ఇది ‘ప్రజా సంకల్పం’

ys jagan started to padayatra 'praja sankalapam' - Sakshi

పాదయాత్ర పేరు ప్రకటించిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌

ప్రజలతో మరింతగా మమేకం అవ్వాలని పార్టీ నేతలకు పిలుపు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి సమావేశంలో దిశానిర్దేశం

యాత్ర జరుగుతుండగా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు

నవంబర్‌ 11 నుంచి ‘రచ్చబండ–పల్లె నిద్ర’ చేయనున్న పార్టీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు తాను నవంబర్‌ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెడుతున్నట్లు ఆయన పార్టీ శ్రేణుల కరతాళధ్వనుల మధ్య ప్రకటిం చారు. 3,000 కిలోమీటర్ల తన యాత్రలో దారి పొడవునా 45 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. హైద రాబాద్‌ ఎమ్మెల్యే కాలనీలోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో గురువారం జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశంలో పాద యాత్ర ప్రాధాన్యతను జగన్‌ వివరించారు.  ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో మూడువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని చెప్పారు. పాదయాత్ర సంద ర్భంగా దారి వెంబడి ఐదువేల చోట్ల ప్రజల తో సమావేశం అవుతామని, 180 సంఘాల తో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని, 125 నియోజకవర్గాల్లో భారీ జనసందోహంతో బహిరంగ సభలు ఉంటాయని వివరించారు.

20 వేల మంది పార్టీ కార్యకర్తలను కలుసుకోవడంతో పాటు, 10 వేల గ్రామాలు, నివాసిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర జరుగు తున్నపుడు ఇతర జిల్లాల్లో చేపట్టాల్సిన 120 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా, నాణ్యతతో (క్వాలిటీతో) నిర్వహించడం ఎంత అవసరమో జగన్‌ నొక్కి చెప్పారు. ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్‌ నెలలోనే జరుగుతాయనే సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నందున ప్రతిష్టగా తీసుకుని ‘రచ్చబండ– పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరింతగా ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పాదయాత్ర సుమారు ఆరేడు నెలలు జరుగుతుందన్నారు. ఇప్పటి అంచనా ప్రకారం తన యాత్రలో శీతాకాలం, మండు వేసవి, మళ్లీ వర్షాకాలం మొదలయ్యే వరకూ కొనసాగుతుందని, అది జూలై 10వ తేదీ వరకూ ఉంటుందని, అంతకుమించి పొడిగిం చరాదని భావిస్తున్నామని తెలిపారు. పాద యాత్ర జరుగుతున్న సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై ఇదివరకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇతర సీనియర్‌ నేతలతో సమావేశం నిర్వ హించామని.. వారి సలహాలను, సూచనలను క్రోడీకరించి ఈ ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పాద యాత్ర, రచ్చబండ–పల్లె నిద్ర కార్యక్రమా లపై ప్రత్యేకంగా తయారు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో వివరాలను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ వివరించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా  ఇంచార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రత్యేక హోదాపై చైతన్యం
ప్రత్యేక హోదా సాధన పార్టీ లక్ష్యమని జగన్‌ పార్టీ నాయకులకు స్పష్టంచేశారు. రచ్చబండ, పల్లె నిద్రల కార్యక్రమాల్లో ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లో చైతన్యం నింపేలా నాయ కులు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చా రు. హోదాకు మద్దతుగా 50 లక్షలకు పైగా సంతకాలు సేకరించాలని ఆదేశించారు. 1,400కు పైగా కాలేజీల్లో విద్యార్థుల మద్దతు తీసుకోవడం, వారిలో చైతన్యాన్ని నింపేలా నాయకులు దృష్టిపెట్టాలని సూచించారు. దీని పై ఒక షెడ్యూల్‌ ఖరారు చేశామని నాయకు లు, దాన్ని అనుసరించాలని కోరారు.

సంస్థాగతంగా భారీ మార్పులు
పార్టీని బలోపేతం చేసే దిశగా సంస్థాగతంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని జగన్‌ వెల్లడించా రు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే 25 లోక్‌సభ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జిల్లా అధ్యక్షుల వ్యవస్థ స్థానంలో పార్లమెం టు నియోజకవర్గాల ప్రాతి పదికగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కష్టపడి పనిచేసే వారికి అప్పగించబోతు న్నామని తెలిపారు. ప్రజా సంకల్పం పాద యాత్ర పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో చంద్రబాబు పునాదులు కదిలిపో వాలని, అందుకు మన మంతా కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేస్తు న్నానని జగన్‌ అన్నపుడు సభలో చప్పట్లు మారుమోగాయి.

