వైఎస్‌ అనే నేను..

ys rajasekhara reddy vardhanthi 9th death anniversary - Sakshi

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనే నేను.. అంటూ లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై నువ్వు చేసిన తొలి సంతకం నేటికీ   ప్రతి ఇంటా వెలుగు రేఖలు పంచుతూనే ఉందయ్యా.. 

పేదోళ్ల శరీరానికి జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ అంటూ పెద్ద వైద్యం చేయించిన మనసున్న వైద్యుడా.. నువ్వు నిలిపిన ప్రతి ప్రాణం నీ కోసం ఎదురు చూస్తోందయ్యా.. 

కడలి పాలవుతున్న నదీ జలాలను జలయజ్ఞంతో కట్టేసి.. బీడు భూముల్లో రతనాల పంటలు పండించిన రైతు బిడ్డా.. కర్షకలోకం నీ కోసం కన్నీళ్లు కారుస్తోందయ్యా..

ప్రతి ఇంటి బిడ్డకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అక్షర భిక్ష పెట్టిన మార్గదర్శకుడా.. నీ కోసం విద్యార్థి లోకం రెండు చేతులు     జోడిస్తోందయ్యా..

రైతు మెడపై వేలాడుతున్న అప్పుల ఉరికొయ్యను రుణాల రద్దుతో తెగనరికిన పేదల పక్షపాతీ.. నీ ఔదార్యానికి ప్రతి ఇల్లూ రుణపడి ఉంటానంటోందయ్యా..
విధి నిన్ను దూరం చేసినా.. వైఎస్‌ అనే నేను అంటూ ప్రతి గడపలో నువ్వు చేసిన అభివృద్ధి సంతకం.. ఐదు కోట్ల ప్రజానీకం గుండెల్లో పదిలంగా పచ్చబొట్టై నిలిచి ఉంది రాజన్నా..
  

ఇల్లు కట్టించిన మహానుభావుడు  
నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో విప్పర్ల స్వగ్రామం. నా పేరు షేక్‌ సైదా. చిన్న వాన కురిసినా మా గుడిసెలోకి నీళ్లు చేరేవి. తెలుగుదేశం పాలనలో తొమ్మిదేళ్లు ఇల్లు కట్టించండి మహా ప్రభో అని తిరిగినా పట్టించుకోలేదు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటికి వచ్చి మరీ పేర్లు రాసుకున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు కడతామని చెప్పారు. నేను నమ్మకలేకపోయాను. కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చేసి ఇల్లు కట్టి చూపించారు. నాకు ఇద్దరు కొడుకులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పెద్ద కుమారుడు బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నా కుటుంబాన్ని కష్టాల నావ నుంచి ఒడ్డున చేర్చిన నావికుడు వైఎస్‌. మేము తినే ప్రతి అన్నం ముద్దలో ఆయన పేరు ఉంటుంది. 

మా ఇంట్లో రూ.6 లక్షల లబ్ధి పొందాం
నా పేరు దామర్ల వెంకటరావు. మండలంలోని యాజలి స్వగ్రామం. 2012లో మా అబ్బాయి మన్మథరావుకు బైపాస్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. నాకు పెద్దగా ఆస్తులు లేవు. ఆపరేషన్‌ చేయించేంత స్థోమత కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పారుగానీ.. పెద్దాస్పత్రుల్లో పట్టించుకుంటారని నమ్మకం కలగలేదు. అయినా ఒక్కసారి వెళదామని ఆస్పత్రిలో అడుగుపెట్టాం. అంతే రూ.3 లక్షలు విలువైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసేశారు. నా బిడ్డకు ప్రాణం పోశారు. 2013లో నాకు మూడు వాల్స్‌ బలహీన పడటంతో ఆరోగ్యశ్రీ కార్డుపైనే గుండెకు ఆపరేషన్‌ చేయించుకున్నాను. నా ఆపరేషన్‌కు కూడా రూ.3 లక్షల ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఇలా మా ఇంట్లోనే రూ.6 లక్షల వరకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి దయతో లబ్ధి పొందాం. ఆయన పేదల మనిషి. ఇదిగో మా గుండె నిత్యం ఆయన పేరునే తలుచుకుంటుంది అంటూ వెంకటరావు గుండెలపై చేతులు వేసుకుని చెప్పారు.
– కర్లపాలెం

పెద్ద కొడుకులా ఓదార్చాడు
రొంపిచర్ల: మాది మండలంలో ఎడ్వర్డ్‌పేట. నా పేరు భారతమ్మ. నా భర్త వెన్నపూస పిచ్చిరెడ్డి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వీరాభిమాని. ఆయన మరణవార్త విని తట్టుకోలేక చనిపోయాడు. అప్పుడు పిల్లవాడు బడికి వెళుతున్నాడు. నా భర్త మృతితో చాలా ఇబ్బందులు పడ్డాం. పిల్లవాని చదువుపై భయం పట్టుకుంది. అప్పుడు ఇంటి పెద్ద కొడుకులా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా ఇంటికి వచ్చారు. నేనున్నానంటూ ఓదార్చి భరోసా కల్పించారు. ఇప్పుడు నా బిడ్డ చదువు పూర్తయింది. ఉద్యోగం వచ్చింది. మా కుటుంబం సంతోషంగా ఉంది. అలాంటి మంచి హృదయం గల నాయకుడు పదికాలాలపాటు సంతోషంగా ఉండాలి.

