తాడిపత్రిపై రాజన్న ముద్ర..

YS Rajasekhara Reddy 71th Birth Anniversary Special Story In Anantapur District - Sakshi

సాక్షి ,అనంతపురం: ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. తాను సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సకాలంలో సంక్షేమ ఫలాలు అందజేస్తూ ఆపన్నుల కన్నీళ్లు తుడిచేందుకు అహరి్నశం శ్రమించారు. తాను పెట్టిన తొలి సంతకంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల కడగండ్లను ఒక్కసారిగా తుడిచేశారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందజేయడమే కాక.. హరితాంధ్ర సాధనలో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. విద్య, వైద్య రంగాల పురోభివృద్ధికి బాటలు వేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో నిరుపేద విద్యార్థులను డాక్టర్లను, ఇంజినీర్లను చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు నాణ్యతతో కూడిన ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేశారు. తాగునీటి పథకాలకు జీవం పోస్తూ.. ప్రజల దాహార్తిని తీర్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్సార్‌ అంటే ఒక వ్యక్తి కాదని.. శక్తి అని నిరూపించారు. ఆ పాలనను స్వర్ణయుగమంటూ నేటికీ వేనోళ్ల కొనియాడుతున్నారు. మహానేత తమ మదిలో జీవించే ఉన్నాడంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. వైఎస్సార్‌ సంక్షేమ ఫలాలతో లబ్ధి పొంది, ఆయన ఆశయాల సాధనలో మేము సైతం అంటూ శ్రమిస్తున్న జిల్లా వాసులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే.  

‘పురం’  ప్రజల పాలిట  అపర భగీరథుడు.. 
హిందూపురం: ఒకప్పుడు తాగునీటి కోసం విలవిల్లాడిన హిందూపురం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా చరిత్రలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిలిచిపోయారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురానికి వచ్చిన ఆయన.. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశారు. ఆ సమయంలోనే ఇక్కడ పార్టీ ఓడినా.. గెలిచినా.. తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్‌ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా పురం ప్రజల దాహార్తిని తీరుస్తానంటూ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 1,400 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయించి 2008 డిసెంబరు 30న తన స్వహస్తాలతో హిందూపురం పట్టణ నడిరోడ్డున రహమత్‌పురం సర్కిల్‌ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పైలాన్‌ను ఆయన ప్రారంభించారు.

ఇచ్చిన మాట అక్షరాల నిలుపుకుని హిందూపురం ప్రజల మదిలో చెరగని ముద్రను ఆయన వేసుకున్నారు. మడకశిర, పెనుకొండ, పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలోని మొత్తం 220 గ్రామాలకూ నేడు సమృద్ధిగా తాగునీరు అందుంతోందంటే అదంతా వైఎస్సార్‌ పుణ్యమేనని స్థానికులు కొనియాడుతున్నారు. అలాగే జలయజ్ఞంలోనూ హిందూపురం ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చారు. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మడకశిర ఉప కాలువ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్‌ రాజశేఖరరెడ్డినే.  

ప్రతి నీటి బొట్టులోనూ ‘వైఎస్సార్‌’ 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఈ సమ్మర్‌ స్టోరేజ్‌ వాటర్‌ ట్యాంక్‌ రాయదుర్గం వాసులను తాగునీటి కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించింది. 2005లో రాయదుర్గం పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఇక్కడకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ తాగునీటి కష్టాలను ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రస్తుతం తానేమీ చేయలేనని, ఎన్నికలు పూర్తి కాగానే మీ కష్టాలను తీరుస్తానంటూ ఆ సమయంలో ఆయన హామీనిచ్చారు. అనుకున్నట్లుగానే ఎన్నికలు ముగియగానే రాయదుర్గం వాసుల తాగునీటి కష్టాలపై ఆయన దృష్టి సారించారు. 2007లో రూ.48 కోట్లు నిధులు మంజూరు చేసి, కణేకల్లు వద్ద సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణానికి 168 ఎకరాల భూసేకరణ చేయించారు. 2008లో పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయించారు. హెచ్చెల్సీ నీటిని ఎత్తిపోతల ద్వారా ట్యాంక్‌లోకి నింపి అక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా రాయదుర్గానికి చేర్చడం ద్వారా ప్రజలు దాహార్తిని తీర్చారు. ప్రస్తుతం రాయదుర్గం తాము తాగుతున్న ప్రతి నీటి బొట్టులోనూ వైఎస్సార్‌నే చూడగలుగుతున్నారు.  

