78వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

మంచి పనులకు మరణం ఉండదని మరోసారి రుజువైంది 

Published Sun, Feb 4 2018 3:04 AM

ys jagan prajasankalpayatra 78th day dairy - Sakshi

03–02–2018, శనివారం
సౌత్‌మోపూరు,  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన ఆరోగ్య భద్రతా పథకం నాన్నగారిని దేశ ప్రజలకు మరోసారి గుర్తుచేసింది. పేదల కోసం నాన్నగారు పదకొండేళ్ల కిందటే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇప్పటికే 20కి పైగా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’పథకానికి నాన్నగారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీనే ఆదర్శమని నీతి ఆయోగ్‌ కూడా చెప్పడం.. నిజంగా నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఎంతో దార్శనికతతో నాన్నగారు వేసిన అడుగులే.. కేంద్రానికి స్ఫూర్తిదాయకమయ్యాయని నేను గర్వంగా చెప్పగలను. మంచి పనులకు ఏనాడూ మరణం ఉండదని మరోసారి రుజువైంది.  

ఉదయం గిరిజన తెగకు చెందిన డ్రైవర్లు కలిశారు. ఆర్టీసీలో ఉద్యోగాల కోసం 2016లోనే ఇంటర్వ్యూలు నిర్వహించి తమను సెలక్ట్‌చేసి, ట్రైనింగ్‌ కూడా పూర్తిచేయించారని, కానీ.. ఇంతవరకూ పోస్టింగులు ఇవ్వలేదని ఆవేదన చెందారు. తమ సర్టిఫికెట్లు, లైసెన్స్‌లు ఇంకా అధికారుల వద్దనే ఉన్నాయని, ఉద్యోగం రేపిస్తాం, మాపిస్తాం.. అంటూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు. లైసెన్స్‌లు తమ వద్ద లేకపోవడంతో వేరే ఉద్యోగాలు చేసుకోలేక, ఆర్టీసీలో ఉద్యోగం వస్తుందో, రాదో తెలియక.. తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వాపోయారు. సంవత్సరాల తరబడి సంపాదన లేకపోతే వారెలా బతుకుతారు? కుటుంబాలను ఎలా పోషించుకుంటారు? అన్ని అర్హతలున్నాయని తేల్చి, ఉద్యోగాల కోసం ఎంపిక చేసి, రేపో మాపో అపాయింట్‌మెంట్‌ ఇస్తామని చెప్పి.. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తే.. గిరిజనుల పట్ల, వారి బాగోగుల పట్ల ఈ పాలకులకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.  

మధ్యాహ్న భోజన విరామానంతరం ట్రామా కేర్‌ సెంటర్‌ కాంట్రాక్టు ఉద్యోగులు కలసి వినతిపత్రం ఇచ్చారు. రహదారి ప్రమాదాల మరణాల సంఖ్యను తగ్గించి, గాయపడ్డ వారికి ప్రమాద స్థలిలోనే తక్షణ వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో 13 ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవి నిరుపయోగం అవుతున్నాయట. 720 పోస్టులకుగాను.. 400 పోస్టులు మాత్రమే ఈ ప్రభుత్వం భర్తీ చేసిందని, ఉన్న సిబ్బందికీ నెలల తరబడి జీతాలివ్వడం లేదని తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ట్రామా కేర్‌ సెంటర్లపై సమీక్ష నిర్వహించలేదంటే.. ఈ ప్రభుత్వానికి యాక్సిడెంట్‌ బాధితులపై ఉన్న శ్రద్ధ ఏ పాటిదో తెలుస్తోంది. 104, 108 మొదలుకుని, ట్రామా కేర్‌ సెంటర్లు, ఆరోగ్యశ్రీ వరకు.. ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది.  

రాత్రి శిబిరం వద్ద ఆటోడ్రైవర్లు కలిశారు. ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.12,000 దాకా ఖర్చవుతున్నాయని, సర్టిఫికెట్‌ తీసుకోవడం ఆలస్యమైతే.. రోజుకు రూ.50 ఫైన్‌ వేస్తున్నారని వాపోయారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు విపరీతంగా ఉండటంతో.. తమ సంపాదన అంతంత మాత్రంగా ఉందని, బతుకు భారమవుతోందని బాధపడ్డారు. రోజంతా కష్టించినా వచ్చే కొద్దిపాటి డబ్బును ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, ఫైన్‌ల కోసం కడితే ఇక వారికి మిగిలేదేంటి?  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోని ఇరవైకి పైగా రాష్ట్రాల్లో సమర్థవంతంగా అమలవుతోంది. కానీ, పథకం ప్రారంభమైన మన రాష్ట్రంలో మాత్రం నిర్వీర్యం కావడం సిగ్గుచేటైన విషయం కాదా?    

 

Advertisement
Advertisement