ఆరోగ్యశ్రీయే నన్ను బతికించింది
ఎస్‌వీఎన్‌ కాలనీ: మాది గుంటూరు రూరల్‌ మండలంలోని అడవి తక్కెళ్లపాడు. నా పేరు శివమ్మ. 2008లో గుండె జబ్బు చేసింది. ఆస్పత్రికి వెళితే గుండెకు ఆపరేషన్‌ చేయాలని డాక్టర్‌లు చెప్పారు. ఇంట్లో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్‌ అంటే మాటలు కాదు. ఇక జీవితంపై ఆశలు వదులుకున్నాను. అప్పుడు చెప్పారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మీకు అండగా ఉంటుందని. తొలుత నమ్మలేదు. ఆస్పత్రికి వెళితే అతిథిగా చూశారు. ఆపరేషన్‌ పూర్తి విజయవంతంగా ముగించారు. మొత్తం రూ.1.20 లక్షల వరకు ఖర్చైంది. అంతా ఆ మహానుభావుడి చలవే. నాకు మాదిరిగా ఎంతో మంది పేదలకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీతో ప్రాణాలు పోసిన దేవుడు. అందుకే ఇప్పటికీ గుర్తుండిపోతున్నారు. 

క్యాన్సర్‌ నుంచి కాపాడారు
అయ్యా మాది మండలంలోని పెదకొండూరు. నా పేరు సుద్దపల్లి కటాక్షం. నేను ప్రాణాంతకమైన గర్భసంచి క్యాన్సర్‌ బారిన పడ్డాను. నన్ను చూసేందుకు వచ్చిన వారందరూ ఇంక కొద్ది రోజులేనని అంటుంటే బతికుండగానే చచ్చిపోయేదాన్ని. అప్పుడు మా పిల్లలను చూసుకుని భోరున విలపించాను. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2007లో నాకు ఆపరేషన్‌ చేశారు. ఇది కలో.. నిజమో తెలియలేదు. బతకననుకుంటే పునర్జన్మ ప్రసాదించాడు వైఎస్‌ రాజశేఖరెడ్డి. ఎంత చెప్పుకున్నా ఆయన రుణం తీర్చుకోలేదు. ఆపరేషన్‌ అనంతరం మీకు చికిత్స సరిగా అందిందా.. లేదా ? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పేరుతో లేఖలు వచ్చాయి.  
– దుగ్గిరాల

అండగా నిలిచారు
నా పేరు పర్వతనేని వెంకాయమ్మ. మండలంలోని పెదనందిపాడు మా స్వగ్రామం. వైఎస్‌ రాజశేఖరుని మరణాన్ని జీర్ణించుకోలేక నా భర్త పర్వతనేని నాగేశ్వరరావు తనువు చాలించాడు. ఏం చేయాలో దిక్కుతోచ లేదు. ఆ సమయంలో ఇంటింటికీ వచ్చి పరామర్శిస్తానని వైఎస్‌ కొడుకు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇదంతా వట్టిమాటలే అనుకున్నా.. కానీ పెద్ద కొడుకులా ఇంటికి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. ఆర్థిక సాయం చేసి నన్ను ఆదుకున్నారు. ఆ బిడ్డ చలవతోనే నా కుమార్తె వివాహం చేశాను. కుమారుడు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కుటుంబాన్ని మేము మరువలేం. 

రాజన్నను ఎన్నటికీ మరువలేం 
నా పేరు బుల్లా నీలమ్మ. మండలంలోని కుంచనపల్లి స్వగ్రామం. రాజశేఖరరెడ్డి కనిపించడం లేదని తెలియడంతో నా భర్త లక్ష్మయ్య కూడూ నీళ్లు మానుకొని టీవీకి అతుక్కుపోయారు. తెల్లవారాక ఆయన మరణ వార్త విని గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు అనారోగ్యంతో మృతి చెందారు. వైఎస్‌ మరణించాక 108 అంబులెన్సు కూతలు వినిపించడం లేదు. ఉచిత ఆపరేషన్‌లు కనిపించడం లేదు. రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చినప్పుడు సొంత బిడ్డలా అనిపించింది. లక్ష రూపాయలు ఇచ్చి ‘అమ్మా మీకు నేనున్నానంటూ తల మీద చెయ్యిపెట్టి చెప్పాడు’. అంటూ కొంగు చాటున కన్నీళ్లను  దాచుకుంటూ చెప్పింది.  

