
వైఎస్సార్... ఈ పేరు వింటేనే మదిమదిలో మరపురాని జ్ఞాపకాలు మెదులుతుంటాయి. చరిత్రలో కనీవిని ఎరుగనిరీతిలో ప్రజలకు సుపరిపాలన అందించిన మహనీయుడు ఆయన. జనానికి మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవిగా నిలిచిపోయాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన వేలాది మంది ఇంట ఆయన దేవుడయ్యాడు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడిన పేద విద్యార్థుల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలారు. మళ్లీ ఆయన పాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా ప్రజల గుండె చప్పుడు మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నో అభివృద్ధి పనులకు వైఎస్సార్ బీజం వేశారు. దుర్భిక్ష పరిస్థితులు అనుభవిస్తున్న డెల్టా రైతుల కడగండ్లు తుడిచారు. జిల్లాలో వరదలు వచ్చి రైతులు విలవిల్లాడుతున్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇచ్చి కర్షక పక్షపాతిగా నిలిచారు. బందరు పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతుల సుదీర్ఘ స్వప్నంగా మారిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పనులను ఉరకలెత్తించారు.
వేలాదిమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుచేశారు. లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో తోడ్పాటునందించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్. లక్షలాది మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించి ప్రాణదాతగా మారారు. జన హృదయనేతగా పేరుగాంచారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంటు తదితర పథకాలతో అందరి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పేదలు అడగకుండానే ఆయన అనేక మేళ్లు చేశారు. తెల్లరేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు.. ఇలా ఏది కావాలన్నా ఆచరణలో అమలుచేసి చూపించారు.
రైతన్నకు అండగా కృష్ణా డెల్టా ఆధునికీకరణ..
కృష్ణా డెల్టాకు వరదలు వచ్చినప్పుడు జిల్లా రైతులు పడుతున్న కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణా డెల్టా ముంపునకు గురవుతోందని భావించి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు సర్ అర్ధర్ కాటన్ విగ్రహం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.06 లక్షల ఎకరాలున్నాయి. రూ. 4,573 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులకు ఆయన పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇందులో 40 శాతం ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే పూర్తయినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది.
వేలాది మంది విద్యార్థులకు చేయూత..
జిల్లాలో 2008లో నూజివీడులో త్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసి జిల్లా ఖ్యాతిని పెంచేశారు. ఇప్పటి వరకు 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ వేలాది మంది విద్యార్థుల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారు. అలాగే పేద కుటుంబాలకు అండగా నిలబడ్డారు.
పెరిగిన పింఛన్లు....
2004కు పూర్వం చంద్రబాబు పాలనలో జిల్లాలో 53 వేల మందికి మాత్రమే పింఛన్లు అందేవి. వైఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో పింఛన్లు పొందేవారి సంఖ్య 2.34 లక్షలకు పెరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా ప్రతి ఏటా దాదాపు 25 వేల మంది వరకు వైద్య సాయం పొందారు. వైఎస్ హయాంలోనే జిల్లాలో 5 లక్షలు ఉన్న తెల్లరేషన్ కార్డుల సంఖ్య 11 లక్షలకు పెరిగింది. అందరికీ బియ్యం, పామాయిల్, పంచదార కచ్చితంగా అందేవి.
గన్నవరం ఐటీపార్కు ఆయన పుణ్యమే..
వ్యవసాయ ఆధారితమైన కోస్తా ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు ద్వారా వైఎస్సార్ అభివృద్ధికి బాటలు వేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్‌అండ్‌టీ సౌజన్యంతో నిర్మించిన ఐటీపార్కు మొదటి టవర్‌లో 12 కంపెనీలు పూర్తిస్థాయిలో తమ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 2,500 మంది ఐటీ విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయి.
ఇంటి ఆడపడుచు కోసం రూ. 100 కోట్లు..
విజయవాడ నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చివరకు సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ స్థితిలో నాటి మేయర్ రత్నబిందు కాంగ్రెస్ కార్పొరేటర్లను తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి పరిస్థితి వివరించారు. అక్కడున్న కార్పొరేటర్ శిష్టా రామలింగమూర్తి శ్రావణమాసంలో శుక్రవారం మేయర రత్నబిందు మీ వద్దకు వచ్చిందని చెప్పగానే.. వైఎస్ పెద్ద నవ్వుతూ ఇంటి ఆడపడచువు వచ్చావు... కార్పొరేషన్‌ను అప్పుల ఊబిలోంచి బయట పడవేస్తానంటూ అప్పటికప్పుడు రూ. 100 కోట్లు మంజూరు చేసిన ఘనుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.