అనంత అభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర 
అనంతపురం సెంట్రల్‌/విద్య/హాస్పిటల్‌: అనంత జిల్లా అభివృద్ధిపై మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు.రైతు బాంధవుడిగా వేనోళ్ల కొనియాడబడుతున్న ఆ మహానేత జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్‌

పాత్రను గుర్తు చేసుకుంటూ...  

  • ఒక సంవత్సరం పంట పండితే మరో ఐదారేళ్లు కరువు విలయతాండవం చేస్తుంది. పొట్ట చేతపట్టుకుని మహానగరాలకు వలసబాట పడుతున్న కాలమది. యేటా వేసవి వచ్చిందంటే ఊళ్లకు తాళాలు పడేవి. ఇలాంటి సమయంలో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. వలసల నివారణ కోసం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి బృహత్తర పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న నార్పల మండలం బండ్లపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పురుడు పోశారు.  
  • కరువు సీమ కల్పతరువుగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూఏ వర్సిటీని 2008లో ఏర్పాటు చేశారు.  
  • 2008 కంటే ముందు జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు రాయలసీమలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఆధీనంలో ఉండేవి. దీంతో పాలనపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతో జేఎన్‌టీయూఏ వర్సిటీని అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏర్పాటు చేశారు. 
  • రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు  జేఎన్‌టీయూఏ పరిధిలో అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. మొత్తం 107 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏటా 1.20 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదువుతున్నారు.  
  • పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య కలగా మిగిలిపోయేది. రూ.లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితితో ఉన్నత విద్యవైపు వెళ్లే వారు కాదు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు. విద్యార్థి ఫీజు ఎంత అయినా నేరుగా ప్రభుత్వమే చెల్లించే బృహత్‌ కార్యక్రమం ఇది. దీంతో ఇంజినీరింగ్, మెడిసిన్‌ వైపు నిరుపేద విద్యార్థులు దృష్టి సారించారు. ఫలితంగా లక్షలాది మంది ఇంజినీరింగ్‌ , ఎంబీఏ గ్రాడ్యుయేట్లు కాగలిగారు. మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఎంతో మంది జీవితాలను మలుపుతిప్పిన మహానేతగా చెరగని ముద్ర వేసుకున్నారు.  
  • డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌ వైద్యసేవలను ఉచితంగా అందజేశారు. ఇందు కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారు.  
  • క్షతగాత్రులు, గర్భిణిలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు 108 (37 వాహనాలు),  పీహెచ్‌సీలకు దూరంగా ఉన్న గ్రామాల్లోని ప్రజలకు వైద్యం అందించేందుకు 104 (23 వాహనాలను) సేవలను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కింద 937 జబ్బులకు కార్పొరేట్‌ వైద్యం అందించారు. 
  • కరువు జిల్లా అనంత అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో మమకారం.  అనంతపురం జిల్లాను దృష్టిలో పెట్టుకుని వేరుశనగ చెట్లకు డబ్బులు కాపిస్తా అంటూ సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు ఇవ్వని విధంగా రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రూ.వందల కోట్లు మంజూరు చేశారు.  పీఏబీఆర్‌ జలాశయం జలకళను సంతరించుకుందంటే అది వైఎస్‌ పుణ్యమే. 2006లో కేసీ కెనాల్‌ వాటా 10 టీఎంసీలను పీఏబీఆర్‌కు మళ్లించారు. తీసుకున్న ఈ నిర్ణయం వలన ఏటా సగటున 6 టీఎంసీలు చొప్పున పీఏబీఆర్‌కు నీళ్లు వస్తున్నాయి. ఈ నీటితో పీఏబీఆర్‌ కుడికాలువ కింద ఉన్న ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, శింగనమల నియోజకవర్గాల్లోని 49 చెరువులను నీటితో నింపుతున్నారు. వైఎస్సార్‌  చొరవతోనే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. 
  • తాగునీటి ఇబ్బందులు తీరాయి.   
  • వైఎస్సార్‌ హయాంలో జలయజ్ఞం పథకానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. దాదాపు రూ.12వేల కోట్లు వ్యయంతో అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. తాగునీటి ప్రాజెక్టుగా ఉన్న హంద్రీ–నీవాను సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. మొదటి దశ పనులను దాదాపు 90 శాతం పూర్తి చేయించారు. 2012 నుంచి ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు వస్తున్నాయి. నాడు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం వలన నేడు కరువు సీమ అనంతలో సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది.  

