విద్యా ప్రమాణాలపై రాజీలేదు

Ys Jagan Review Meeting With Higher Education Commission - Sakshi

ఉన్నత విద్యా కమిషన్‌తో సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సృష్టికరణ

నా నుంచి ఎలాంటి రికమండేషన్లు ఉండవు.. 

లోపాల సవరణకు 6 నెలల గడువు

దారికిరాని కాలేజీలపై చర్యలు తప్పనిసరి

సాక్షి, అమరావతి: ‘విద్యా ప్రమాణాలపై ఎక్కడా రాజీ పడొద్దు... కాలేజీల విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకూ లొంగవద్దు... నా నుంచి ఎలాంటి రికమండేషన్లు ఉండవు... వేరే ఎవరు చెప్పినా లెక్క చేయవద్దు... నిస్పక్షపాతంగా, స్వతంత్రతతో వ్యవహరించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతవిద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ను ఆదేశించారు. అన్ని కాలేజీలు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. లంచాలు ఇస్తే సరిపోతుందనే ధోరణి ఎక్కడా కనిపించకూడదని హెచ్చరించారు. నిర్దేశిత ప్రమాణాలను కాలేజీలు కచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా బోధనకు వీలుగా అన్ని మౌలిక  సదుపాయాలు కాలేజీల్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.

నాణ్యత పెరిగిందని కచ్చితంగా కనిపించాలి
‘మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవడానికి అవసరమైతే 6 నెలల సమయం ఇవ్వండి. పరిస్థితి మారకుంటే ఆ తర్వాత వాటిపై చర్యలు తప్పనిసరి అని సందేశం వెళ్లాలి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల్లో నాణ్యత మెరుగుపడుతోందని కచ్చితంగా కనిపించాలి’ అని సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలపై కమిషన్‌ చైర్మన్, ఇతర సభ్యులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు.  కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.భార్గవ రామారావు, కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి, శాంతారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, కమిషన్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.రాజశేఖరరెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాయక్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. తాను చేపడుతున్న కార్యక్రమాలపై కమిషన్‌ ఈ సందర్భంగా సీఎంకు ప్రజేంటేషన్‌ ఇచ్చింది.  

అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ కోర్సులు
‘మనం విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారితోపాటు ఇతర వర్గాల్లోని పేద పిల్లలు చాలామంది దీనివల్ల లబ్ధి పొందుతారు. ఇదే కాకుండా డిగ్రీ, ఆపై కోర్సులు చదివే వారికి వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇవ్వబోతున్నాం’ అని సమావేశంలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. చదువులు పూర్తి కాగానే ఉద్యోగం, ఉపాధి కల్పించేలా పాఠ్యప్రణాళిక మారుస్తామన్నారు. ‘డిగ్రీ  విద్యార్థులకు ఏడాది పాటు అదనంగా అప్రెంటిస్‌ ఇవ్వబోతున్నాం.

వీటిని సాధారణ డిగ్రీలుగా కాకుండా ఆనర్స్‌ డిగ్రీలుగా పరిగణించాలి. ఒక ఏడాది అనుభవంతో కూడిన డిగ్రీకి మంచి విలువ ఉంటుంది. ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉంది. సరైన ప్రాక్టికల్‌ అనుభవం లేకపోతే విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలవలేరు’ అని సీఎం అభిప్రాయపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కాలేజీలకు ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. పాత బకాయిలు పూర్తిగా చెల్లించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిర్ణీత సమయంలో ఫీజులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి చేయాల్సిందంతా చేస్తామని, ప్రమాణాల విషయంలో కాలేజీలు కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

రికార్డుల నిర్వహణ సరిగాలేదు
రాష్ట్రంలో ఇటీవల కొన్ని కాలేజీల్లో ఆకస్మిక తనిఖీల సందర్భంగా వెలుగు చూసిన అంశాలను కమిషన్‌ సభ్యులు సీఎంకు వివరించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం క్వాలిఫైడ్‌ బోధనా సిబ్బంది లేరని, ల్యాబ్స్‌లో పరికరాలు సరిగ్గా లేవని, టీచర్లు, విద్యార్థుల హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదని తెలిపారు. ఆదాయ వ్యయాలు, జీతాల చెల్లింపులకు సంబంధించి రికార్డులు కూడా సక్రమంగా లేవన్నారు.

ఆంగ్ల మీడియంపై కమిషన్‌ అభినందనలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుండటంపై ముఖ్యమంత్రి జగన్‌ను కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య అభినందించారు. సీఎం అమలు చేస్తున్న కార్యక్రమాలను దేశం మొత్తం చూస్తోందన్నారు. తమ చిన్నప్పుడు ఇంగ్లిష్‌  ఒక ముక్క మాట్లాడితే గొప్పగా చూసేవాళ్లమని, అలాంటిది పేదపిల్లలకు చిన్నప్పటి నుంచే ఆంగ్లంలో బోధన ద్వారా ఉత్తమ విద్యను అందించాలన్న సంకల్పం గొప్పదన్నారు. ‘వాళ్లు ఒకటి పాటిస్తూ వేరేవాళ్లు ఇంకొకటి  చేయాలనే రీతిలో కొంతమంది ఇంగ్లిష్‌ మాధ్యమంపై మాట్లాడటం సరికాదు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మళ్లీ తమ వాదనను మార్చుకున్నారు’ అనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top