కరువు నేలపై..హరిత సంతకం

YS Rajasekar Reddy Welfare Programs  - Sakshi

సంక్షేమం, అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం వైఎస్‌ పాలన

ఆయన హయాంలోనే 70 శాతం వెలిగొండ పనులు 

గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి

రూ.900 కోట్లతో సాగర్‌ కాలువల ఆధునికీకరణ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘ఎన్నికల ముందు నేను చేసిన వాగ్దానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే కార్యక్రమానికి చెందిన ఫైలుపై తొలి సంతకం చేస్తున్నాను’’ అంటూ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేశారు వైఎస్‌. ఒకే ఒక్క నిమిషంలో..ఒక్క మాట ద్వారా..ఒక్క సంతకం ద్వారా...తానేమిటో, తన విశ్వసనీయత ఏమిటో చేసిన వాగ్దానాల పట్ల నిబద్ధత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏంటో చెప్పకనే చెప్పారు వైఎస్‌.

తెలుగుదేశం హయాంలో 2004కు ముందు రాష్ట్రంలో కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. తాగునీరు అందని దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.  2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి వైఎస్‌ సీఎం అయ్యారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ ప్రజారంజక పాలనను సాగించారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరా క్రాంతి పథకం, రూ.2 కిలో బియ్యం, ఇందిర ప్రభ, రాజీవ్‌ గృహకల్ప, రాజీవ్‌ యువశక్తి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను ప్రవేశపెట్టారు. రూ.75 మాత్రమే ఉన్న పింఛన్‌ను రూ.200 పెంచారు.

రూ.45,600 కోట్లతో జలయజ్ఞం ద్వారా 26 నీటి ప్రాజెక్టులు ప్రారంభించి వాటిలో కొన్నింటిని పూర్తి చేసి లక్షలాది ఎకరాలు సాగు, తాగు నీటిని అందించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత ఆయనకే దక్కింది.  మొత్తంగా వైఎస్‌ ఐదేళ్ల పాలన జనరంజకంగా సాగింది. 2009 శాసనసభ ఎన్నికల్లో 156 స్థానాలు గెలుచుకొని రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్‌. 

వైఎస్‌ ఐదేళ్ల పాలనా కాలంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలో వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులకు పెద్ద నిధులిచ్చి పనులు చేయించిన ఘనత వైఎస్‌కే దక్కింది. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు కేటాయించి 70 శాతం పనులను పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధుల్లో 80 శాతం నిధులు వైఎస్‌ హయాంలో కేటాయించినవే.

గుండ్లకమ్మ ప్రాజెక్టు దాదాపు రూ.592.18 కోట్ల నిధులిచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. వందల కోట్లు వెచ్చించి అన్ని నియోజకవర్గాల్లో తారు, సిమెంటు రోడ్లను నిర్మించారు. ప్రధానంగా రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్‌ హాస్పిటల్, మెడికల్‌ కాలేజీని నిర్మించారు. ఒంగోలు ప్రజలకు తాగునీటిని అందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి పేదల ప్రాణాలను నిలబెట్టారు. వేలాది మంది రైతులకు రుణవిముక్తి కలిగించారు. మహిళలను ఆదుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారు. వృద్ధులకు పింఛన్ల ద్వారా భరోసా ఇచ్చారు.  ప్రతి పేదవాడికి పక్కా గృహం నిర్మించి ఇచ్చాడు. 

వైఎస్‌ హయాంలో నియోజకవర్గాల వారీ అభివృద్ధి పనులు:   

  • ఒంగోలు నియోజకవర్గంలో రూ.250 కోట్లతో వెయ్యి పడకల రిమ్స్‌ ఆస్పత్రిని వైఎస్‌ హయాంలోనే నిర్మించారు. ఒంగోలు నగరానికి తాగునీటిని అందించేందుకు రామతీర్థం నుంచి పైప్‌లైన్‌ను నిర్మించారు. నగరంలో ఏడు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించి ప్రజలకు నీటిని అందించారు. మినీస్టేడియం మంజూరు చేశారు. కొత్తపట్నం–ఒంగోలు ఫ్లైఓవర్‌ను మంజూరు చేశారు. పోతురాజు కాలువ ఆధునికీకరణకు నిధులిచ్చారు. వేలాది మందికి ఇంటి స్థలాలిచ్చి పక్కా గృహాలు నిర్మించారు. జిల్లా జైలును నిర్మించారు. 

  • యర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లకుపైగా నిధులిచ్చి పనులను ప్రారంభించటమే గాక వేగవంతం చేశారు. యర్రగొండపాలెంలో మోడల్‌ డిగ్రీ కాలేజీని నిర్మించారు. 

  • సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి మండలంలో రామతీర్థం జలాశయాన్ని నిర్మించారు. దీని ద్వారా 70 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు, 84 గ్రామాలకు తాగునీరు అందించారు. గుండ్లాపల్లిలో పరిశ్రమల కేంద్రాన్ని నెలకొల్పారు.  

  • పర్చూరు నియోజకవర్గంలో రూ.400 కోట్లతో నాగార్జున సాగర్‌ కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి ఆయకట్టుకు నీరందించిన ఘనత వైఎస్‌కే దక్కింది. 

  • మార్కాపురం నియోజకవర్గంలో రూ.35 కోట్లతో సాగర్‌ జలాలను తీసుకువచ్చారు. మార్కాపురంలో రైల్వేబ్రిడ్జిని నిర్మించారు. ఈ నియోజకవర్గ పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు పనులను వేగవంతం చేశారు. 

  • కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద రూ.50 కోట్లతో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల పరిధిలో 9,500 ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పలు గ్రామాలకు తాగునీటిని సైతం వైఎస్‌ అందించారు. 

  • దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. మరో రూ.120 కోట్లతో సాగర్‌ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో మార్కెట్‌ కమిటీ భవనాలను నిర్మించారు. 133 కె.వి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. 

  • కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో కనిగిరికి సాగర్‌ జలాలతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని వైఎస్‌ 2008 ఆగస్టులో ప్రారంభించారు.

  • కందుకూరు నియోజకవర్గంలో పట్టణ వాసులకు రూ.110 కోట్లతో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును నిర్మించి తాగునీటిని అందించారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువను వైఎస్‌ ప్రారంభించారు.

  • గిద్దలూరు నియోజకవర్గంలో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గిద్దలూరు నగర పరిధిలోని 6 గ్రామాలకు పరిసరాల్లోని 14 గ్రామాలకు దీని ద్వారా తాగునీటిని అందించారు. రాచర్ల మండలంలో రూ.22 కోట్లు వెచ్చించి రామన్నకతువ ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా 20 గ్రామాలకు తాగునీటిని అందించారు. గుండ్లమోటు ప్రాజెక్టుకు వైఎస్‌ రూ.11 కోట్లు నిధులిచ్చారు. 

  • చీరాల నియోజకవర్గంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 సంవత్సరాల వయస్సుకే పింఛన్‌ను ఇప్పించారు. చిలపనూలుపై ఉన్న 22 శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని వైఎస్‌ రద్దు చేశారు. రంగు, రసాయనాలు, నూలుపు 10 శాతం సబ్సిడీ ఇచ్చారు. 

  • అద్దంకి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నార్కెట్‌పల్లి, అద్దంకి, మేదరమెట్ల రాష్ట్రీయ రహదారిని నిర్మించారు. జలయజ్ఞంలో భాగంగా బల్లికురవ మండలంలో భవనాశి రిజర్వాయర్‌ను నీరిచ్చి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కొరిశపాడులో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత వైఎస్‌కే దక్కింది.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top