పులిచింతలకు శ్రీకారం..
కృష్ణా డెల్టా రైతుల చిరకాల వాంఛ పులిచింతల ప్రాజెక్టుకు 2004లో వైఎస్ శంకుస్థాపన చేశారు. ఆయన హయాంలో 90 శాతం పనులు పూర్తి కాగా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎనిమిదేళ్ల సమయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రాకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టులో 45.77 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. కృష్ణా డెల్టాను స్థిరీకరించవచ్చు. ఇక శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయాలనే మహా సంకల్పంతో జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. కుడి ప్రధాన కాలువ పనుల్ని 80 శాతం ఆయన హయాంలోనే పూర్తి చేశారు. ఇప్పుడు జరిగిన కృష్ణా–గోదావరి సంగమానికి అప్పుడు ఆయన శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్ హయాంలోనే బందరు పోర్టుకు శంకుస్థాపన
1994 నుంచి బందరు పోర్టు డిమాండ్ జాతీయస్థాయిలో వినిపించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. బందరు చారిత్రక నేపథ్యం కలిగిన పట్టణం. బందరు పోర్టు నుంచి 1604వ సంవత్సరం నుంచే ఫ్రెంచ్, డచ్, దేశస్తులు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేయడం ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా ఈ పోర్టు నుంచి సరుకులు ఎగుమతులు, దిగుమతులు స్తంభించాయి. ఈ నేపథ్యంలో 2003 నుంచి బందరు పోర్టును నిర్మించాలని కోరుతూ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. 2007లో బందరు పోర్టును నిర్మించాలని కోరుతూ 100 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టారు. 10 రోజుల పాటు ఆమరణ దీక్షలు జరిగాయి.దీంతో స్పందించిన దివంగత ముఖ్యంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి నడుం బిగించారు. ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాధ్యాసాధ్యాలను పరిశీలించి బందరు పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. 2008 ఏప్రిల్ 23న రూ. 1,500 కోట్లతో పోర్టు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. బందరు ప్రజల ఆందోళన ఫలితంగా మళ్లీ 2012 మే 12న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు 5,324 ఎకరాల భూమిని సేకరించేందుకు జీవో ఇచ్చింది. కానీ ఉత్తర్వులు అమలు కాలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతులు భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో బందరు పోర్టు కోసం 28 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి నోటీఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి పోర్టు నిర్మాణానికి 4,800 వేల ఎకరాలు సరిపోతుంది. కానీ వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి యత్నిస్తూ రైతుల జీవితాలతో టీడీపీ సర్కారు చెలగాటమాడటంపై రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు రీయింబర్సుమెంటుతోనే చేయూత
నేను 2008లో భాస్కరరావుపేట హైస్కూల్‌లో చదివి బాసర ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేశాను. ఇప్పుడు కానిస్టేబుల్‌గా ఎంపికై మచిలీపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం వల్లే నేను ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం సాధించగలిగాను. నా పై ఆధారపడిన కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వైఎస్సార్ మరణం తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలుకావడం లేదు.
– మామిడిశెట్టి హనుమంతరావు, కానిస్టేబుల్, మూలలంక, కలిదిండి మండలం
నిత్యం పూజలు చేస్తున్నాం
మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందటాన్ని టీవీలో చూస్తూ నాభర్త చింతయ్య గుండె ఆగి మరణించాడు. మా కుటుంబాన్ని పరామర్శించటానికి వైఎస్ జగన్‌బాబు మా ఇంటికి రావటాన్ని మా కుటుంబ సభ్యులం జీవితంలో మరచిపోలేము. నాభర్త మృతి చెందే నాటికి కుమార్తెకు పెళ్లి చేయగా, తరువాత కూలీ పనులు చేసుకుంటూ పెద్ద కుమారుడికి పెళ్లి చేశాను. చిన్న కుమారుడు చదువు కుంటున్నాడు. నాభర్త ఫొటో పక్కన రాజన్న ఫొటోను పెట్టుకొని నిత్యం పూజలు చేస్తున్నాం. జగన్‌బాబు ఈసారి తప్పక గెలుస్తాడు
– కె. సోమమ్మ, పెనుగంచిప్రోలు