రచ్చబండ–పల్లె నిద్ర
పాదయాత్ర జరుగుతున్న నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను కూడా జగన్‌ వివరించారు. నవంబర్‌ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమం 120 రోజులపాటు 175 నియోజకవర్గాల్లో జరుగుతుందని, నియోజకవర్గాల్లో 80 శాతం ప్రజలను కలుసుకునేలా రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. లక్షలాది మంది బూత్‌ కమిటీ సభ్యులను బలోపేతం చేయడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడం ప్రధాన ఉద్దేశాలని తెలిపారు. రచ్చబండలో గ్రామ సమస్యలను తెలుసుకుని, వాటిపై అవగాహన పెంచుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి సమస్యను పార్టీ నాయకులు నోట్‌ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ  స్థానికంగా ప్రజల నుంచి వచ్చే సమస్యలను క్రోడీకరించడం, అందులోనే వాటికి పరిష్కార అంశాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టోను ప్రకటిద్దామని చెప్పారు. తన పాదయాత్ర ముగిశాక బస్సు యాత్రలో వీటిని విడుదల చేస్తామన్నారు. ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను తానే తీసుకుంటానని హామీనిచ్చారు. పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు మేనిఫెస్టో కాదని, ఈ నవరత్నాలపై ప్రజల నుంచి, నిపుణుల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి మరింత మెరుగ్గా రూపొందించి ఆ తర్వాత మేనిఫెస్టోలో చేరుస్తామని స్పష్టంచేశారు.  

మనమంతా ఒకే కుటుంబం... అది వైఎస్సార్‌ కుటుంబం
మనమంతా ఒకే కుటుంబం– అది వైఎస్సార్‌ కుటుంబం అనే నినాదంతోనే ప్రజలకు మన సందేశం వినిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సూచన మేరకు ఆయన గురువారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్‌ పాదయాత్ర, రచ్చబండ– పల్లె నిద్ర కార్యక్రమాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను వివరించారు. ప్రధానంగా ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నామని, వాటిపై తమ గళాన్ని వినిపిస్తామని పార్టీ నేతలు భరోసా ఇవ్వాలన్నారు. వైఎస్సార్‌సీపీ అందరి పార్టీ, దీనికి కుల, మత భేదాలు లేవు, అందరమూ సంక్షేమం కోసం పాటుపడదామనే ఐక్యత కనిపించాలని చెప్పారు. మనమంతా ఒకే కుటుంబం, ప్రజావాణి, ఇది అందరి పార్టీ, అభ్యున్నత ఆంధ్రప్రదేశ్‌ వైపు అనే అంశాలపైనే మన సందేశం ఉండాలన్నారు. పాదయాత్ర దారి వెంబడి సమావేశాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, ప్రభావిత సంఘాల సమావేశాలు, భారీ బహిరంగ సభలు, విభిన్నమైన కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణ– చిరస్మరణీయమైన ముద్ర వేసే అంశాలు వంటి వివరాలను ఆయన వెల్లడించారు. వివిధ స్థాయిల్లో కమిటీలు చేయాల్సిన పనులు, కో–ఆర్డినేటర్లు పాటించాల్సిన మార్గదర్శకాలను ఆయన వివరించారు.  

పాదయాత్ర కీలక అంశాలు
పాదయాత్ర దారి వెంబడి విస్తృతంగా సమావేశాలు
పార్టీ కార్యకర్తల సమావేశాలు
ప్రభావిత సంఘాల సమావేశాలు
భారీ బహిరంగ సభలు.. విభిన్నమైన కార్యక్రమాలు
చిరస్మరణీయమైన ముద్ర: జెండా, విగ్రహావిష్కరణ

రచ్చబండ ముఖ్యాంశాలు
నియోజకవర్గానికి కనీసం 30 కీలక గ్రామాల్లో రచ్చబండ నిర్వహణ
ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ
కీలకమైన సామాజికవర్గాల ముఖ్యనేతలతో సమావేశం
బూత్‌ కమిటీలను బలపరచడం
గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం
పల్లెనిద్ర
కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top