
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పేరు చెబితే చాలు.. అచ్చ తెలుగుకు ప్రతిరూపమైన పంచెకట్టు, చెరగని చిరునవ్వు, మడమ తిప్పని పోరాట పటిమ, పేదవాడి గుండె చప్పుడుకి నిలువెత్తు విగ్రహం అంటూ కొనియాడని తెలుగువారుండరు. పేదల సంక్షేమంలో చెరగని సంతకంలా నిలిచిపోయారంటూ నేటికీ ప్రతి ఒక్కరూ గుర్తు చేసు కుంటూనే ఉన్నారు. ఆయనది వర్ణించలేని సువర్ణ పాలన. సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి సైతం అందాలని, ప్రతిఒక్కరు చిరునవ్వుతో జీవితం గడపాలని వైఎస్సార్ పరితపించే వారు. విశాఖను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయన సొంతం. ఆయన దూరమై.. తొమ్మిదేళ్లు గడిచినా.. అందించిన సంక్షేమంలోనూ.. చేసిన
అభివృద్ధిలోనూ రాజన్నే.. కనిపిస్తున్నారు.
విశాఖసిటీ : రాజన్న దూరమై నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. రాష్ట్రానికి, విశాఖ జిల్లాకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటూ పరితపిస్తున్నారు. 2005లో గాజువాకతో పాటు 32 పంచాయతీలను కలిపి మొత్తం 72 వార్డులతో విశాఖకు గ్రేటర్ హోదా కల్పించి.. నగరానికి నూతన శకం ప్రారంభించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద విశాఖ నగరానికి రూ.2వేల కోట్లు తీసుకొచ్చి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కృషి చేశారు.
రూ.1500 కోట్లతో భూగర్భ డ్రైనేజీ
చిన్న చినుకొస్తే విశాఖ నగరం పరువు బంగాళా ఖాతంలో కలిసిపోయేది. అలాంటి సమయంలో వైఎస్సార్.. రూ.1500 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ హయాంలో నగరంలో కొన్ని ప్రాంతాలకు ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మిగిలిన ప్రాంతాలకు ఈ ఫలాలు అందించడంలో పాలకులు విఫలమయ్యారు. తాజాగా.. కేంద్రం చేపట్టిన అమృత్ పథకంలో భాగంగా మిగిలిన ప్రాంతాలకు ఈ వ్యవస్థ ఏర్పాటవుతోంది. రాజన్న హయాంలో రూ.456కోట్లతో ప్రారంభమైన బీఆర్‌టీఎస్ పనులు.. అప్పట్లో 70 శాతం వరకూ పూర్తయ్యాయి. ఆయన మరణం తర్వాత.. పనులు మందగించి ఇప్పటికీ పూర్తి చెయ్యలేదు.
దాహార్తి తీర్చేందుకు..: నగరంలో 15వేల మంది పేదలకు గూడు కల్పించేందుకు రూ.450 కోట్లు, ఎండాడ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.23 కోట్లు.. విశాఖ నగర దాహార్తిని తీర్చేందుకు తాటిపూడి నుంచి నగరానికి రూ.95కోట్లతో పైపులైన్ ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు విస్తరణ, అచ్యుతాపురంలో ఇండస్ట్రియల్ కారిడార్, భీమిలో ఐటీ కారిడార్, పరవాడలో ఫార్మస్యూటికల్ కారిడార్, దువ్వాడలో ఐటీ సెజ్‌లతో విశాఖ దశాదిశను మార్చేశావు. మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్‌ల ఏర్పాటుతో విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దావ్, 1130 పడకలు, 21 సూపర్ సెషాలటీ బ్లాకులతో రూ.250కోట్లతో విమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. ఆసీల్‌మెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు రూ.87కోట్లతో నగరంలో తొలి ఫ్లైఓవర్ నిర్మించారు.
ఐటీలో ప్రగతి పరుగులు
విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి బాటలు వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే అన్నది ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగి మననం చేసుకుంటున్నారు. సీఎం అయిన తొలి నాళ్లలోనే యుద్ధ ప్రాతిపదికన సత్యం కంప్యూటర్స్, విప్రో వంటి దిగ్గజ సంస్థల్ని నగరం నడిబొడ్డున పది ఎకరాలు చొప్పున కేటాయించి 1500 ఉద్యోగాలతో ప్రారంభించిన ఘనత రాజన్నదే. విశాఖపై ప్రత్యేక దృష్టి సారించి 300 ఎకరాల్లో ఐటీ పార్కుని రుషికొండలో సెజ్ ఏర్పాటు చేసి ఇన్ఫోటెక్, మిరాకిల్, కెనెక్సా, ఐల్యాబ్స్, మహతి మొదలైన చాలా కంపెనీలు వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వైఎస్ పాలన ముందు.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం నుంచి కేవలం రూ.4 కోట్ల ఐటీ ఎగుమతులు మాత్రమే జరగగా.. వైఎస్సార్ హయాంలో తొలి ఏడాదిలోనే రూ.500 కోట్లకు పైగా ఎగుమతులు చేపట్టి రికార్డు సృష్టించారు.
అంతర్జాతీయ హోదా నీ ఘనతే..
హైదరాబాద్‌కే పరిమితమైన అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను విశాఖ ప్రజలకూ పరిచయం చెయ్యాలని వైఎస్సార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా రూ.100 కోట్లు వెచ్చించి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చారు. జలయజ్ఞం ద్వారా అపర భగీరథుడై.. విశాఖ సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎన్నో పథకాలు అమలు చేశారు. రైవాడ, కోనాం,పెద్దేరు కళ్యాణలోవ రిజర్వాయర్లను రూ.42కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తి చేసి కృషీవలుడి కళ్లల్లో ఆనందం నింపారు. రూ.55కోట్లతో తాండవ రిజర్వాయర్ ఆధునికీకరించడమే కాదు.. తాండవ నదిపై మినీ ఆనకట్ట నిర్మాణానికి, రావణాపల్లి ప్రాజెక్టుకు రూ.18కోట్లతో జిల్లాలోని 50వేల ఆయకట్టును స్థిరీకరించి సాగునీటికి ఢోకా లేకుండా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అత్యంత ప్రధాన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. మరో మానస పుత్రికైన ఇందిరమ్మ గృహ నిర్మాణం ద్వారా జిల్లాలో 3.56 లక్షల ఇళ్లు నిర్మించారు. 3.20 లక్షల మందికి పింఛన్లు అందించారు. 25వేల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. మన్యంలో పోడు భూములకు పట్టాలిచ్చి వారి పాలిట దైవంలా మారారు. ఇలా.. నగరం నలుచెరగులా.. జిల్లాలో అణువణువునా.. ఆయన మార్కు సంక్షేమమే కనిపిస్తోంది.