కొండంత ధైర్యమిచ్చారు 
కాట్రపాడు(దాచేపల్లి): ‘మాది కాట్రపాడు గ్రామం. నా పేరు రెడ్డిచర్ల రమణ. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నా భర్త రెడ్డిచర్ల కృష్ణంరాజు వీరాభిమాని. ఆయన మరణవార్త విని హఠాత్తుగా మృతి చెందాడు. వైఎస్‌ మరణంతోనే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాం. వెంటనే భర్త గుండె ఆగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాం. 2012లో వైఎస్‌ జగన్‌ మా ఇంటికి వచ్చారు. నాకు మనోధైర్యాన్ని చెప్పి పిల్లలను బాగా చదివించాలని, అండగా ఉంటానని అభయమిచ్చారు. జగనన్న ఇచ్చిన ధైర్యంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు క్యాన్సర్‌ వచ్చింది. సొంతిల్లు కూడా లేదు. జగనన్న సీఎం అయితే ఇల్లు కట్టిస్తాడనే నమ్మకంతో ఉన్నాన’ంటూ పక్కపక్కనే ఉన్న భర్త కృష్ణంరాజు, వైఎస్సార్‌ ఫొటోలవైపు చూస్తూ ఉబి కివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ వివరించారు.   

 వైఎస్‌.. మనసున్న డాక్టర్‌
నా పేరు సయ్యద్‌ మొబీన్‌ అప్సర్‌. మాచర్ల పట్టణం సొంతూరు. తల్లిదండ్రులు ముస్తఫా, సమీమున్నీసా పేద కుటుంబం. నన్ను ఇంటర్‌ వరకు చదివించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2007 నుంచి 2013 వరకు హైదరాబాద్‌లోని ఓవైసీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివాను. పైసా ఖర్చు లేకుండా డాక్టర్‌నయ్యా. ప్రస్తుతం కెనడాలో ప్రాక్టీస్‌ చేస్తున్నాను. నా వైద్య సాయం పొందిన వారు తెలిపే ప్రతి కృతజ్ఞతా వైఎస్‌కే దక్కుతుంది. నా మెడలో స్టెతస్కోప్‌ చూసుకున్నప్పుడల్లా ఆయన చలువే గుర్తుకొస్తుంది. జీవితాంతం ఆ మహానేతకు రుణపడి ఉంటాను.

చిల్లిగవ్వ లేకపోయినా గుండె చిల్లు పూడ్చారు
నా పేరు బత్తిన వేణు. పట్టణంలోని 17వ వార్డులో నివాసం ఉంటాను. ఒకరోజు గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందని డాక్టర్‌ వద్దకు వెళ్లాను. గుండెకు చిల్లు పడిందని వాళ్లు బాంబు పేల్చారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆపరేషన్‌ చేయించుకోవడానికి చిల్లి గవ్వ లేవు. దేవుడిచ్చిన వరంలా ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారు. గుండెకు పడిన చిల్లు పూడింది. నాకు ఆయుష్షు పోసింది. ఎప్పుడైనా వంట్లో నలతగా అనిపిస్తే చాలు.. ఆ మహానుభావుడే కళ్ల ముందు ధైర్యమై కనిపిస్తాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని అడ్రస్‌ లేకుండా చేశారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి వస్తేనే పేదోడికి అండ.   
– మాచర్ల

నా బిడ్డలకు అక్షర భిక్ష పెట్టారు
నా పేరు షేక్‌ అన్సార్‌. మండలంలోని కర్లపాలెంలో రీవైండింగ్‌ ఎలక్ట్రికల్‌ మేస్త్రిగా పని చేస్తున్నాను. నా పెద్ద కుమారుడు నిసార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో కేఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చదువుకున్నాడు. క్యాంపస్‌లో ఉద్యోగం సంపాదించి నార్త్‌ అమెరికా వెళ్లాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకపోతే నా బిడ్డ చదువుకు రూ.1.40 లక్షల ఖర్చయ్యేది. మా రెండో అబ్బాయి సమీర్‌ కూడా ఏజీ ఎంఎస్‌సీ పూర్తి చేశాడు. ఐటీసీ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. చిన్న కొడుకుకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటే అక్షర భిక్ష పెట్టింది. రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్ల వలనే నా బిడ్డలు ఉద్యోగస్తులయ్యారు. ఇదంతా ఆ మహానేత పుణ్యమే. 
– కర్లపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top