
28–01–2018, ఆదివారం
గూడూరు కోర్టు సెంటర్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
వేతనాల కోసం గళమెత్తితే.. ఉద్యోగాల్లోంచి తొలగించడం ఎంత దుర్మార్గం!
కుల ధ్రువీకరణ కోసం ఏళ్లుగా పోరాడాల్సిరావడం చాలా ఆశ్చర్యమనిపించింది. ఉదయం వెందోడు గ్రామానికి చెందిన శెట్టి సుబ్రహ్మణ్యం అనే అన్న తన ఇద్దరు కూతుళ్లతో వచ్చి కలిశాడు. వారు కమ్మర కులానికి చెందినవారట. ఆ కులం ఎస్టీ జాబితాలో ఉందట. ఆయనకు, ఆయన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన ఎస్టీ కులధ్రువీకరణ సర్టిఫికెట్లు కూడా చూపించాడు. ‘అన్నా.. ఏడాదిన్నర నుంచి నా పిల్లల క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నాను. అధికారులు ఇవ్వడంలేదు. ఇతర మండలాల్లోని మా బంధువులకు ఇచ్చారు. మా గ్రామస్తులకు ఇవ్వడంలేదు. కనీసం మాది ఏ కులమో తేల్చమనండి.. లేకపోతే నా ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు ఏమైపోతుందో.. అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తాతను, తండ్రిని, బంధువులను ఎస్టీలుగా గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చి.. ఇప్పుడా పిల్లలకు ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు? వారిది ఏ కులమో సంవత్సరాలుగా నిర్ధారించకపోతే, ఆ పిల్లలు విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోతే.. ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఎంతోమంది తల్లిదండ్రులకు మానసిక క్షోభ కలిగిస్తోంది.
అంగన్‌వాడీలంటే ఈ ప్రభుత్వానికి ముందునుంచీ చిన్నచూపే. వెట్టిచాకిరీ చేయించుకుంటారు.. వేతనాలు సరిగా ఇవ్వరు. అంగన్‌వాడీ మహిళలంటే చంద్రబాబు గారికి గిట్టదేమో! తమకు జీతాలు పెంచాలని ఆ పేద మహిళలు అడిగితే.. గుర్రాలతో తొక్కించిన ఘనత ఆయనదే. వారి సమస్యలను చెప్పుకోడానికి కూడా భయం భయంగా నా వద్దకొ చ్చారు ఆ అక్కచెల్లెమ్మలు. ఎందుకంటే, గతంలో మహిళా దినోత్సవం రోజున నెల్లూరులో జరిగిన మీటింగ్‌లో సాక్షాత్తూ సీఎం గారికి తమ గోడు వెళ్లబోసుకుందామని ప్రయత్నించారట. వారి సమస్యలు వినకపోగా, ఫిర్యాదు చేయడానికి నా దగ్గరికే వస్తారా.. అంటూ గుడ్లురిమారట. మీ సంగతి చూస్తానంటూ బెదిరించిన 24 గంటల్లోనే 15 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారట. ‘అన్నా.. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినందుకు ఇంకేం చేస్తారో..’ అని భయపడ్డారు.
ఫొటోలు తీయొద్దని, పేర్లు రాయొద్దని మీడియాను వేడుకున్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఎవరైనా ఏదైనా అభిప్రాయం చెబితేనో, హక్కులను అడిగితేనో.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అంగన్‌వాడీలకు ఏ రాష్ట్రంలో లేనంత తక్కువగా వేతనాలివ్వడం, నెలల తరబడి జీతాలివ్వకపోవడం, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో, అధికార పార్టీ కార్యక్రమాల్లో వారితో గొడ్డుచాకిరీ చేయించుకోవడం, వారితోనే ఖర్చులు చేయించడం, వేతనాలు, కనీస సౌకర్యాల కోసం గళమెత్తితే.. బెదిరించడం, ఉద్యోగాల్లోంచి తొలగించడం ఎంత దుర్మార్గం! సాయంత్రం ఇందిరమ్మ కాలనీవాసులు కలిశారు. 1,600 కుటుంబాలున్న ఆ కాలనీలో నీరు, కరెంటు లాంటి మౌలిక వసతులేవీ లేవట. మున్సిపాల్టీ వాళ్లను అడిగితే.. పంచాయతీ వారిని అడగండి అంటున్నారట.
పంచాయతీ వాళ్లేమో.. అది మున్సిపాల్టీ వాళ్ల బాధ్యత అంటున్నారట. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏళ్లుగా ప్రజలను ఇక్కట్ల పాల్జేసే హక్కు వారికి ఎవరిచ్చారు? ఆ కాలనీవారు మన రాష్ట్ర పౌరులు కాదా? వారికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? సాక్షాత్తు మున్సిపల్‌శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో.. మున్సిపాల్టీ ప్రజల కష్టాలు పట్టించుకోకపోతే ఎలా? అయినా.. రాజధాని భూముల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఎందుకుంటుంది! సీఎంగారికి నాదో ప్రశ్న.. మహిళా సాధికారత గురించి గొప్పగొప్ప మాటలు చెబుతుంటారు. కానీ అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలు, పొదుపు సంఘాల మహిళలు, తమ న్యాయమైన సమస్యలు విన్నవిస్తే.. కక్ష సాధింపు చర్యలు చేపట్టడం న్యాయమేనా? మీరి చ్చిన హామీలను నెరవేర్చాలని అడిగే హక్కు కూడా వారికి లేదా?