆధునికీకరణ పనులు తర్వాత పడకేశాయి.

ప్రాజెక్టుల రూపకర్తగా..
ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో రూ.138 కోట్ల అంచనాతో 2008 జూన్‌ 24న జీవో 569 విడుదల చేశారు. మూడు ప్యాకేజీలుగా దీనిని విడదీశారు. ఆయన హయాంలోనే పనులు మొదలు పెట్టారు.

ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా 2007లో భూపతిపాలెం ప్రాజెక్టు ఆరంభమైంది. దీని తొలి అంచనా రూ.47.23 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి రూ.160.63 కోట్లకు చేరింది. 21 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే దాదాపు పనులు పూర్తయ్యాయి.

ఏజెన్సీలో రెండు పంటలకు సాగునీరందించేందుకుగాను ముసురుమిల్లి ప్రాజెక్టును 2007లో వైఎస్సార్‌ హయాంలో చేపట్టారు. దీని తొలి అంచనా రూ.207 కోట్లు. 24 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఆయన హయాంలో పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత మందకొడిగా సాగాయి. ఇప్పటివరకూ రూ.54 కోట్లు ఖర్చు పెట్టారు. దీనిలో రూ.50 కోట్లు వైఎస్సార్‌ హయాంలోనే ఖర్చు చేశారు. గడచిన నాలుగేళ్లలో దీనికి చంద్రబాబు రూ.4 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇంకా 15 శాతం పనులు చేయాల్సి ఉంది.

జిల్లాను సస్యశామలం చేసే పోలవరం ప్రాజెక్టుకు మహానేత శ్రీకారం చుట్టారు. ఐదు జిల్లాల్లో 23 లక్షల ఎకరాల స్థిరీకరణ, కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు, 900 మెగావాట్ల విద్యుత్‌ అందించాలన్న లక్ష్యంతో ఈ పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే 70 శాతం పైగా కుడి, ఎడమ కాలువల పనులు జరిగాయి.

గోదావరి నీటిని మెట్ట ప్రాంతానికి తరలించే పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్సార్‌ రూ.900 కోట్లు కేటాయించారు. 1.45 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పురుషోత్తపట్నం నుంచి తుని వరకూ కాలువ తవ్వారు. శరవేగంగా పనులు పూర్తి చేసి 2008లో అప్పటి యూపీఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేతుల మీదుగా ఆరంభించారు. వర్షాధారంగా పంటలు పండే ఈ భూముల్లో పుష్కర పుణ్యమా అని నీటి ఎద్దడి లేకుండా పంటలు పండుతున్నాయి.

16 గ్రామాలకు తాగు, సాగునీరందించే అన్నంపల్లి అక్విడెక్ట్‌ శిథిలావస్థకు చేరుకుంది. కొత్త అక్విడెక్టుకు మహానేత శంకుస్థాపన చేయడమే కాకుండా నిధులు మంజూరు చేశారు.

2006లో గోదావరి వరద ఉధృతికి అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం ఊడిమూడిలంకల వద్ద వద్ద ఏటిగట్లు తెగిపడి కోనసీమలో ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. దీనిపై చలించిన వైఎస్సార్‌ గోదావరి ఏటిగట్లను ఎత్తు, వెడల్పు చేసి, పటిష్టపరిచే పనులకు రూ.586.67 కోట్లు కేటాయించారు. అనంతరం దీనిని రూ.602.528 కోట్లకు పెంచారు. వైఎస్సార్‌ హయాంలో కీలకమైన పనులు జరిగాయి.

రైతులకు అండగా..
2008 డిసెంబర్‌లో రబీ సాగు ఆరంభంలో ఏర్పడిన నీటి ఎద్దడిని నివారించేందుకు మురుగునీటి కాలువపై క్రాస్‌బండ్లు వేయాలని, గోదావరిలో వృథా పోతున్న నీటిని కాలువలకు మళ్లించాలని, మోటార్లతో నీరు తోడుకున్న రైతులకు డీజిల్‌ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అప్పటికప్పుడు రూ.7 కోట్లు మంజూరు చేశారు. కిన్నెరసాని, సీలేరు నుంచి అదనంగా నీరు తెప్పించారు. ఫలితంగా డెల్టాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా రబీ పంట పండింది. రికార్డు స్థాయిలో ఎకరాకు 50 నుంచి 55 బస్తాల ధాన్యం దిగుబడులు వచ్చాయి.

కొబ్బరి ఉత్పత్తులపై 4 శాతం పన్ను ఉండేది. ఆ తర్వాత 2 శాతానికి తగ్గింది. కానీ కోనసీమ రైతుల కోరిక మేరకు ఆ 2 శాతం పన్నును కూడా వైఎస్సార్‌ రద్దు చేశారు.

2009లో రైతులకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.50 చొప్పున పెంచగా, ఇది చాలదని రైతులు డిమాండ్‌ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వింటాల్‌కు రూ.50 చొప్పున బోనస్‌ ఇచ్చారు. దీనివల్ల జిల్లా రైతులకు రూ.60 కోట్ల వరకూ ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా మహానేత హయాంలోనే వ్యవసాయ రుణాలు మాఫీ చేశారు. సకాలంలో చెల్లించిన, మాఫీ లబ్ధి పొందని రైతులకు రూ.5 వేల ప్రోత్సాహకం అందించారు.

సొంతింటి కల నెరవేర్చిన బాంధవుడిగా..
పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది. తన హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ పథకాన్ని 2006 ఏప్రిల్‌ ఒకటో తేదీన కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రిక నుంచే ఆయన ప్రారంభించారు. మునుపెన్నడూ లేనివిధంగా సొంత స్థలాలు లేని పేదల కోసం కోట్ల రూపాయలతో జిల్లావ్యాప్తంగా వందలాది ఎకరాలు సేకరించారు. ఇందిరమ్మ మూడు దశల్లో భాగంగా స్థలాలు మెరక చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇందిరమ్మ మూడు దశల్లోనూ జిల్లావ్యాప్తంగా 2,14,205 ఇళ్లు మంజూరు చేశారు. వీటికోసం రూ.743.26 కోట్లు విడుదల చేశారు. వీటిలో సుమారు 1.96 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో పూర్తయ్యాయి.

ప్రాణం పోసిన వైద్యుడిగా..
పేద ప్రజల ఆరోగ్యదాయిని ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో వెలుగు నింపారు. లక్షల కుటుంబాలు అప్పులపాలు కాకుండా అండగా నిలిచారు. 2,74,727 మందికి వైద్యం అందించారు. రూ.604 కోట్ల మేర ఖర్చు పెట్టి ప్రాణం పోశారు.

పేదలకు కార్పొరేట్‌ చదువులందించిన నేతగా..
ధనవంతులే కాదు.. పేదలూ కార్పొరేట్‌ విద్య పొందాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షా 50 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఎంబీబీఎస్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌ వంటి కోర్సులను ఉచితంగా చదివారు. దాదాపు 40 వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఎదిగారు. ప్రభుత్వ ఉద్యోగులుగా, అధ్యాపకులుగా స్థిరపడ్డారు. మరో 50 వేల మంది వరకూ స్వయం ఉపాధి బాటలో పయనించారు.

Advertisement
Advertisement