తాడిపత్రిపై రాజన్న ముద్ర..
తాడిపత్రి: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాడిపత్రి అభివృద్ధి పథంలో పరుగులు తీసింది. అనంత జిల్లా అల్లుడిగా తాడిపత్రి అంటే ఆయనకూ అభిమానం ఎక్కువ. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో ఆయన పెళ్లి చేసుకున్నారు.  

  • పీఎబీఆర్‌ స్టేజ్‌–2 కింద రూ.536 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. దీని ద్వారా తాడిపత్రి నియోజకవర్గంలోని 50వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్న లక్ష్యంతో జలయజ్ఙంలో భాగంగా రూ.244 కోట్లతో చాగల్లు ప్రాజెక్ట్‌ ñనిర్మించారు.  
  • పెద్దపప్పూరు మండలం పెండేకల్లు గ్రామం వద్ద ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా పెద్దపప్పూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లోని 18,500 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకువచ్చారు.  
  • రూ.190 కోట్ల వ్యయంతో యాడికి కాలువ నిర్మాణానికి 2005 మార్చి 20న డాక్టర్‌ వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు.తాడిపత్రి మండలాల పరిధిలోని 38 గ్రామాలకు లబ్ది చేకూరేలా 50 వేల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కలి్పంచే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టారు. 2009 జనవరి నాటికి యాడికి కాలువ పథకం పనులపై రూ.300 కోట్లు వ్యయం చేశారు.  
  • తాడిపత్రి–అనంతపురం వెళ్లే మార్గంలో సుమారు రూ.38కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)ని నిర్మించారు.  
  • పట్టణంలోని అన్ని వీదుల్లో సీసీ రోడ్లు నిర్మించారు. సీబీ రోడ్డు ప్రధాన రహదారిని జాతీయ రహదారి తలపించేలా నిర్మించారు.   

మా ఇంట కొలువైన దేవుడు 
13 సంవత్సరాల క్రితం నేను, నా భార్య చెన్నమ్మ, కుమార్తె ప్రభావతమ్మ కలిసి పొలం దగ్గరకు పోతుండగా ఎలుగుబంటి దాడి చేసి, ముగ్గురినీ తీవ్రంగా గాయపరిచింది. ఆ రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేని మాకు వైఎస్సార్‌ ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వడమే కాక, మెరుగైన వైద్యం చేయించింది. అంతేకాక ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాక, పింఛన్‌ను కూడా మంజూరు చేయించి ఆదుకున్నారు. ఆ రోజు నుంచి మా ఇంటిలో వైఎస్సార్‌ ఫొటో పెట్టుకుని రోజూ పూజలు చేస్తున్నాం.                     
  – ఆంజనేయులు, బీసీ కాలనీ, కనగానపల్లి  

వైఎస్సార్‌ తాతకు దండాలు 
నేను ఏడాది వయసులో ఉన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడినంటా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రిలో నాకు ఆపరేషన్‌ చేయించి, అమ్మానాన్న రవీంద్రారెడ్డి, అలివేలమ్మ  తీసుకొచ్చారంటా.  ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అదంతా వైఎస్సార్‌ తాత పెట్టిన భిక్షే కదా... అందుకే వైఎస్సార్‌ తాతకు దండాలు పెడుతున్నా.  
– సుమంత్‌రెడ్డి, యలకుంట్ల, కనగానపల్లి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top