కష్టాలు వింటూ..భరోసా ఇస్తూ.. | Sakshi
Sakshi News home page

కష్టాలు వింటూ..భరోసా ఇస్తూ..

Published Tue, Oct 21 2014 3:37 AM

కష్టాలు వింటూ..భరోసా ఇస్తూ.. - Sakshi

 ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట నాశనమైంది. పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు ఉపయోగపడుతుందని ఆశలు పెట్టుకున్న కొబ్బరితోట నేలపాలైంది. ఇంటి పోషణకు దోహదపడుతున్న అరటి పంట, ఆదాయాన్నిచ్చే బొప్పాయి కుప్పకూలాయి. తీపినందించే చెరుకు పైరు ధ్వంసమైంది. చేపల వేటే ఆధారమైన మత్స్యకారుల పడవలు, వలలు కొట్టుకుపోయాయి. నష్టాలను కళ్లారా చూసి.. రైతులు, మత్స్యకారుల గోడు విన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుండె తరుక్కుపోయింది. హుదూద్ తుపానుతో ఎంత కష్టం వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాస సహాయమేదీ అందలేదంటూ బాధితులు మొర పెట్టుకున్నప్పుడు మరింత ఆవేదనకు లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్న బాధితులను చూసి చలించిపోయారు.     
 వివరాలు 2లో ఠ
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం/ విజయనగరం కంటోన్మెంట్/ విజయనగరం మున్సిపాల్టీ :  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. సోమవారం రాత్రి జిల్లా పర్యటన ముగించి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించారు. విజయనగరం పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఇంటి నుంచి రెండో రోజు జిల్లా పర్యటన ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డిని పట్టణంలోని జొన్నగుడ్డివాసులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
 
 తుపాను ధాటికి ఇళ్లన్నీ ఎగిరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సాధకబాధకాలు విన్న జగన్ అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అనంతరం విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్లే జమ్ము జంక్షన్ వద్ద సుబేధా అనే వృద్ధురాలు తనకు ఉండటానికి ఇల్లు లేదని చెప్పింది. ‘నిన్ను ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నా.. చూసేశా’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అనంతరం నాతవలస జంక్షన్ వద్ద గల హైవేపై మహిళలు, వృద్ధులు, విద్యార్థులను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బమ్మిడి గంగమ్మ అనే వృద్ధురాలు ‘నా భర్త చనిపోయాడు.. కన్న ఇద్దరు కూతుళ్లు మనువాడి వెళ్లిపోయారు. మొన్న తుపానుతో ఉన్న గుడిసే ఎగిరిపోయింది’ అంటూ ఆవేదన వెలిబుచ్చింది.
 
 అక్కడి నుంచి భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామంలోకి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డికి పోతుల అచ్చియ్యమ్మ అనే వృద్ధురాలు పింఛను రావటం లేదని చెప్పగా.. కమల, దిండిరాణి తదితర  మహిళలు తమ తాటాకు ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. అనంతరం గూడపువలస, దల్లిపేట, బెరైడ్డిపాలెం, రెడ్డికంచేరు, దిబ్బలపాలెం, పిన్నింటిపాలెం, బోయపాలెం, ఎర్రముసలయ్యపాలెం, తోటపల్లి గ్రామాల మీదుగా తీర ప్రాంతమైన ముక్కాం గ్రామానికి జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ‘ప్రభుత్వం బాధితులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ రాలేదు’ అంటూ వాపోయారు. పది రోజులవుతున్నా పిల్లలకు పాల ప్యాకెట్ కానీ, తాగేందుకు మంచి నీటి ప్యాకెట్లు కానీ సరఫరా చేయలేదంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దిబ్బలపాలెంలో కొబ్బరి రైతులను, మత్స్యకారులను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. వారితో మమేకమై కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.  
 
