నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ కార్యక్రమం అతిథులను ఆకట్టుకుంది.
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ కార్యక్రమం అతిథులను ఆకట్టుకుంది. నవోదయ విద్యాలయ సమితి న్యూఢిల్లీ వారి ఆదేశాను సారంగా స్థానిక విద్యాలయంలో 17వ జాతీయ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని భావిక లోక్‌సభ స్పీకర్, శ్రీకాంత్ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఎంతశాతం మంది ప్రజలు ఉన్నారు..పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటి.. అని ప్రతిపక్ష ఎంపీలు సమావేశంలో ప్రధానమంత్రిని ప్రశ్నించారు. దీనికి కార్మిక మంత్రి సమాధానం ఇస్తు దేశంలో 21.9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారన్నారు. ఇలా సమావేశంలో ప్రతి పక్ష ఎంపీలు ప్రశ్నలు సంధించగా, ఆయా శాఖల మంత్రులు సమాధానాలు చెప్పారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులను, గ్రామస్తులను ఆకట్టుకుంది. విద్యాలయంలోని 37 మంది విద్యార్థులు మంత్రు లుగా, ఎంపీలుగా వ్యవహరించారు.
పార్లమెంట్ గురించి ప్రజలకు చెప్పాలి
యూత్ పార్లమెంట్ కార్యక్రమం చాలా బాగుందని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంతుసింధే అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలపైన ప్రజలకు అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందన్నారు.