
సాక్షి, అమరావతి: టీటీడీలో అక్రమాలను ప్రశ్నించారనే కక్షతో అర్చకులకు పదవీ విరమణ ప్రకటించడంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అర్చకులపై కక్ష సాధింపులకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తూ గురువారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమ శాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపులకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైనది కాదు.
ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో చంద్రబాబు ధనయావ, అధికార దాహం మరోసారి వెల్లడైంది. అనువంశిక సేవకులుగా స్వామి వారికి అన్ని కైంకర్యాలు నిర్వహించే హక్కు శక్తి ఉన్నంత కాలం ఆ అర్చకులకు ఉంటుంది. పదోన్నతితో కూడిన పేస్కేలు, పదవి తరువాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వనపుడు, ఉద్యోగిగా పరిగణించనపుడు, వారికి ప్రభుత్వం రిటైర్మెంటును ప్రకటించడం అర్థం లేనిది.
దేవుని మీద భయం, భక్తి లేని వారు కాబట్టి గుడి భూములను కాజేయాలని చూశారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలో దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం. ఈ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తాం’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.