 మత్స్యకారులకు పరామర్శ...
 అక్కడి నుంచి ముక్కాం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి  సముద్ర అలలకు పడవలు, వలలు, ఇళ్లు కొట్టుకుపోయిన మత్స్యకారులను పరామర్శించారు. కష్టనష్టాలను  అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగాపురం, నాతవలస జంక్షన్, కోనాడ జంక్షన్, కొప్పెర్ల, నడిపల్లి, కిలుగుపేట, వెల్దూరు మీదుగా పూసపాటిరేగ మండలం తిప్పలవలస చేరుకున్నారు. మార్గమధ్యంలో కొప్పెర్ల వద్ద పలువురు మహిళలు తమ గోడు వ్యక్తం చేశారు.
 
 ‘నాయనా పేదా రోదా అంతా ఒక్కటై ఏడుస్తున్నారు. నేను కోఆపరేటివ్ బ్యాంకు సభ్యురాలిని. నా ఇల్లు కూలిపోయింది. పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లోనే నచ్చిన సరకులిస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాలాంటి వాళ్లు ఎందరో కనీసం వాటర్ ప్యాకెట్‌కు కూడా నోచుకోలేదు నాయనా..’ అంటూ  శంకాబత్తుల గోవిందమ్మ తదితర బాధితులు జగన్ చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశారు. ‘మాదసలే తీరప్రాంత గ్రామం ఇక్కడకు కనీసం ఏ వాహనం రాలేదు. బయటకు వెళ్దామంటే చెట్లు కూలిపోయాయి. మాకు మంచినీళ్లు కూడా దొరకలేదు. ఎలా ఉన్నారోనని పట్టించుకునేవారే కనిపించలేద’ని వెల్దూరుకు చెందిన మహిళలు జగన్‌మోహన్‌రెడ్డి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. ‘తిప్పలవలస, కొత్తూరు, మద్దూరు గ్రామాల్లో మూడువేల మందిమి నివసిస్తున్నాం.. మాకు బియ్యం కూడా పంపిణీ చేయలేదు’ అని బాధితులు జగన్ ముందు కన్నీరుమున్నీరయ్యా రు. అనంతరం పూసపాటిరేగ, రణస్థలం మీదుగా చీపురుపల్లి మండలం అలక నారాయణపురం, చిన నడిపల్లి, పెద్ద నడిపల్లి, పి.కె.వలసలో జగన్ పర్యటించారు. రాత్రయినా.. విద్యుత్ లేక చీకట్లు కమ్ముకున్నా.. తన పర్యటన కొనసాగించారు. బాధిత రైతులతో మమేకమయ్యారు. వారి బాధలు తెలుసుకున్నారు.
 
 పోరాడితే కానీ ప్రభుత్వం దమ్మిడీ ఇచ్చే పరిస్థితి లేదు : జగన్
 బాధితుల కన్నీళ్లను, వారి ఆవేదననూ విన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి బాధలు చూసి చలించిపోయారు. వెంటనే మనందరం పోరాడదాం. పోరాడితే కానీ ఈ ప్రభుత్వం దమ్మిడీ ఇచ్చేట్టు కనిపించటంలేదు. ప్రతి అవసరాన్నీ వినిపించినా వినని ప్రభుత్వంతో పోరాడి మనకు న్యాయం జరిగేలా చేద్దాం. ఎవరూ అధైర్య పడకండి.. నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు. ఆయన మాటలతో కొండంత ధైర్యం వచ్చిన జనం ఆయనవెంట నడిచారు.ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన,
 
 పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల వెంకటరమణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాముల నాయుడు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ సూర్యనారాయణరాజు, ఇతర నాయకులు కందుల రఘుబాబు, అవనాపు విక్రమ్, వర్రి నర్సింహమూర్తి, గర్భాపు ఉదయభాను, గొర్లి వెంకటరమణ, మజ్జి అప్పారావు, మజ్జి వెంకటేష్, రావాడ బాబు, పతివాడ అప్పలనాయుడు, బర్రి చిన్నప్పన్న, మలకుర్తి శ్రీనివాసరావు, ఎస్‌ఈ రాజేష్, ఆశపు వేణు, మామిడి అప్పలనాయుడు, ఇతర జిల్లాల నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, కాళ్ల గౌరీశంకర్, నడిపేన శ్రీను, బొద్దాన అప్పారావు, పట్నాల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement