
04–02–2018, ఆదివారం
దేవరపాళెం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
మనం చేసే మంచి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.. ఈ రోజు ములుమూడిలో పద్మావతి అనే అక్క కలసింది. ఆమె నన్ను ఏమీ కోరడానికి రాలేదు.. ఏ సమస్యా చెప్పుకోలేదు. నన్ను కలసి కృతజ్ఞతలు తెలియజేసింది. పేద కుటుంబానికి చెందిన ఆమె ఒక్కగానొక్క కొడుక్కి గుండె జబ్బు ఉండేదట. అది తెలిసి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారట. ఆ సమయంలో నాన్నగారి చలవతో ఆ బిడ్డకు ఉచితంగా గుండె ఆపరేషన్ జరిగిందట. ఇప్పుడా పిల్లాడు చక్కగా చదువుకుంటున్నాడని ఆ తల్లి సంతోషంతో కృతజ్ఞతలు తెలిపింది. ఈ రోజు కోట్లాది మంది ప్రజలు నాన్నగారిని తమ గుండెల్లో పెట్టుకుంటున్నారంటే.. పేదల సంక్షేమం పట్ల ఆయన పడ్డ ఆరాటం, వారి కోసం ఆయన అమలు చేసిన పథకాలే కారణం.
‘జాబు రావాలంటే.. బాబు రావాలి’అన్నది ఎంత బూటకమో తెలియజేసే మరో ఘటనే.. ఈ రోజు నన్ను కలిసిన ఫార్మా డీ డాక్టర్ల ఉదంతం. 2008లో కేంద్ర ప్రభుత్వం ఆరు సంవత్సరాల ఫార్మా డీ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70 కళాశాలలకు అనుమతిచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు బయటికొచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల ప్రకారం.. ప్రతి 50 పడకలకు ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ (ఫార్మా డీ) కోర్సు చేసిన వారుండాలన్నది నిబంధన. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ పోస్టులనే సృష్టించలేదు.
దీంతో దాదాపు 3000 మంది ఫార్మా డీ అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారట. ఇటీవలే ఆ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు 12 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కూడా చేపట్టారట. అయినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. తక్షణమే తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే.. దాదాపు రూ.10 లక్షలు ఖర్చుచేసి పూర్తిచేసిన తమ చదువు నిరర్థకమవుతుందని వాపోయారు.
‘బాబు వస్తే జాబు రావడం కాదు.. ఉన్న జాబులు ఊడుతున్నాయ్ అనేందుకు మేమే నిదర్శనం’అన్నారు.. నన్ను కలసిన విక్రమ సింహపురి అధ్యాపకులు. ఈ యూనివర్సిటీ ప్రారంభం నుంచి తాము పనిచేస్తున్నామని, ఈ ప్రభుత్వం వచ్చాక నిబంధనలకు విరుద్ధంగా 26 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పారు. ఈ అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించగా.. మమ్మల్ని కొనసాగించాలని ఆదేశాలిచ్చిందని, ఆ ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారని వాపోయారు. విధిలేని పరిస్థితుల్లో కోర్టు ధిక్కార కేసు దాఖలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ‘జాబు ఉండాలంటే.. బాబు పోవాలనే పరిస్థితి వచ్చింది’అని చెప్పారు. నాన్నగారి హయాంలో ఉద్యోగంలో చేరిన వారిని కావాలనే వేధిస్తున్నారట. వాళ్లు చేసిన తప్పేంటి? ఎందుకు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు?
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్ర విభజన సమయంలో 1,42,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ధ్రువీకరణ జరిగింది. వీటిలో ఒక్క ఖాళీ అయినా భర్తీ చేశారా? ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను సైతం పీకేస్తుండటం న్యాయమేనా?