
31–01–2018, బుధవారం
పొదలకూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు సాగిన పాదయాత్రలో నన్ను పలకరించిన ప్రతివ్యక్తీ.. ఈ ప్రాంతానికి నాన్నగారు చేసిన సేవలను గుర్తుచేశారు. చనిపోయి ఇన్నేళ్లయినా ఇప్పటికీ జనం గుండెల్లో చిరస్థాయిగా ఉండటానికి కారణం.. ఆయన చేసిన మంచి పనులే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కృష్ణపట్నం పోర్టుకు టెంకాయ కొట్టడం తప్ప ఒక ఇటుక కూడా వేయలేదు. ఆ తర్వాత వచ్చిన నాన్నగారు అకుంఠిత దీక్షతో కృష్ణపట్నం పోర్టును పూర్తిచేశారు. మాటల ముఖ్యమంత్రికి, చేతల ముఖ్యమంత్రికి ఉన్న తేడా అదే. పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడది ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైంది.
ఇనకుర్తి వద్ద నిమ్మ రైతులు కలిసి, తమ కష్టాలను కళ్లారా చూడాలని, రోడ్డు పక్కన రాశులుగా పోసిన నిమ్మకాయల వద్దకు నన్ను తీసుకెళ్లి.. తమ గోడు వినిపించారు. గిట్టుబాటు ధరలేక, నష్టాలకు అమ్మలేక, రోడ్డుపై పారబోయలేక సతమతమవుతున్నారట. చాలా చోట్ల కూలి కూడా గిట్టుబాటు కాక, నిమ్మ కాయలను చెట్లకే వదిలేశారు. చెట్ల పొదల్లో రాలిపోయిన నిమ్మ కుప్పలను చూస్తే.. గుండె తరుక్కుపోయింది. రైతు వద్ద ఒక్కో కాయ 30 పైసలు కూడా పడదట. మరి హెరిటేజ్ షాపులో ఒక్కోటి రూ.4 నుంచి రూ.5కు అమ్ముతున్నారే! జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రాంత నిమ్మ రైతులకు నేడు ఎంత దుస్థితి!
పొదలకూరు వద్ద సిరి గోల్డ్ వల్ల మోసపోయిన బాధితులు కలిశారు. తినీతినక కూడబెట్టిన సొమ్ము అందులో పెట్టామని కొందరు, ఆ సంస్థ మాటలు నమ్మి జనం సొమ్ము కట్టించామని మరికొందరు చెప్పారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, ఆత్మహత్యలే శరణ్యమని కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు జాలేసింది. ఇలాంటి బాధితుల కోసం ప్రత్యేక కోర్టులు పెడతానని, బాధితులకు న్యాయం చేస్తానని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రికి.. ఇన్నేళ్లుగా వీళ్ల గోడు ఎందుకు వినపడలేదు? అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, సిరిగోల్డ్.. పేరేదైనా బాధితులు మాత్రం పేద ప్రజలే.. ప్రతినాయకులు నేటి పాలకులే. అధైర్య పడొద్దని, మంచి రోజులు రానున్నాయని, ఆ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు కదిలాను.
‘అయ్యా.. ఈ రోజు చంద్రగ్రహణం. కొద్ది గంటల సేపు ఉండి ఆ గ్రహణం వీడిపోతుంది.. మరి నాలుగేళ్లుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంతోషానికి పట్టిన ఈ చంద్ర గ్రహణం కూడా తొందరగా వీడిపోవాలయ్యా..’ అంటూ పెంచలయ్య అనే అన్న చెప్పిన పదాలు పదేపదే గుర్తుకొచ్చాయి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారి హయాంలో రైతులందరికీ గిట్టుబాటు ధర లభించేది. మీరు అధికారంలో ఉన్న ప్రతిసారీ.. గిట్టుబాటు ధరలేక, తీవ్ర ఇబ్బందుల్లో రైతన్నలు ఎందుకు విలవిల్లాడుతున్నారు? రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల మీకున్న దృక్పథమే కారణం కాదా?