కురుపాం గడ్డ... వైఎస్సార్‌ కుటుంబం అడ్డా...

YS Jagan Praja Sankalpa Yatra in Vizianagaram - Sakshi

వైఎస్‌ జగన్‌ వెంట తరలివచ్చిన గిరిపుత్రులు

జన సందోహంతో కిక్కిరిసిన కురుపాం రహదారులు

కురుపాం ఎమ్మెల్యే దంపతులకు జననేత ప్రశంసలు

మన్యంలో జరిగిన బహిరంగ సభలో గర్జించిన జగన్‌

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపాటు

అభిమాన నాయకుడిని చూసేందుకు వచ్చిన ఒడిశా, రాయఘడ ప్రజలు

సాక్షిప్రతినిధి విజయనగరం: ‘‘కురుపాం గడ్డ.. వైఎస్సార్‌ కుటుంబం అడ్డా’’అని మరోసారి రుజువైంది. కురుపాంలో జరిగిన జననేత భారీ బహిరంగ సభ  ఇందుకు వేదికగా నిలిచింది. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురుపాంలో మం గళవారం జరిగిన భారీ బహిరంగ సభకు గిరిపుత్రులు వేలాదిగా తరలివచ్చారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు వచ్చిన అభిమాన నాయకుడి వెంట అడుగులు వేశారు. కురుపాం మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జన సందోహంతో కిక్కిరిసిపోయింది. రోడ్లన్నీ జనంతో కళకళలాడాయి. మేడలు, మిద్దెలు జనాలతో కిటకిటలాడాయి. ఏ మేడ చూసినా జనంతో కనిపించగా వారందరికీ జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సభ జరుగుతుండగా కురుపాం సభæ జిల్లాలో చివరిది కావడం విశేషం. ఈ సభలోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జననేత ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే దంపతులకు జననేత ప్రశంసలు
కురుపాం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు దంపతులపై ప్రశంసల జల్లు కురిపించారు. నా చెల్లెలు ఎమ్మెల్యే పుçష్పశ్రీవాణి రాజకీయాల్లో తులసి మొక్క అంటూ కొనియాడారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువులను కొన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బుతో కొనుగోలు చేస్తే ఎమ్మెల్యే శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చిన్నవారైనా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే దంపతులకు తన మనసులో ఎప్పటికీ స్థానం ఉంటుందని జననేత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ప్రభుత్వ దమననీతిపై మండిపాటు
కురుపాం నియోజకవర్గంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అవస్థలను, సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సభలో దీర్ఘకాలిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిని తూర్పరబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో కురుపాం నియోజకవర్గంలో ప్రజలకు వేల సంఖ్య లో ఇళ్లు మంజూరు చేసి గిరిజనంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామానికి ఐదు, ఆరు ఇళ్లు మంజూరు చేసి ప్రజా సంక్షేమానికి పాతర వేస్తున్నారన్నారు. రైతన్న కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయటంలో జాప్యం చేస్తూ దళారీ వ్యవస్థను  ప్రోత్సహిస్తూ... అన్నదాతలను అప్పులపాలు జేస్తున్నారన్నారు. వ్యవసాయానికి ఉచితంగా తొమ్మిది గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఏడు గంటలు కాదు కాదా... పగటి పూట కూడా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఉచితంగా ఇవ్వాల్సిన కరెంటుకు లేనిపోని కారణాలు సృష్టించి నెలకు రూ.300లు చొప్పున బిల్లులు జారీ చేస్తోందని జియ్యమ్మవలస మండలంలో రైతుల పడుతున్న అవస్థలను ప్రస్తావించారు. మహానేత వైఎస్‌ హయాంలో 90 శాతం పనులు పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టును మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామాల్లో భూముల రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మహానేత హయాంలో నిర్మించిన జంఝావతి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో ఒడిశాతో చర్చిం చాలన్న కనీస జ్ఞానం లేని పాలన సాగుతోందని మండిపడ్డారు. ఇంకా గుమ్మిడి గెడ్డ మిని రిజర్వాయర్, పూర్ణపాడు –లాబేసు వంతెన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాన్‌తో నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు అరకొర పరిహారాన్ని కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకోవటంపై ధ్వజమెత్తారు.

పల్లెపట్టున ప్రగతికాముకుడు
ఎన్నాళ్లుగానో జననేతకోసం ఎదురుచూస్తున్న పల్లెవాసులు... ఆయన రాగానే ఎంతో ఆదరంగా స్వాగతం పలికారు. తమ చెంతకొచ్చిన నేతతో బాధలు చెప్పుకుని సాంత్వన పొందారు. 302వ రోజైన మంగళవారం జియ్యమ్మవలస మండలం సీమన్నాయుడువలస క్రాస్‌ నుంచి బట్లభద్ర, జోగిరాజుపేట పూతికవలస, కాటందొరవలస క్రాస్, కురుపాం వరకూ సాగింది. ఈ సందర్భంగా పలువురు అపన్నులు తమ కష్టాలను జననేత దృష్టికి తీసుకువచ్చారు. తిత్లీ తుఫాన్‌లో నష్టపోయిన అరటి పంటకు బీమా మొత్తాన్ని చెల్లించకుండా కంపెనీ మోసం చేసిందని జియ్యమ్మవలస మండలానికి చెందిన రైతులు  వాపోయారు. తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా ఇవ్వలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు... సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా పని చేస్తున్న తమకు రావాల్సిన వేతనాల్లో కోత విధిస్తున్నారని పలువురు ఏఎన్‌ఎంలు తెలిపారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గ్రామాల్లో గుర్తింపు ఇవ్వాలని కోరారు.

జగన్‌ వెంట నడిచిన సైన్యం
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కురుపాం, సాలూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, రాచమళ్లు శివప్రసాద్‌రెడ్డి, రాయలసీమ పశ్చిమ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు, విజయనగరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా,  బొబ్బిలి, పార్వతీపురం, కాకినాడ రూరల్, సత్యవేడు సమన్వయకర్తలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, కురసాల కన్నబాబు, ఆదిమూలం, అరకు పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, అనంతపురం పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బి.గిరిజమ్మ, రాష్ట్ర కార్యదర్శి పోరేటి నరసింహారెడ్డి, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం ఎంపీపీ ఇందిరా కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top