ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో
అనపర్తి : ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టనున్న 48 గంటల దీక్షలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపు ఇచ్చారు. అనపర్తిలో మంగ ళవారం డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చేపట్టే పోరాటంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు దీక్షలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ దీక్షకు జిల్లావ్యాప్తంగా అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తణుకు తరలి రావాలని బోస్ కోరారు. అనపర్తి నియోజకవర్గం నుంచి వేలాదిమంది పార్టీ శ్రేణులు తరలేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బోస్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని కోరారు.
ప్రజా విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు సర్కార్..
ఏడాది కాలం తిరగకుండానే చంద్రబాబు సర్కార్ పూర్తిగా ప్రజావిశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండి పడ్డారు. అనపర్తిలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణ మాఫీలు అంటూ అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే రుణమాఫీల విషయంలో పగటి వేషాలు వేయడం విడ్డూరంగా ఉందని దుయ్యపట్టారు. రుణా మాఫీ ఆలోచనతో ఉన్న రైతులు అప్పులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం వడ్డీలు పెరిగి రుణభారం మోయలేనంతగా మారిందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ కరువయ్యిందని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో అనపర్తి నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనరాయణరెడ్డి, రాష్ట్ర రైతు నాయకుడు కొవ్వూరి త్రినాధరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.