
29–01–2018, సోమవారం
సైదాపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
దూరమైనా, కాలమైనా బలాదూరే
ఇడుపులపాయలో మొదలైన ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజు వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. వెయ్యి కిలోమీటర్లు నడిచినా.. నడిచినట్లే లేదు. ఇష్టమైన వారు తోడుంటే కాలమూ తెలియదు, కష్టమూ తెలియదు. నన్నెంతో అభిమానించేవారు, నేనెంతో ప్రేమించే ప్రజలు తోడుగా నడుస్తుంటే.. దూరమైనా, కాలమైనా బలాదూరే. ఇప్పటి వరకూ నేను వేసిన ప్రతి అడుగులో జనాభిమానం వెన్నంటే ఉంది. ప్రజల ప్రేమ, ఆప్యాయతలనే కాదు.. పేద జనం కష్టాలు, కన్నీళ్లను మరింత దగ్గరగా చూశాను. బడుగు బలహీనులు గుండె గొంతుకలు విప్పారు. చిన్నారుల చిరునవ్వులు, అవ్వాతాతల దీవెనలు, అక్కాచెల్లెమ్మల ఆప్యాయతలు, అన్నాతమ్ముళ్ల అభిమానం.. ఇవన్నీ నాలో బాధ్యతను మరింత పెంచాయి. అడుగడుగునా జనం నాన్నగారి పాలనను కోరుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని.. హైదరాబాద్‌లో చేపట్టిన యాగం ఇప్పటికీ కొనసాగుతోంది. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటుతున్న నేపథ్యంలో వేద పండితులు యాగ ప్రసాదాలు తీసుకొచ్చి ఆశీర్వదించారు. కష్టాల కడలిలో ఉన్న జనానికి మంచి జరిగేలా ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని దీవించారు. ఈ వెయ్యి కిలోమీటర్ల ప్రయాణంలో ప్రతి అడుగులో జనం కడగండ్లు చూశాక నాలో పట్టుదల ఇంకా పెరిగింది. జనం కోసమే కదలాలని.. జనం కోసమే బతకాలని.. జనం గుండెల్లో నిలవాలన్న స్ఫూర్తితోనే నా యాత్ర సాగుతోంది.
తల్లిదండ్రుల పేదరికం ఓ చిట్టితల్లి జీవితానికి శాపమైన దీనగాథ నా గుండెను బరువెక్కించింది. చెన్నూరు హరిజనవాడకు చెందిన సునీతకు 12 ఏళ్ల వయసులోనే 45 సంవత్సరాల వ్యక్తితో రెండో వివాహం చేశారట. అప్పటికే అతనికి అనారోగ్యం కారణంగా ఓ కాలు తీసేశారట. పెళ్లయిన మూడేళ్లకే ఆయన పక్షవాతంతో మంచానపడి ఈ మధ్యనే మరణించాడట. ఆమె కొడుక్కి పుట్టుకతోనే అంగవైకల్యం. ఆ కాళ్లకు ఆపరేషన్ చేయించిందట. ఆ బాబు కోసమే బతుకు వెళ్లదీస్తోందట. బాల్య వివాహంతో బతుకు శాపమై, 22 ఏళ్లకే కొన్ని జన్మల కష్టాన్ని అనుభవించిన ఆ చిట్టి చెల్లిని చూసి మనసు కలత చెందింది.
విజయలక్ష్మి అనే సోదరిది మరో కష్టాల కథ. ఆడపిల్ల పుట్టిందని ఆమె భర్త వదిలేసి పోయాడట. అన్నీ తానై ఆ బిడ్డను పెంచుతోందట. బాగా చదివించాలని కోరికట. తల్లిగా, చెల్లిగా, భార్యగా మన జీవితాల్లో వెలుగులు నింపే ఆడబిడ్డపై ఎందుకీ వివక్ష? ఆ తండ్రిది ఎంత దుర్మార్గం? సమాజంలో ఇలాంటివి ఇంకా జరుగుతుండటం సిగ్గుచేటైన విషయం. ఈ రెండు ఘటనలు చూశాక మనం ఏ యుగంలో ఉన్నామా.. అని అనిపించింది. వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సైదాపురంలో ఏర్పాటు చేసిన విజయ స్థూపాన్ని అశేష జనసంద్రం మధ్య నాతో ఆవిష్కరింపజేశారు. ఆ సందర్భంగా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ‘ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది పెద్ద ప్రాతిపదిక కాదు. ఎన్ని లక్షల మందిని కలిశాం.. ఎంతమందికి విశ్వాసం కలిగించాం.. ఎంతమందికి ధైర్యం కల్పించగలుగుతున్నామనే అంశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలి..’
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రోజూ ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీ గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఎన్నో రకాల జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలో లేవు. ఉన్నవాటిలో చాలావాటి చికిత్సకు మన రాష్ట్రంలో వసతులు, సౌకర్యాలు లేవు. పోనీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వం టి పొరుగు రాష్ట్రాల్లో చేయించుకుందామంటే.. అక్కడ మన ఆరోగ్యశ్రీ వర్తించదు. మరి జబ్బునపడ్డ పేదవాడి పరిస్థితేంటి? వారి ప్రాణాలు గాలిలో దీపాలేనా?